https://oktelugu.com/

Parvathipuram: ఉత్తరాంధ్రలో నేలకొరిగిన నాలుగు గజరాజులు

అటవీ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇప్పుడు విద్యాదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఇప్పటివరకూ ఇలా మృతిచెందిన ఏనుగుల సంఖ్య పదికి చేరుకుంది.

Written By:
  • Dharma
  • , Updated On : May 13, 2023 / 10:22 AM IST
    Follow us on

    Parvathipuram: అపార అటవీ సంపద ఉత్తరాంధ్ర సొంతం. తూర్పు కనుమల్లో ఎత్తైన మహేంద్ర గిరులు, అనుసరిస్తూ విస్తరించి ఉన్న అడవులతో చూడక్కగా ఉంటుంది. అరుదైన జంతువులు, పశుపక్షాదులు,  ఔషద గుణాలున్న వృక్షాలు మేలికలయిక గా నిలుస్తుంది. అటువంటి మన్యంలో వృక్షాలపై అక్రమార్కుల గొడ్డలి వేటు పడుతోంది. వన్యప్రాణుల వేట సాగుతోంది. దీంతో అలసిసొలసిపోతున్న అటవీ జంతువులు జనారణ్యంలోకి వస్తున్నాయి. ప్రమాదాలను కోరితెచ్చుకుంటున్నాయి. మృత్యువాత పడుతున్నాయి.

    ఒకటి కాదు.. రెండు కాదు.. ఒకేసారి నాలుగు ఏనుగులు మృత్యువాత చెందాయి. ఈ ఘటన పార్వతీపురం మన్యం జిల్లాలో చోటుచేసుకుంది. గత కొన్నేళ్లుగా రెండు ఏనుగుల గుంపు శ్రీకాకుళం, పార్వతీపురం మన్యంలోని ఏజెన్సీ, మైదాన ప్రాంతాల్లో సంచరిస్తున్నాయి. పంటలకు తీవ్ర నష్టం గురిచేస్తున్నాయి. ఏనుగులబారిన పడి పదుల సంఖ్యలో ప్రజలు మృత్యువాత పడ్డారు. ఏనుగులు తరలించాలన్న డిమాండ్ ఉన్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. పంట నష్టపోయిన రైతులకు పరిహారం కూడా దక్కడం లేదు. ఏనుగులు తరలింపు విషయంలో అదిగో ఇదిగో అంటూ కాలయాపన చేశారే తప్ప.. తరలింపు కార్యక్రమం మాత్రం కార్యరూపం దాల్చలేదు. అయితే ఇప్పుడు ఓకేసారి నాలుగు ఏనుగులు విద్యుత్ షాక్ తో మృతిచెందడం కలకలం రేగింది.

    ఏనుగుల సమస్య ఇప్పటిది కాదు. ఉమ్మడి విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలను దశాబ్దాలుగా ఏనుగులు బాధిస్తునే ఉన్నాయి. ఒడిశాలోని లఖేరి అభయారణ్యం నుంచి 2001లో 11 ఏనుగులు ప్రవేశించాయి.  2013 తర్వాత అవి తిరిగి ఒడిశా వెళ్లిపోయాయి. మళ్లీ 2018న ప్రత్యక్షమయ్యాయి. ప్రస్తుతం వాటి సంతతి పెరిగింది. 14 ఏనుగులు రెండు గుంపులుగా విడిపోయి సంచరిస్తున్నాయి. ఈ రెండు జిల్లాలో అటవీ ప్రాంతం ఉండడం, తాగేందుకు నీరు పుష్కలంగా లభిస్తుండడంతో ఒడిశా వెళ్లేందుకు ఇష్టపడడం లేదు. ఏనుగుల సంచారంతో పంటలకు అపార నష్టం కలుగుతోంది. మూగజీవాలు, మనుషుల ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. నెలల కిందటే ఓ కేర్ టేకర్ ను ఏనుగులు తొక్కి చంపేశాయి.

    ఏనుగులు తరలించాలని రెండు జిల్లాల ప్రజలు కోరుతూ వస్తున్నా ఫలితం లేకపోయింది. ఆపరేషన్ కు నిధులు సమకూర్చడానికి ప్రభుత్వాలు ముందుకు రావడం లేదు. అటు ఒడిశాను కలుపుతూ ఏనుగుల కేరిడార్ ఏర్పాటుచేస్తామన్న హామీ కూడా కార్యరూపం దాల్చడం లేదు. ఏనుగుల జోన్‌ ఏర్పాటుకు సంబంధించి స్థల పరిశీలన చేశారు. కానీ ఎందుకో అది కూడా మరుగున పడిపోయింది. కేంద్ర ప్రభుత్వపరంగా కదలికలు ఉన్నా.. జగన్ సర్కారు మాత్రం పెద్దగా పట్టించుకోవడం లేదు. ఫలితంగా ప్రజలు మూల్యం చెల్లించుకుంటున్నారు. అటవీ జంతువులు సైతం మృత్యువాత పడుతున్నాయి. ఇప్పుడు విద్యాదాఘాతంతో నాలుగు ఏనుగులు మృతిచెందాయి. ఇప్పటివరకూ ఇలా మృతిచెందిన ఏనుగుల సంఖ్య పదికి చేరుకుంది.