AP Police
AP Police: గత కొన్నేండ్లుగా ఏపీ పోలీసుల తీరు వివాదాస్పదంగా మారుతున్నది. రాజకీయ నాయకుల ఒత్తిళ్లే దీనికి కారణం కాగా, వారితో అంటకాగుతూ మరికొందరు పోలీస్ శాఖ ప్రతిష్ఠను మంటకలుపుతున్నారు. ప్రభుత్వంలో ఉన్న కీలక వ్యక్తులు చెప్పింది చేయకపోతే తమ ఉద్యోగాలు ఏమవుతాయోననే భయంతో కొందరు, విధుల్లో ఉండగానే అందినకాడికి దండుకోవాలనే తపనతో మరికొందరు.. ఎలాగైతేనేం ప్రస్తుతం పోలీస్ శాఖ పనితీరుపై విమర్శలు వినిపిస్తున్నాయి. గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఈ తీరు మరింత పెరిగింది. ప్రతిపక్ష పార్టీ నేతలను వేధించడమే పనిగా కొందరు అధికారులు పెట్టుకున్నారు. గతంలో ఏపీలో కీలక పోస్టుల్లో కొనసాగిన కొందరు అధికారులు వైసీపీ నేతలు చెప్పిందే వేదం అన్నట్లుగా ప్రవర్తించారు. ప్రస్తుతం కొత్త ప్రభుత్వం అధికారంలోకి రావడంతో ఇక వారికి చుక్కెదురైంది. ఏకంగా ముగ్గురు ఐఏఎస్ లు పలు కేసులు ఎదుర్కొంటున్నారు. బాలీవుడ్ కు చెందిన ఓ నటిని వేధించిన కేసులు ఏకంగా ముగ్గురు అధికారులు సస్పెన్షన్ కు గురయ్యారు. దీంతో పాటు ప్రతిపక్ష నేతలను బెదిరించడం,వైసీపీ నేతలకు వత్తాసు పలకడం లాంటివి చేసిన వారు ఎందరో ఉన్నారు.
అయితేనేం ఇప్పుడు ప్రభుత్వం మారింది. ఏమైన మారిందా.. అంటే అదే తీరు. ఇప్పటికే పలువురు అధికారులు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటున్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో విఫలమవుతున్నామని ఏకంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పరోక్షంగా హెచ్చరికలు జారీ చేశారంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. తాను హోం మంత్రి అయితే పరిస్థతి హరోలా ఉంటుందని ఆయన ఏకంగా వార్నింగ్ ఇచ్చారు. ఇక కడప జిల్లాల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ప్రధాన అనుచరుడు, గతంలో సోషల్ మీడియాలో టీడీపీ అగ్రనేతలను దుర్బాషలాడిన వర్రా రవీందర్ రెడ్డి విషయంలో నూ అదేవిధంగా ప్రవర్తించారు. ఆయన పోలీస్ స్టేషన్ నుంచే తప్పించుకోవడంతో ప్రభుత్వం సీరియస్ అయ్యింది. ఏకంగా ఎస్పీని బదిలీ చేసింది. మరో సీఐపై కూడా వేటు పడింది.
ఇక రౌడీ షీటర్ బోరుగడ్డ అనిల్ ను జైలుకు తరలిస్తుండగా, ఆయనతో కలిసి బిర్యానీ తిన్న అధికారులపై కూడా ఆ జిల్లా ఎస్పీ వేటు వేశారు. రౌడీ షీటర్లు, నేతలతో కలిసి విందులకు హాజరవడం లాంటివి కూడా విమర్శలకు దారి తీస్తున్నాయి. పలుమార్లు సీఎం చంద్రబాబు నేరుగా హెచ్చరికలు జారీ చేసినా కొందరు అధికారుల్లో మార్పు రాకపోవడంపై టీడీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. దీనిపై రాష్ర్ట డీజీపీ కూడా సీరియస్ గా రియాక్ట్ అయ్యారు. బాధ్యులపై చర్యలుంటాయని హెచ్చరికలు జారీ చేశారు.
ఏదేమైనా ఉరిమి ఉరిమి మంగళం మీద పడినట్లుంది ఏపీ పోలీసుల పరిస్థితి. రాజకీయ నాయకుల మధ్య వైరం కారణంగా ఇప్పుడు ఏ అడుగు వేస్తే భవిష్యత్ లో ఎలాంటి పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందోనని భయంలో కొట్టుమిట్టాడుతున్నారు. మరోవైపు రాష్ర్టంలో మహిళలు, బాలికలు, యువతులపై జరుగుతున్న దాడులు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. రాజకీయ నాయకుల సేవలో పోలీసులు తరిస్తుంటే, తమకు భద్రతేదని సామన్యులు మండిపడుతున్నారు. రానున్న రోజుల్లో మరెంత చూడాల్సి వస్తుందోనని ఆందోళన వ్యక్తంచేస్తున్నారు.
Mahendra is a Senior Political Content writer who has very good knowledge on Business stories. He is a senior journalist with good command on writing articles with good narative.
View Author's Full InfoWeb Title: For the past few years the behavior of the ap police has become controversial