Eluru : రాష్ట్రం అని తేడా లేకుండా కొంతకాలంగా దేశవ్యాప్తంగా కోతులు మానవ నివాసాల మీదికి దండయాత్ర లాగా వస్తున్నాయి. పంట చేలను నాశనం చేస్తున్నాయి. మనుషులపై దాడులకు పాల్పడుతున్నాయి. వాటి సహజ శైలికి భిన్నంగా గుడ్లు తింటున్నాయి, మాంసాహాన్ని ఎత్తుకెళ్లి లాగిస్తున్నాయి. సహజంగా ఈ పరిణామాలు కొంతమందికి విడ్డూరం కలిగించవచ్చు. ఇంకా ఏదైనా భావనను కలిగించవచ్చు. కానీ కోతులు ఇలా ప్రవర్తించడంలో పెద్ద ఆశ్చర్యం లేదని జంతు శాస్త్రవేత్తలు అంటున్నారు. ” కొంతకాలంగా దేశంలో మైనింగ్ కార్యకలాపాలు జోరుగా సాగుతున్నాయి. గతంలో ఉన్న గుట్టలు మొత్తం నాశనమయ్యాయి. చెట్లు మొత్తం కాలగర్భంలో కలిసిపోయాయి. దీంతో కోతులకు ఆవాసం లేకుండా పోయింది. ఆహారం లభించని పరిస్థితి ఏర్పడింది. ఇలాంటప్పుడు కోతులకు జీవన్మరణ సమస్య ఎదురయింది. అందువల్లే అవి తమ ఆవాసాన్ని వెతుక్కుంటూ వస్తున్నాయి. ఆహారాన్ని సంపాదించుకోవడానికి సుదూర ప్రయాణాలు సాగిస్తున్నాయి. వాటి ప్రయాణంలో రైతుల పంట చేలు ఎదురైతే దండయాత్ర చేస్తున్నాయి. కిష్కింధ కాండను కొనసాగిస్తున్నాయి. అందువల్లే రైతులు ఇబ్బంది పడుతున్నారు. పంటలు నాశనమై కన్నీటి పర్యంతమవుతున్నారు. కోతులు తమ మనుగడ కోసం చేసే యుద్ధంలో అంతిమంగా మనుషులు నష్టపోతున్నప్పటికీ.. కోతులకు ఆవాసాన్ని, నివాసాన్ని దూరం చేసినప్పుడు ఆ మాత్రం అనుభవించాల్సిందే కదా అని” జంతు శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
హృదయ విదారకం
ఏలూరు జిల్లాలోని దూబచర్ల నుంచి ద్వారకా తిరుమల కు వెళ్లడానికి రోడ్డు మార్గం ఉంటుంది. గతంలో ఈ ప్రాంతంలో విస్తారంగా పండ్ల మొక్కలు నాటారు.. అవి చెట్లుగా ఎదిగాయి. అవి ఇచ్చే ఫల సాయాన్ని భక్తులతో పాటు కోతులు కూడా తినేవి. పైగా ఆ చుట్టుపక్కల ఉన్న గుట్టలు కోతులకు ఆవాసాలుగా ఉండేవి. కొంతకాలంగా ఆ గుట్టలను పెకిలిస్తున్నారు. ఆ పండ్ల చెట్లను నరికేస్తున్నారు. దీంతో ఆవాసం, ఆహారం కరువై ఆ కోతులు రోడ్లమీదకి వస్తున్నాయి. ద్వారక తిరుమల వెళ్లే భక్తుల మీద దాడులు చేస్తున్నాయి.. భక్తులు వేసే అరకొర ఆహార పదార్థాలను తింటూ.. అర్దాకలతో అలమటిస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో వాహనాలకు ఎదురు వెళ్లి రోడ్డు ప్రమాదాలకు గురై కన్నుమూస్తున్నాయి. పండ్ల చెట్లను ఇష్టానుసారంగా నరికి వేయడంతో కోతులు తమ మనుగడ కోసం రోడ్లమీదకి వస్తున్నాయి. తప్పనిసరి పరిస్థితుల్లో ఆహారం కోసం ఏదో ఒక దారి చూసుకుంటున్నాయి. అప్పుడప్పుడు జనారణ్యంలోకి వస్తున్నాయి. ప్రమాదాల బారినపడి ప్రాణాలు కోల్పోతున్నాయి. అయితే ఇలా తమ గ్రామాలకు కోతులు వస్తుండడంతో ఇబ్బంది పడుతున్నామని ప్రజలు వాపోతున్నారు. కోతుల కోసం అటవీశాఖ అధికారులు పండ్ల మొక్కలు నాటాలని, వాటి సంరక్షణ కోసం ఆహారం, నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని కోరుతున్నారు.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Forest officials are requesting that fruit trees be planted for the monkeys and that food and water tanks be set up for their care
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com