Free Gas: ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం.. మంత్రి సంచలన ప్రకటన

ఏపీలో ఉచిత పథకాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం సన్నాహాలు ప్రారంభించింది. దీపావళి నుంచి ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు నిర్ణయించింది. ఈ నేపథ్యంలో సంబంధిత మంత్రి కీలక ప్రకటన చేశారు.

Written By: Dharma, Updated On : October 21, 2024 8:53 am

Free Gas

Follow us on

Free Gas: ఎన్నికల హామీలపై చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది. ఎన్నికల్లో అధికారంలోకి వచ్చేందుకు అనేక రకాల హామీలు ఇచ్చారు చంద్రబాబు. ముఖ్యంగా మహిళలను టార్గెట్ చేసుకొని సూపర్ సిక్స్ పథకాలను ప్రకటించారు. అవి ప్రజల్లోకి బలంగా వెళ్లాయి. కూటమికి ఏకపక్ష విజయం దక్కింది. అందుకే ఇప్పుడు చంద్రబాబు సర్కార్ ఎన్నికల హామీలపై దృష్టి పెట్టింది. ప్రాధాన్యతా క్రమంలో అమలు చేసేందుకు ప్రయత్నిస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే పింఛన్లను పెంచింది. ముందుగా చెప్పిన మాదిరిగానే ఏప్రిల్ నుంచి.. మూడు నెలల పాటు బకాయిలను సైతం అందించింది. అన్న క్యాంటీన్లను తెరిచింది. 15 రూపాయలకే పేదలకు మంచి ఆహారం అందిస్తోంది. మరోవైపు వైసీపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ను రద్దు చేసింది. మెగా డీఎస్సీని సైతం ప్రకటించింది. జగన్ సర్కార్ ఇచ్చిన 6000 పోస్టులకు.. మరో తొమ్మిది వేల పోస్టులను పెంచుతూ మెగా డీఎస్సీ ని ప్రకటించింది. ఇలా ప్రజలకు ప్రాధాన్యత అంశాలపై దృష్టి కేంద్రీకరించింది. ఈ తరుణంలో మరో రెండు పథకాలపై ఫోకస్ పెట్టింది. ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందించేందుకు నిర్ణయించింది. దీపావళి నుంచి ఈ పథకం అమలు చేసేందుకు సన్నాహాలు ప్రారంభించింది.

* పెరిగిన గ్యాస్ వినియోగం
ప్రతి కుటుంబంలో ఇప్పుడు గ్యాస్ వినియోగం పెరిగింది. కట్టెల పొయ్యికి ముగింపు పలికారు ప్రజలు. చిన్న కుటుంబం సైతంనెలకు ఒక గ్యాస్ సిలిండర్ వినియోగిస్తోంది. ఈ తరుణంలో చంద్రబాబు పేద ప్రజల భారాన్ని తగ్గించేందుకు.. ఏడాదికి ఉచితంగా గ్యాస్ సిలిండర్లు మూడు అందిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు ఇప్పుడు నిర్ణయం తీసుకున్నారు. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అందించే క్రమంలో.. ఈ ఏడాదికి సంబంధించి దీపావళికి తొలి గ్యాస్ సిలిండర్ను అందించనున్నారు. వచ్చే ఏడాది నుంచి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా అందించేందుకు నిర్ణయించారు. ఇప్పటికే ఈ విషయంపై స్పష్టతనిచ్చారు చంద్రబాబు. రేషన్ కార్డును ఆధారంగా చేసుకుని.. తెల్ల రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఉచిత గ్యాస్ సిలిండర్ అందించేందుకు నిర్ణయం తీసుకున్నారు.

* నాదెండ్ల మనోహర్ స్పందన
తాజాగా ఉచిత గ్యాస్ సిలిండర్ల పథకం పై స్పందించారు మంత్రి నాదెండ్ల మనోహర్. పౌర సరఫరాల శాఖ మంత్రిగా ఉన్న ఆయన.. తాజాగా గ్యాస్ సిలిండర్ల పథకంపై మాట్లాడారు. పూర్తిస్థాయిలో స్పష్టతనిచ్చారు. ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ ధర 830 రూపాయలుగా ఉంది. ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు అంటే.. సరాసరి ఒక కుటుంబానికి 2500 రూపాయలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అందుకే ఏడాదిలో ఈ పథకం నిర్వహణకు 3000 కోట్ల రూపాయల ఖర్చు అవుతుందని మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వంపై ఆర్థిక భారం పడినా..పథకాల అమలులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చిత్తశుద్ధితో వ్యవహరిస్తున్నారని చెప్పుకొచ్చారు. ఈ దీపావళి నుంచి పథకాన్ని పక్కాగా అమలు చేస్తామని ప్రకటించారు. మొత్తానికైతే మరో పది రోజుల్లో కూటమి ప్రభుత్వం మరో ఉచిత పథకానికి శ్రీకారం చుట్టానుందన్నమాట.