AP Waqf Board: ఏపీలో కొత్త వక్ఫ్ బోర్డును నియమించింది కూటమి సర్కార్. గత ప్రభుత్వం నియమించిన బోర్డును రద్దు చేసిన సంగతి తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా నియమించడంతోనే పాత బోర్డును రద్దు చేసినట్లు సమాచారం. గత ప్రభుత్వం నియమించిన వక్ఫ్ బోర్డు నిబంధనలకు విరుద్ధమని హైకోర్టులో 13 రిట్ పిటిషన్లు దాఖలయ్యాయి. రాష్ట్ర వక్ఫ్ బోర్డు ఎన్నిక పైన కోర్టు స్టే విధించిన విషయాన్ని గుర్తు చేశారు. అందుకే బోర్డు పాలన సజావుగా కొనసాగించడానికి.. బోర్డు ఆస్తుల రక్షణకు గత ప్రభుత్వం జారీ చేసిన జీవో 47 ను ఉపసంహరించినట్లు చెబుతున్నారు. అందుకే తాజాగా వక్ఫ్ బోర్డును నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. గత బోర్డులో ఉన్న వైసిపి ఎమ్మెల్సీ రూహుల్లా ను కొనసాగించారు. షేక్ ఖాజాను కొనసాగించింది ప్రభుత్వం. ఇక బోర్డులో నామినేటెడ్ సభ్యులుగా టిడిపి ఎమ్మెల్యే అబ్దుల్ అజీజ్, మహమ్మద్ నజీర్, షియాల మత పెద్ద విభాగం నుంచి హాజీ ముఖర్రం హుస్సేన్, మహమ్మద్ ఇస్మాయిల్ బేగ్, సయ్యద్ దావూద్ బాషా భాఖవి, షేక్ అక్రమ్ లను నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. 8 మందితో బోర్డు సభ్యుల నియామకం పూర్తయింది. ఈ సభ్యులంతా కలిసి త్వరలోనే చైర్మన్ ను ఎన్నుకుంటారు. అయితే బోర్డులో వైసీపీ ఎమ్మెల్సీని కొనసాగించడం ఆసక్తికరంగా మారింది.
* రాజీనామా ఆమోదం
ఏపీ దేవాదాయ ట్రైబ్యునల్ చైర్మన్ కెవిఎల్ హరినాథ్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. ఈ రాజీనామాను ఆమోదిస్తూ ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. రక్త ప్రభుత్వంలో ఆయన చైర్మన్గా నియమితులయ్యారు. కానీ ఆయన పదవీ కాలాన్ని మరో మూడేళ్లకు పొడిగిస్తూ ఈ ఏడాది ఏప్రిల్ ఒకటిన ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నేపథ్యంలో అక్టోబర్ 24న ఆయన తన పదవికి రాజీనామా చేశారు. తాజాగా ఈ రాజీనామాను దేవాదాయ శాఖ కార్యదర్శి సత్యనారాయణ ఆమోదిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.