Chandrababu : ఏపీలో కూటమి ఘన విజయం సాధించింది. కనీసం వైసిపికి ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. వై నాట్ 175 అన్న నినాదంతో బరిలో దిగిన ఆ పార్టీకి దక్కింది కేవలం 11 స్థానాలే. ప్రజా తిరస్కరణతో వైసిపి నేతల్లో ఒక రకమైన ఆందోళన కనిపించింది. అందుకే ఎక్కువ మంది నేతలు కూటమి పార్టీల వైపు చూడడం ప్రారంభించారు. అయితే ఒకరిద్దరి నేతలకు మాత్రమే కూటమి నుంచి గ్రీన్ సిగ్నల్ లభించడంతో చేరారు. ఇంకా చాలామంది పొలిటికల్ జంక్షన్ లో నిలబడి ఉన్నారు. కానీ ఇటువంటి వారి విషయంలో తెలుగుదేశం పార్టీ మనసు మారింది. బలమైన నేతల చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది ఆ పార్టీ. సర్దుబాటుకు అవకాశం ఉన్నచోట్ల మాత్రమే నేతలకు ఇలా అనుమతించింది. మరోవైపు ఈ విషయంలో జనసేన సైతం ఆచితూచి వ్యవహరిస్తోంది. ఇప్పటివరకు వైసీపీకి రాజీనామా చేసిన నేతల్లో మోపిదేవి వెంకటరమణ, బీద మస్తాన్ రావు టిడిపిలో చేరారు. మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కిలారు రోశయ్య, సామినేని ఉదయభాను జనసేనలో చేరారు. త్వరలో ఆళ్ల నాని టిడిపిలో చేరబోతున్నారు. తాజాగా రాజీనామా చేసిన మాజీ మంత్రి అవంతి శ్రీనివాసరావు, మాజీ ఎమ్మెల్యే గాంధీ శ్రీనివాసరావు ఏ పార్టీలో చేరాలో తేల్చుకోలేకపోతున్నారు.
* మోపిదేవికి అలా అవకాశం
ఎక్కువ మంది నేతలు టిడిపిలో చేరేందుకు మక్కువ చూపుతున్నారు. కానీ టిడిపి మాత్రం కొంతమంది నేతలకు మాత్రమే గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. గుంటూరు జిల్లాలో బలమైన నేతగా గుర్తింపు పొందిన మోపిదేవి, గోదావరి జిల్లాలో ప్రధాన సామాజిక వర్గానికి చెందిన ఆళ్ల నాని విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంది టిడిపి. వాస్తవానికి మోపిదేవి సొంత నియోజకవర్గం రేపల్లెలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. వరుసగా మూడుసార్లు గెలిచారు సత్య ప్రసాద్. కచ్చితంగా తన ప్రత్యర్థిని పార్టీలో చేర్చుకునే క్రమంలో అభ్యంతరం వ్యక్తం చేసి ఉంటారు. అయితే 2029 ఎన్నికల నాటికి నియోజకవర్గాల పునర్విభజన జరుగుతుంది. అప్పుడు మోపిదేవి వెంకటరమణ కుమారుడికి వేరే నియోజకవర్గంలో సర్దుబాటు చేస్తామని టిడిపి హై కమాండ్ హామీ ఇచ్చినట్లు సమాచారం.
* నియోజకవర్గాల పునర్విభజనతో
మాజీ మంత్రి ఆళ్ల నాని చేరిక విషయంలో సైతం ఇదే పరిస్థితి ఎదురైంది. ఏలూరు ఎమ్మెల్యే తో పాటు టిడిపి క్యాడర్ వ్యతిరేకించింది. అయితే ఇక్కడ కూడా చంద్రబాబు అదే ఫార్ములాను అనుసరించినట్లు తెలుస్తోంది. అందుకే అక్కడ లోకల్ క్యాడర్ ఆళ్ల నాని చేరికకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. నియోజకవర్గాల పునర్విభజనలో ఏలూరు రూరల్ నియోజకవర్గం ఏర్పాట అయ్యే అవకాశం ఉంది. అదే జరిగితే అక్కడ ఆళ్ళ నానికి అవకాశం ఇస్తామని.. ఏలూరులో ఇక మీకు అంత నష్టం ఉండదని చంద్రబాబు ఒప్పించినట్లు సమాచారం. దీంతో ఏలూరు ఎమ్మెల్యే తో పాటు టిడిపి క్యాడర్ అంగీకారం తెలిపినట్లు తెలుస్తోంది. అయితే ఈ రెండు నియోజకవర్గాలే కాదు. భవిష్యత్తులో సర్దుబాటుకు అవకాశం ఉన్న చోట్ల చంద్రబాబు ఇదే ఫార్ములాతో ముందుకు అడుగు వేస్తారని తెలుస్తోంది.