Bandaru Satyanarayana: రాజకీయాల్లో ఉన్నవారు హుందాగా ఉండాలి. చాలా హుందా రాజకీయాలు చేయాలి. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి లేదు. దానికి కారణం ముమ్మాటికి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. ప్రతి పార్టీలోనూ దూకుడు కలిగిన నేతలు ఉంటారు. కానీ వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో అది అధికం. అదే ఆ పార్టీకి ఎనలేని నష్టం కలిగించింది. అందుకే కూటమి అధికారంలోకి వచ్చిన తొలినాళ్లలోనే సీఎం చంద్రబాబు ఎమ్మెల్యేలకు తీవ్ర హెచ్చరికలు చేశారు. రాజకీయ వ్యాఖ్యలు చేసినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలని సూచించారు. పైగా వైసీపీ సోషల్ మీడియా డేగ కన్నుతో ఉంటుందని.. వారికి దొరక్కుండా ఉండాలని కూడా సూచించారు. అయితే కొంతమంది నేతలు ఇవేవీ పట్టించుకోవడం లేదు. యధాలపంగా చేస్తున్న వ్యాఖ్యలు నష్టానికి గురిచేస్తున్నాయి. ముఖ్యంగా ప్రభుత్వ పెద్దలను ఇరకాటంలో పెడుతున్నాయి. తాజాగా టిడిపి మాజీమంత్రి ఒకరు చేసిన వ్యాఖ్యలు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు ఇబ్బంది తెచ్చి పెట్టేలా ఉన్నాయి.
* రోజాపై అనుచిత వ్యాఖ్యలు..
ఉమ్మడి విశాఖ జిల్లాలో మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తి గురించి అందరికీ తెలిసిందే. ఉమ్మడి రాష్ట్రంలోనే సీనియర్ నేతల్లో ఆయన ఒకరు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో మంత్రిగా వ్యవహరించిన రోజా దూకుడుగా ఉండేవారు. ఈ క్రమంలో ఆమె రాజకీయ ప్రత్యర్థులపై వాడే భాష కొంచెం అతిగా ఉంటుంది. ఈ క్రమంలో ఆమెపై బండారు సత్యనారాయణమూర్తి చేసిన వ్యాఖ్యలు అప్పట్లో సంచలనంగా మారాయి. సినిమా నటి అయిన రోజాపై ఆయన అనరాని భాషలో మాట్లాడారు. ఆయన వాడిన భాషకు రోజా కన్నీటి పర్యాంతం కూడా అయ్యారు. అప్పట్లో వైసీపీ ప్రభుత్వం ఈ ఘటనను సీరియస్ గా తీసుకుంది. బండారు సత్యనారాయణమూర్తిని అరెస్టు చేసింది. ఇలా అరెస్టయ్యారో లేదో బండారు బెయిల్ పై బయటకు వచ్చేసారు. అయితే రోజా అంతకుమించి వ్యాఖ్యలు చేసి ఉన్నారు కాబట్టి అప్పట్లో ఆమెకు ఆశించిన స్థాయిలో సానుభూతి రాలేదు.
* నాటి వ్యాఖ్యలను గుర్తు చేస్తూ
అయితే నాడు రోజాపై తాను చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు బండారు సత్యనారాయణమూర్తి. ఓ టీవీ ఇంటర్వ్యూలో మాట్లాడారు. అప్పట్లో రోజాపై చేసిన వ్యాఖ్యలను గుర్తు చేసుకున్నారు. ఈ క్రమంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను గుర్తు చేసుకున్నారు. అప్పట్లో పవన్ పై రోజా అనుచిత వ్యాఖ్యలు చేసేవారని.. ఆ సమయంలో తాను ధీటుగా కౌంటర్ ఇచ్చానని.. ఈ క్రమంలోనే రోజాపై వ్యాఖ్యలు చేసినట్లు ఒప్పుకున్నారు. అయితే అప్పట్లో పవన్ కళ్యాణ్ తనను అభినందించారని చెప్పడం మాత్రం సంచలనంగా మారింది. అంతటితో ఆగకుండా ఓ హోటల్లో ఉన్న తనను చూసిన పవన్ కళ్యాణ్ ఆత్మీయంగా పలకరించారని.. ఆలింగనం కూడా చేసుకున్నారని… ధైర్యంగా ఉండండి అని భరోసా ఇచ్చారని బండారు సత్యనారాయణమూర్తి చెప్పారు. అయితే అప్పట్లో ఏడు పదుల వయస్సు ఉన్న బండారును అరెస్టు చేశారు. మరోవైపు మహిళా నేతగా రోజా హుందాగా నడిచేవారు కాదు. ఈ క్రమంలోనే జైలు నుంచి వచ్చిన బండారును ధైర్యంగా ఉండమని చెప్పి ఉంటారే కానీ.. మహిళల పట్ల అగౌరవంగా ప్రవర్తించే విషయంలో మాత్రం పవన్ కళ్యాణ్ ఎవరిని ఎంటర్టైన్ చేయరని జనసేన వర్గాలు చెబుతున్నాయి. మొత్తానికి అయితే బండారు సత్యనారాయణమూర్తి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ను అడ్డంగా బుక్ చేశారన్న వాదన వినిపిస్తోంది.
పవన్ కళ్యాణ్ ఇతని మాటలను మెచ్చుకొని ఉంటే మాత్రం దాని కంటే దరిద్రం, ఛండాలం వేరొకటి ఉండదుpic.twitter.com/R6ys0eO1ZS
— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) October 20, 2025