Forensic Elections Survey: ఏపీలో గెలుపు ఎవరిదంటే?

తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రీపోల్, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల పేరుతో ఫలితాలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి.

Written By: Raj Shekar, Updated On : May 21, 2024 2:38 pm

Forensic Election Survey On AP Elections 2024

Follow us on

Forensic Elections Survey: దేశంలో సార్వత్రిక ఎన్నికల సమరం కొనసాగుతోంది. తెలుగు రాష్ట్రాల్లో నాలుగో విడతలో ఎన్నికలు జరిగాయి తెలంగాణలో 17 లోక్‌సభ స్థానాలకు, ఆంధ్రప్రదేశ్‌లో 25 లోక్‌సభ స్థానాలతోపాటు 175 అసెంబ్లీ సీట్లకు కూడా ఒకే విడతలో ఎన్నికలు నిర్వహించారు. తెలంగాణలో 66 శాతం పోలింగ్‌ నమోదు కాగా, ఏపీలో 82 శాతం పోలింగ్‌ నమోదైంది.

సర్వే ఫలితాలు వైరల్‌..
తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్‌ ముగిసిన నేపథ్యంలో ప్రీపోల్, ఎగ్జిట్‌ పోల్‌ సర్వేల పేరుతో ఫలితాలు కొన్ని సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతున్నాయి. ఇటీవల తెలంగాణలో 17 స్థానాలపై ఎగ్జిట్‌ పోల్‌ ఫలితాలు వైరల్‌ కాగా, తాజాగా ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ స్థానాల్లో ఎవరు ఎన్ని గెలుస్తారనే సర్వే ఫలితాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఇందులో ఏ నియోజకవర్గంలో ఏ పార్టీ గెలుస్తుందనే వివరాలు కూడా ఉన్నాయి.

ఫోరెన్సిక్‌ ఎలక్షన్‌ సర్వే పేరుతో..
ఈ సర్వే ఫలితాలు ఫోరెన్సిక్‌ ఎలక్షన్‌ సర్వే నిర్వహించినట్లుగా వైరల్‌ అవుతున్నాయి. ఈ సర్వే ప్రకారం 2024 ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల్లో మరోమారు అధికార వైసీపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని పేర్కొంది. ఈ ఎన్నికల్లో వైసీపీకి 112 నుంచి 143 సీట్లు వస్తాయని తెలిపింది. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన కూటమికి 32 నుంచి 63 స్థానాలు వస్తాయని అంచనా వేసింది.

లోక్‌సభ సీట్లు ప్రకటించని సర్వే సంస్థ..
ఇదిలా ఉంటే.. ఈ ఎన్నికల్లో 25 లోక్‌సభ స్థానాల్లో ఏ పార్టీ ఎన్ని సీట్లు గెలుస్తుందనేది ప్రకటించలేదు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జూన్‌ 1వ తేదీ సాయంత్ర 6:30 గంటల వరకు ఎగ్జిట్‌ పోల్స్‌ ప్రకటించొద్దు. కానీ సోషల్‌ మీడియాలో ఫొరెన్సిక్‌ ఎలక్షన్‌ సర్వే పేరుతో వైరల్‌ అవుతున్న ఫలితాల్లో నిజమెంత అనేది మాత్రం తెలియాల్సి ఉంది. అసెంబ్లీ స్థానాలకు సర్వే చేసిన సంస్థ లోక్‌సభ సీట్లకు సర్వే చేయకపోవడం అనుమానాలకు తావిస్తోంది.