Buggana Rajendranath Reddy: బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి..మంచి లెక్కలే కాదు.. పిట్ట కథలు కూడా తెలుసు. అందుకే జగన్ ఆయనకు ఆర్థిక శాఖను కట్టబెట్టారు. మంత్రివర్గ విస్తరణలో సైతం ఆయననే కొనసాగించారు.అయితే కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా తన లాజిక్కులను చెప్పుకొచ్చేవారు. కానీ ఇటీవల మాత్రం సైలెంట్ అయ్యారు.దాని వెనుక రేషన్ బియ్యం అంశం వెంటాడుతున్నట్లు తెలుస్తోంది. కాకినాడ పోర్టులో పెద్ద ఎత్తున రేషన్ బియ్యం పట్టుబడిన సంగతి తెలిసిందే. అప్పటినుంచి రేషన్ బియ్యం పాపం వైసిపి నేతలను వెంటాడుతోంది.తొలుత మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపించింది. తరువాత మాజీ మంత్రి పేర్ని నాని కుటుంబం విషయం బయటపడింది. ఇప్పుడు తాజాగా బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది. దీంతో ఈ మాజీ ఆర్థిక శాఖ మంత్రి కొత్త లెక్కలను తెరపైకి తెస్తున్నారు. తనకు ఏ సంబంధం లేదని ముందుగానే తేల్చి చెబుతున్నారు.
* చేతికి మట్టి అంటకుండా వ్యాపారాలు
గత ఐదేళ్ల కాలంలో వైసీపీ నేతలు చేతికి మట్టి అంటకుండా వ్యాపారాలు చేశారు. అటువంటి దానిలో గోదాముల వ్యాపారం ఒకటి. పెద్ద ఎత్తున గోదాములు కట్టారు. వాటిని పౌరసరఫరాల శాఖకు అద్దెకి ఇచ్చారు. అదే గోదాముల్లో స్టాక్ ఉంచిన రేషన్ బియ్యం అటు నుంచి ఆటే బయటకు వెళ్లిపోయిందన్న ఆరోపణలు ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కొక్కటి బయటపడుతున్నాయి. ఈ క్రమంలోనే మచిలీపట్నంలో పేర్ని నాని కుటుంబానికి చెందిన గోదాము నుంచి దాదాపు 7వేల బస్తాలకు పైగా రేషన్ బియ్యం పక్కదారి పట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. దీంతో పేర్ని నాని చుట్టూ ఉచ్చు బిగిసింది. ఒకానొక దశలో ఆయన కుటుంబంతో అజ్ఞాతంలోకి వెళ్లాల్సి వచ్చింది. ఒకవైపు ఫైన్ కడుతూనే మరోవైపు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు పేర్ని నాని.
* ఆ గోదాములు బంధువులువట
ఇప్పుడు కర్నూలు జిల్లా బేతంచర్ల గోదాముల వ్యవహారం కూడా వెలుగులోకి వచ్చింది. అక్కడ నుంచి భారీగా బియ్యం నిల్వలు పక్కదారి పట్టాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ఆ గోదాములు బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డికి చెందినవేనని ప్రచారం నడుస్తోంది. అయితే దీనిపై వెంటనే స్పందించారు రాజేంద్రనాథ్ రెడ్డి. ఆ గోదాములతో తనకు సంబంధం లేదని స్పష్టం చేశారు. అయితే తన బంధువులవి అయి ఉండవచ్చని.. దానికి తానేం చేస్తానని వాపోతున్నారు ఆయన. అయితే ఆయనలో స్పష్టంగా భయం కనిపిస్తోంది. ఆయన మాటలను బట్టి అర్థమవుతోంది. ఆయన బంధువుల పేరుతో ఉన్న గోదాముల నుంచి బియ్యం మాయం చేయగలిగారంటే.. మంత్రిగా ఉన్న బుగ్గన సపోర్ట్ లేకుండా సాధ్యమేనా? అన్న ప్రశ్న వినిపిస్తోంది. ఈ విషయంలో వైసీపీ శ్రేణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. నిజాయితీకి మారుపేరు అంటూ బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తనకు తాను చెప్పుకునే వారిని.. తెర వెనుక ఇంత జరిగిందా? అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేర్ని నాని మాదిరిగానే బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి సైతం కొన్నాళ్లపాటు అజ్ఞాతంలోకి వెళ్లక తప్పదు అన్న సెటైర్లు పడుతున్నాయి. మరి ఏం జరుగుతుందో చూడాలి.