AP Free Bus Scheme: ఏపీలో( Andhra Pradesh) ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం విజయవంతంగా కొనసాగుతోంది. స్త్రీ శక్తి పేరుతో ఐదు రకాల ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రతిరోజు లక్షలాదిమంది మహిళలు ఉచిత ప్రయాణ పథకాన్ని వినియోగించుకుంటున్నారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, సిటీ ఆర్డినరీ, సిటీ మెట్రో ఎక్స్ప్రెస్ లలో మహిళలకు ఉచిత ప్రయాణం కొనసాగుతోంది. అయితే ఆర్టీసీకి సంబంధించి అన్ని బస్సు సర్వీసుల్లో ఉచిత ప్రయాణం కల్పించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి. ఈ తరుణంలో ఏపీఎస్ఆర్టీసీ కేలక్క నిర్ణయం తీసుకుంది. ఏసీ బస్సుల్లో సైతం ఉచిత ప్రయాణ పథకం అమలు చేయనున్నట్లు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రకటించారు.
* సూపర్ సిక్స్ హామీగా అమలు..
నెల రోజుల కిందట ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణ పథకం ప్రారంభం అయ్యింది. సూపర్ సిక్స్( super six ) పథకాల్లో భాగంగా మహిళలకు ఆర్టీసీలో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ పథకం అమలుకు సన్నాహాలు ప్రారంభించారు. ఇప్పటికే పథకం అమలవుతున్న కర్ణాటక, తెలంగాణలో మంత్రుల కమిటీ అధ్యయనం చేసింది. ఐదు రకాల బస్సుల్లో ఉచిత ప్రయాణ పథకం అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రస్తుతం రాష్ట్రవ్యాప్తంగా ఈ పథకం ప్రారంభం అయింది. అయితే ఇప్పుడు ఏసీ బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాలని నిర్ణయం తీసుకోవడం విశేషం. స్వయంగా ఈ విషయాన్ని ఆర్టిసి ఎండి ద్వారకాతిరుమల రావు ప్రకటించారు.
* త్వరలో 1050 బస్సులు
త్వరలో రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రిసిటీ బస్సులు( electricity buses) రానున్నాయి. ఇవి గ్రామీణ సర్వీసులుగా సైతం తిరగనున్నాయి. వీటిలో ఏసీలను వినియోగించునున్నారు. అయితే ఇప్పటికే పల్లె వెలుగు సర్వీసులో మహిళలకు ఆర్టీసీ ఉచిత ప్రయాణం కొనసాగుతోంది. దీంతో పల్లె వెలుగుల స్థానంలో ఏసీ బస్సులు అందుబాటులోకి రానున్నాయి. అందులో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కల్పిస్తారన్నమాట. అనంతపురం జిల్లా తాడిపత్రి ఆర్టీసీ డిపోను పరిశీలించారు ద్వారకా తిరుమలరావు. త్వరలో 1050 ఎలక్ట్రిక్ బస్సులు అందుబాటులోకి రానున్నట్లు తెలిపారు. ఇందులో 300 బస్సులు తిరుపతికి, 700 బస్సులు 13 ప్రాంతాలకు కేటాయిస్తారు. అయితే వీటిలో చాలా వరకు గ్రామీణ సర్వీసులకు కేటాయించనున్నారు. ఎక్స్ప్రెస్ సర్వీసులు గాను తిప్పనున్నారు. తద్వారా ఈ ఏసి బస్సుల్లో కూడా మహిళలకు ఉచిత ప్రయాణం కలగనుందన్నమాట.