YSR congress party : వైసీపీ ఓటమితో చాలామంది నేతలు కనిపించకుండా పోయారు. అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. కనీసం బయట ప్రపంచానికి కూడా కనిపించడం లేదు. పార్టీలో ఒక వెలుగు వెలిగి.. నిత్యం వివాదాస్పద వ్యాఖ్యలు చేసేవారు సైతం సైలెంట్ కావడం విశేషం. వైసీపీలో ఫైర్ బ్రాండ్లకు కొదువ లేదు. అధినేత జగన్ పై ఈగ వాలితే ఇట్టే రెచ్చిపోయిన నేతలు చాలామంది ఉండేవారు. కొడాలి నాని, పేర్ని నాని, వల్లభనేని వంశీ మోహన్, అనిల్ కుమార్ యాదవ్, జోగి రమేష్, గుడివాడ అమర్నాథ్, ఆర్కే రోజా.. ఇలా చెప్పుకుంటూ పోతే ఆ జాబితాలో చాలామంది నేతలు ఉన్నారు. అయితే ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయంతో వీరంతా సైలెంట్ అయ్యారు. ప్రస్తుతానికి అయితే పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్ మాత్రమే ఎంతో కొంత మాట్లాడుతున్నారు. మిగతావారు ఇళ్లకే పరిమితం అయ్యారు. వారు ఎక్కడున్నారో తెలియడం లేదు. కనీసం మీడియా ముందుకు వచ్చి కూడా మాట్లాడటం లేదు. మొన్నటికి మొన్న జగన్ ఢిల్లీలో ధర్నా చేపట్టినా మీరు కనిపించకపోవడం విశేషం. కొద్దిరోజులపాటు సైలెంట్ గా ఉండడమే సేఫ్ అని వీరంతా భావిస్తున్నారు. దాడులతో పాటు కేసులు తప్పవని ఒక అంచనాకు వచ్చారు. అందుకే సొంత వ్యవహారాలకి పరిమితం అవుతున్నారు. క్యాడర్ కు భరోసా ఇవ్వాల్సిన వారు ఇలా సైలెంట్ కావడంపై పార్టీ శ్రేణుల్లో భిన్నమైన కామెంట్స్ వినిపిస్తున్నాయి. అధికారంలో ఉన్నప్పుడు దర్పాన్ని ప్రదర్శించి, వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన వారి విషయంలో వైసీపీ శ్రేణులు ఒక రకమైన అభిప్రాయంతో ఉన్నారు.
* సొంత పార్టీలోనే అభ్యంతరాలు
వైసీపీలో కొందరు నేతల తీరుపై సొంత పార్టీలోనే అభ్యంతరాలు ఉన్నాయి. మాజీ మంత్రి రోజా అంటే ప్రత్యర్థులతో పాటు సొంత పార్టీ నేతలకు కూడా పడదు. ఓటమి తర్వాత ఆమె ఒక్కసారి మాత్రమే అధినేత జగన్ ను కలిశారు. కొద్దిరోజుల పాటు నగిరి లో సొంత ఇంటికి పరిమితమయ్యారు. ఓటమిపై కనీసం సమీక్ష చేయలేదు. అదే చేస్తే సొంత పార్టీ నేతలే ఆమె తీరును ఎండగట్టే అవకాశం ఉంది. అందుకే ఆమె కర్ణాటక, తమిళనాడులో ఆలయాల సందర్శన చేస్తున్నారు. ఇటీవల పారిశుద్ధ్య కార్మికులు తో సెల్ఫీ తీసుకున్న క్రమంలో ఆమె వ్యవహార శైలి విమర్శలకు తావిచ్చింది. అయితే సొంత పార్టీ నేతలే ఆమెను ట్రోల్ చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడు గానీ పార్టీ శ్రేణులతో సమీక్ష నిర్వహిస్తే.. వారు రచ్చ రచ్చ చేసే అవకాశం ఉంది. అందుకే పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు రోజా.
* జాడ లేని అనిల్
అనిల్ కుమార్ యాదవ్ అయితే నెల్లూరు వ్యవహారాలు పట్టించుకోవడం లేదు. 2019 ఎన్నికల్లో నెల్లూరు సిటీ నుంచి గెలిచారు అనిల్ కుమార్ యాదవ్. మంత్రి కూడా అయ్యారు. దీంతో ఇష్టరాజ్యంగా వ్యవహరించారు. కనీసం నెల్లూరు జిల్లాలో వైసీపీ సీనియర్లకు గౌరవం ఇవ్వలేదు. ఆయన తీరుతోనే చాలామంది సీనియర్లు టిడిపిలోకి వెళ్లిపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసిపి నెల్లూరులో ఓడిపోవడానికి అనిల్ కుమార్ యాదవ్ తేరే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. ఈసారి నరసరావుపేట ఎంపీగా పోటీ చేసిన అనిల్ ఓడిపోయారు. ఎన్నికల తర్వాత కొందరి నేతల మితిమీరిన వ్యాఖ్యల మూలంగానే ఓడిపోయామని చెప్పుకొచ్చారు. తాను ఆ జాబితాలో ఉన్న సంగతిని మరిచిపోయారు. ఓటమి తర్వాత వైసీపీకి మద్దతుగా మాట్లాడేందుకు సైతం ఆయన ముందుకు రాకపోవడం విశేషం.
* సీనియర్లు సైలెంట్
అయితే తాజా మాజీ మంత్రులు అధినేత జగన్ కు అండగా నిలబడలేదు. పేర్ని నాని, గుడివాడ అమర్నాథ్, సిదిరి అప్పలరాజు మాత్రమే ఎంతో కొంత మాట్లాడుతున్నారు. సీనియర్లుగా ఉన్న ధర్మాన ప్రసాదరావు, బొత్స సత్యనారాయణ, మిగతావారు పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. అసలు వైసీపీలో ఉన్నామా? లేదా? అన్నట్టు ప్రవర్తిస్తున్నారు. వైసీపీలోనే వీరిపై ఒక రకమైన విశ్లేషణ నడుస్తోంది. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా పుంజుకుంటే మాత్రం.. ఏపీలో వైసీపీ మిగిలే పరిస్థితి ఉండదన్న టాక్ వినిపిస్తోంది. చాలామంది సీనియర్లు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తారని ప్రచారం జరుగుతోంది.