Dadi Veerabhadra Rao: మాజీ మంత్రి దాడి వీరభద్రరావు పూర్వాశ్రమంలోకి ప్రవేశించనున్నారు. తెలుగుదేశం పార్టీలో చేరనున్నారు. వైసీపీకి ఆయన రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. మెజారిటీ అభిమానుల కోరిక మేరకు తిరిగి టిడిపిలో చేరడానికి ఆయన నిర్ణయించారు. బుధవారం చంద్రబాబు సమక్షంలో దాడి వీరభద్ర రావు తో పాటు ఆయన కుమారులు రత్నాకర్, జై వీర్ లు టిడిపిలో చేరనున్నట్లు తెలుస్తోంది. దాడి వీరభద్రరావు సుదీర్ఘకాలం టిడిపిలో పనిచేశారు. 2014 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. కానీ అక్కడ ఆశించిన స్థాయిలో గుర్తింపు లేకపోవడంతో రాజీనామా ప్రకటించారు.
తెలుగుదేశం పార్టీలో దాడి వీరభద్ర రావు ది సుదీర్ఘ నేపథ్యం. నాలుగు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. మంత్రి పదవులు చేపట్టారు. పార్టీ అధికార ప్రతినిధిగా గట్టి వాయిస్ వినిపించారు. విశాఖ జిల్లాలోసైతం తనదైన ముద్ర చూపించారు. 2014 ఎన్నికలకు ముందు ఎమ్మెల్సీ పదవి రెన్యువల్ చేయడంలో తలెత్తిన వివాదంతో తెలుగుదేశం పార్టీకి రాజీనామా చేశారు. వైసీపీలో చేరిపోయారు. 2014 ఎన్నికల్లో దాడి వీరభద్ర రావు కుమారుడు రత్నాకర్ అనకాపల్లి అసెంబ్లీ సీట్ ను ఆశించారు. కానీ విశాఖపట్నం సీటు కేటాయించారు. అక్కడ ఆయన ఓడిపోయారు. టిడిపి అధికారంలోకి రావడంతో.. దాడి వీరభద్రరావు వైసీపీకి దూరమయ్యారు. పార్టీకి రాజీనామా కూడా చేశారు. సరిగ్గా 2019 ఎన్నికలకు ముందు తిరిగి వైసీపీలోకి ఎంట్రీ ఇచ్చారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా అనకాపల్లి వచ్చిన జగన్ దాడి రత్నాకర్ ను గుండెల్లో పెట్టి చూసుకుంటానని హామీ ఇచ్చారు. దీంతో వైసిపి విజయానికి దాడి కుటుంబం ఎంతగానో కృషి చేసింది. అనకాపల్లి నుంచి పోటీ చేసిన గుడివాడ అమర్నాథ్ గెలుపులో కీలకపాత్ర పోషించారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత దాడి వీరభద్రరావు కుటుంబాన్ని దాదాపు పక్కన పెట్టేశారు. కొంతకాలంగా ఎంపీ సత్యవతి, మంత్రి గుడివాడ అమర్నాథ్ లకు వీరభద్రరావు దూరంగా ఉంటున్నారు. ఇటీవల మంత్రుల బృందం నిర్వహించిన సాధికార యాత్రకు సైతం దాడి కుటుంబానికి ఆహ్వానం లేదు. దీంతో దాడి వీరభద్రరావు రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారు. ఏకంగా రాజీనామా లేఖలను సీఎం జగన్ తో పాటు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయ్ సాయి రెడ్డిలకు పంపించారు. చంద్రబాబు సమక్షంలో నేడు టిడిపిలో చేరనున్నారు. మాతృ పార్టీలోకి వెళ్లడం చాలా ఆనందంగా ఉందని దాడి వీరభద్రరావు చెబుతున్నారు.