Mekathoti Sucharitha: రాజకీయాల్లో ఉండే నేతలకు మాత్రమే కాస్త పలకరింపులు ఉంటాయి. క్రియాశీలక రాజకీయాలకు గుడ్ బై చెప్పిన వారిని ఎవరు పట్టించుకోరు. బహుశా ఏడాదిన్నర కాలంగా ఇదే ఆలోచనతో రాజకీయాలకు దూరంగా ఉండిపోయారు మాజీ మంత్రి మేకతోటి సుచరిత. పాలిటిక్స్ కు గుడ్ బై చెబుతారని కూడా ప్రచారం నడిచింది. అందుకే సైలెంట్ పాటిస్తూ వచ్చారు. ఇప్పుడు మళ్లీ ఆమె పాలిటిక్స్ పై దృష్టిపెట్టారు. క్రియాశీలక రాజకీయాల్లోకి అడుగు పెడుతున్నారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలోనే యాక్టివ్ అయ్యారు. అయితే జగన్మోహన్ రెడ్డి నుంచి అనుకున్న హామీ లభించడంతోనే ఆమె తిరిగి రీఎంట్రీ ఇచ్చారని ప్రచారం నడుస్తోంది.
* కాంగ్రెస్ ద్వారా రాజకీయాల్లోకి..
గుంటూరు జిల్లా( Guntur district ) నుంచి కాంగ్రెస్ పార్టీలోకి ఎంట్రీ ఇచ్చారు సుచరిత. 2006లో తొలిసారిగా జడ్పిటిసి గా పోటీ చేసి గెలిచారు. 2009లో కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి పోటీ చేశారు. గెలుపొంది అసెంబ్లీలో అడుగు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏర్పాటు చేయడంతో ఆయన వెంట అడుగులు వేశారు. ఎమ్మెల్యే పదవిని వదులుకున్నారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో మరోసారి పోటీ చేసి విజయం సాధించారు. 2014లో వైసీపీ తరఫున పోటీ చేశారు ప్రత్తిపాడు నుంచి. కానీ టిడిపి అభ్యర్థి రావెల కిషోర్ బాబు చేతిలో ఓడిపోయారు. 2019లో మరోసారి అదే నియోజకవర్గంలో నుంచి పోటీ చేసి గెలవడంతో జగన్ క్యాబినెట్లో హోం మంత్రిగా పదవి చేపట్టారు. 2024 ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి ఆమెను తాడికొండ టికెట్ ఇచ్చారు. అక్కడి నుంచి పోటీ చేసిన ఆమెకు ఓటమి తప్పలేదు.
* ఆ పరిణామాలతో..
అయితే తనను హోంమంత్రిగా తీసేయడంపై తీవ్ర మనస్థాపానికి గురయ్యారు సుచరిత( Sucharita ). జగన్ కోసం కాంగ్రెస్ పార్టీని వదిలిపెట్టి వస్తే సరైన గుర్తింపు లేదు అన్నట్టు భావించారు. ముఖ్యంగా ఎస్సీ మహిళగా ఉన్న తానేటి వనితను కొనసాగించి.. తనను తొలగించడం పై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు అప్పట్లో.. ఆపై ప్రతిపాడుకు బదులు తాడికొండకు పంపించడం పై కూడా కలత చెందారు. 2024 ఎన్నికల ఫలితాల తర్వాత ఆమె పార్టీకి గుడ్ బై చెబుతారని ప్రచారం నడిచింది. కానీ ఏడాదిన్నరగా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఇప్పుడు పార్టీలో రీఎంట్రీ ఇచ్చి యాక్టీవ్ అయ్యే ఆలోచనతో ఉన్నారు. జగన్మోహన్ రెడ్డి నుండి సరైన భరోసా లభించిందని ప్రచారం నడుస్తోంది.