Floods in Amaravati: అమరావతి పై( Amravati capital ) విషప్రచారం జరుగుతోంది. అప్పట్లో అందరి అభిప్రాయంతో అమరావతిని ఎంపిక చేశారు. అమరావతి పనులు మొదలుపెట్టారు చంద్రబాబు. అయితే అమరావతి నిర్మాణం పూర్తయితే చంద్రబాబు పేరు సజీవంగా నిలిచిపోతుంది. నవ్యాంధ్రప్రదేశ్ చరిత్రలోనే అమరావతిని ప్రారంభించిన నేతగా చంద్రబాబు గుర్తింపు సాధించుకుంటారు. అది ఎంత మాత్రం మింగుడు పడని జగన్మోహన్ రెడ్డి అమరావతి రాజధానిని నిర్వీర్యం చేయాలని చూశారు. ఏ నోటితో అయితే అమరావతి రాజధానికి అనుకూలంగా మాట్లాడారో.. అదే నోటితో మూడు రాజధానుల అంశాన్ని తెరపైకి తెచ్చారు. వైసిపి హయాంలో అమరావతిని తొక్కి పెట్టేశారు. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత అమరావతి రాజధాని పునర్నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. గత అనుభవాల దృష్ట్యా 2028 నాటికి కీలక నిర్మాణాలను పూర్తి చేయాలన్న లక్ష్యంతో పని చేస్తోంది రాష్ట్ర ప్రభుత్వం.
చంద్రబాబుకు క్రెడిట్ దక్కకుండా..
ఎట్టి పరిస్థితుల్లో అమరావతి రాజధాని నిర్మాణాన్ని అడ్డుకోలేమని వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) పార్టీ భావిస్తోంది. కానీ అమరావతి రాజధాని నిర్మాణం ద్వారా చంద్రబాబుకు క్రెడిట్ దక్కకుండా చేయడంపై దృష్టి పెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. అనుకూల మీడియాతో పాటు అనుబంధ మీడియాలో విష ప్రచారం జరుగుతూనే ఉంది. వర్షం ప్రారంభం అయితే చాలు అమరావతిలో వరద.. అమరావతిలో నిర్మాణాలు నీట మునక వంటి శీర్షికలతో అనుకూల మీడియాలో ప్రచారం భారీ స్థాయిలో మొదలుపెట్టింది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ. దాని వెనుకున్న లక్ష్యం అమరావతి పై విషం చిమ్మడమే. ప్రజల్లో అపోహలు సృష్టించడమే. వాస్తవానికి అమరావతి రాజధాని నిర్మాణానికి అన్ని రకాల పర్యావరణ అనుమతులు ఉన్నాయి. పైగా నదుల చెంతనే గతంలో చాలా రాజధానులు నిర్మాణం అయ్యాయి. వాటికి లేని అభ్యంతరాలు అమరావతికి ఎందుకంటే.. చంద్రబాబు నిర్మిస్తుండడమే.. ఆ క్రెడిట్ ఆయనకు దక్కుతుందని భావించి.. ఇలా తప్పుడు ప్రచారం చేస్తున్నారు.
అదే పనిగా సాక్షి ప్రచారం..
తాజాగా రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో సాక్షి ( Sakshi media) ప్రజల కష్టాలను పక్కనపెట్టి.. అమరావతి పై విషం నింపే ప్రయత్నం చేసింది. రియల్ ఎస్టేట్ మాయలో పడి కళ్ళు మూసుకుపోయిన ప్రభుత్వం.. అమరావతిని బతికించుకోవడం కోసం.. కొండవీటి వాగు వరద నీటిని కృష్ణా, గుంటూరు, అప్పాపురం చానళ్లకు మళ్లించి 50వేల ఎకరాల పొలాల ముంపునకు కారణం అయ్యింది అంటూ.. అమరావతిని లేపడానికి పొన్నూరు ముంచేశారు అంటూ సాక్షిలో పతాక శీర్షిక కథనాలు ప్రచురించారు. టీవీలో ప్రసారం చేశారు. ఇంకో వైపు సుమన్ టీవీలో సైతం విరిగిపోయిన ప్రకాశం బ్యారేజీ 67వ గేటు అంటూ ఆ ఛానల్ ఫేస్బుక్ పేజీలో నిరాధార సమాచారంతో పోస్ట్ పెట్టారు. అయితే ఈ ప్రధాన ఛానల్ తో పాటు వైసిపి పెంచి పోషించే వెబ్సైట్లు, యూట్యూబ్ ఛానల్ లలో వ్యతిరేక ప్రచారం చేశారు.
Also Read: ఎమ్మెల్యే కూన రవికుమార్ ను దగ్గరి వారే బలి చేశారా.. వెలుగులోకి సంచలన నిజం!
వరద ప్రాంతంలో లేదని స్పష్టం..
గతంలో పర్యావరణ నిపుణులు అమరావతిలో రాజధాని నిర్మాణం సేఫ్ కాదని చెప్పినట్లు వైసిపి మీడియా చెబుతోంది. అయితే కృష్ణా పరివాహక ప్రాంతంలోని శ్రీశైలం, నాగార్జునసాగర్, పులిచింతల డ్యామ్ లు వరదలను నియంత్రిస్తాయని ప్రపంచ బ్యాంకు ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ అసెస్మెంట్ రిపోర్టు 2019లోనే తన అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అమరావతి అనేది వరద ప్రాంతంలో లేదని స్పష్టం చేసింది. కేవలం వాగులు పొంగడం వల్లే రిస్క్ ఉంటుందని తెలిపింది. దీనికి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్స్ అవసరం అని అభిప్రాయపడింది. అందుకు తగ్గట్టుగానే రాష్ట్ర ప్రభుత్వం నీరుకొండ, శాఖమూరు, కృష్ణాయ పాలెం, ఉండవల్లి, వైకుంఠపురం లలో ఈ నీటిని తరలించి.. నిల్వ ఉంచేలా రిజర్వాయర్లను నిర్మిస్తోంది. ఒక్కో రిజర్వాయర్ సామర్థ్యం ఒకటి టిఎంసి కంటే ఎక్కువగా ఉంటుంది. కొండవీటి వాగు, పాల వాగు నుంచి వచ్చే వరద నీటిని ఈ రిజర్వాయర్లలోకి మళ్ళిస్తారు. అటు తరువాత ఈ రిజర్వాయర్ల నుంచి కృష్ణా నదిలోకి నీటిని విడుదల చేయాలన్నది ప్రణాళిక. ఇందుకోసం 46 కిలోమీటర్ల కాలువల నిర్మాణం చేపడుతున్నారు. దీని ద్వారా అమరావతికి వరద ముప్పు తప్పించవచ్చనేది ప్రభుత్వ ప్రణాళిక. కానీ ప్రజలను తప్పుదోవ పట్టించేలా సాక్షి మీడియాతో పాటు సుమన్ ఛానల్ ప్రయత్నించాయి. ఇప్పుడు ఆ రెండింటిపై జలవనరుల శాఖ అధికారులు ఫిర్యాదులు చేశారు. కేసులు కూడా నమోదయ్యాయి.