Daadi Veerabhadra Rao : ఆయన ఏ పార్టీలో ఉన్న విధేయతతో ఉంటారు. సొంత పార్టీ పట్ల విధేయత భావంతో మెలుగుతారు. అధినేత ఆదేశాలను పాటిస్తారు. అయితే ఆయన రాజకీయ అంచనాల్లో తప్పటడుగులు వేశారు. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నారు. ఫలితంగా ప్రజాక్షేత్రానికి దూరమయ్యారు. దాదాపు పుష్కర కాలంగా పదవులకు సైతం దూరమయ్యారు. ఇంతకీ ఆయన ఎవరో తెలుసా? మాజీమంత్రి దాడి వీరభద్రరావు (daadi Veerabhadrao) . పుష్కర కాలం కిందట వరకు విశాఖ జిల్లా రాజకీయాలను శాసించారు ఈ హిందీ మాస్టారు. మంచి వాగ్దాటితో, సిద్ధాంత పరంగా మాట్లాడడంలో నేర్పరి. అందుకే నందమూరి తారక రామారావు తో పాటు చంద్రబాబు సైతం ఆయనకు ప్రాధాన్యమిచ్చారు. కానీ తెలుగుదేశం పార్టీతో ఉన్న సుదీర్ఘ అనుబంధాన్ని వదులుకొని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరి తప్పు చేశారు దాడి వీరభద్రరావు. దానికి భారీగా మూల్యం చెల్లించుకున్నారు.
* రాజకీయాలకు దూరంగా..
ప్రస్తుతం విశాఖ రాజకీయాల్లో దాడి వీరభద్రరావు( dadi Veerabhadrao )కనిపించడం లేదు. ఆ మాట కూడా వినిపించడం లేదు. 2024 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీలో చేరారు దాడి. కానీ ఆయనకు ఎక్కడా పోటీ చేసే అవకాశం రాలేదు. ఆయన కుమారుడికి సైతం ఎటువంటి నామినేటెడ్ పదవి దక్కలేదు. దీంతో తెలుగుదేశంలో సైతం పెద్దగా యాక్టివ్ గా పని చేయడం లేదు. దీంతో తెర వెనుక రకరకాల ప్రచారం నడుస్తోంది. అసలు ఆయన తెలుగుదేశం పార్టీలో ఉంటారా? లేకుంటే భవిష్యత్తులో వేరే పార్టీలో చేరుతారా? అన్నది హాట్ టాపిక్ అవుతోంది. అయితే చంద్రబాబు మాట ఇవ్వడంతోనే ఆయన తెలుగుదేశం పార్టీలో చేరినట్లు అనుచరులు చెబుతున్నారు. కుమారుడు రత్నాకర్ రాజకీయ భవిష్యత్తు చూసుకుంటానని హామీ ఇవ్వడంతోనే దాడి వీరభద్రరావు మాతృ పార్టీలోకి వచ్చినట్లు కూడా ప్రచారం నడుస్తోంది.
* ఎన్టీఆర్ పిలుపుతో
నందమూరి తారక రామారావు( Nandamuri Tarak Ramarao ) పిలుపుమేరకు తెలుగుదేశం పార్టీలో చేరారు దాడి వీరభద్రరావు. స్వతహాగా హిందీ మాస్టారు అయిన దాడి ఎన్టీఆర్ పిలుపుతో టిడిపిలో చేరారు. 1985లో తెలుగుదేశం పార్టీ తరఫున అనకాపల్లి అసెంబ్లీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. 1989, 1994, 1999లో వరుసగా నాలుగు సార్లు గెలిచారు దాడి. కానీ 2004, 2009లో మాత్రం ఓడిపోయారు. అయినా సరే తెలుగుదేశం నాయకత్వం దాడి వీరభద్రరావు సేవలను గుర్తించింది. ఎమ్మెల్సీ ని చేసి శాసనమండలిలో టిడిపి పక్ష నేతగా కూడా ఎంపిక చేసింది. అయితే రెండోసారి ఎమ్మెల్సీ పదవి ఇవ్వలేదన్న కారణంతో దశాబ్దాల బంధాన్ని పెంచుకొని దాడి వీరభద్రరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు.
* కుమారుడి రాజకీయ భవిత కోసం
అయితే కుమారుడు దాడి రత్నాకర్( Dadhi Ratnakar ) రాజకీయ భవిష్యత్తు కోసమే దాడి వీరభద్రరావు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. కానీ జగన్మోహన్ రెడ్డి అనుకున్న స్థాయిలో అవకాశాలు కల్పించలేకపోయారు. అనకాపల్లి అసెంబ్లీ సీటు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో సైతం తగిన ప్రాధాన్యత దక్కడం లేదు దాడి వీరభద్ర రావుకు. దీంతో భవిష్యత్తు రాజకీయం ఏంటన్నది తెలియడం లేదు. కనీసం టిడిపి సమావేశాలకు హాజరు కావడం లేదు. అలాగని మీడియా ముందుకు కూడా రావడం లేదు. దీంతో ఆయన రాజకీయ వ్యూహం ఏంటన్నది అంతు పట్టడం లేదు.