TDP vs YCP : టీడీపీ వర్సెస్ వైసీపీ : ఇంతకీ ఎన్టీఆర్ ఎవరి పార్టీ?

అయితే దీనిపై  అవినాష్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. తామూ ఎన్టీఆర్ అభిమానులమే అన్నారు. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు తమకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదని, అది వాళ్ల పార్టీ ఆఫీసా అని ప్రశ్నించారు.

Written By: Dharma, Updated On : May 27, 2023 3:51 pm
Follow us on

TDP vs YCP :  విజయవాడలో మరోసారి  ఉద్రిక్తంగా మారింది. అందుకు ఎన్టీఆర్ కారణమయ్యారు. ఎన్టీఆర్ మావాడంటే మావాడు అంటూ వారసత్వం కోసం టీడీపీ, వైసీపీ మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. ఎన్టీఆర్ శతజయంతి వేడుకల వేళ కొత్త కీచులాట చోటుచేసుకుంది. టీడీపీ వ్యవస్థాపకుడిగా ఎన్టీఆర్ ఉండగా… ఇప్పుడు వైసీపీ ఎన్టీఆర్ ఫొటోను వాడుకోవడానికి ప్రయత్నించడమే వివాదానికి కారణం. దీంతో ఇరు పార్టీల నాయకుల మధ్య సవాళ్లు, ప్రతిసవాళ్లు నడుస్తుండడంతో విజయవాడ పాలిటిక్స్ ఒక్కసారిగా హీటెక్కాయి.

విజయవాడ పటమటలోని ఎన్టీఆర్ సర్కిల్ వద్ద వైసీపీ నేత దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో  బ్యానర్లు కట్టారు. దానిపై ఎన్టీఆర్ ఫొటోలు ముద్రించారు.  దీంతో ఆగ్రహించిన టీడీపీ నేతలు వాటి చుట్టూ పసుపు బ్యానర్లు కట్టారు. దీంతో ఇరు పార్టీల మధ్య ఘర్షణపూరిత వాతావరణం నెలకొంది. టీడీపీ శ్రేణులకు మద్దతుగా ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్, వైసీపీ శ్రేణులకు మద్దతుగా దేవినేని అవినాష్ రంగంలోకి దిగడంతో పరిస్థితి మరింత వేడెక్కింది. ఆరోపణలు, ప్రత్యారోపణలు, హెచ్చరికలతో పరిస్థితిని మరింత హీటెక్కించారు.

తొలుత పశ్చిమ ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ స్పందించారు. దేవినేని అవినాష్ ను టార్గెట్ చేసుకొని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు అవినాష్ కు ఎన్టీఆర్ కు సంబంధం ఏంటని ప్రశ్నించారు. ఒక వేళ టీడీపీ జెండాను తన తండ్రి నెహ్రూ పార్ధివ దేహానికి కప్పించుకున్నారని.. నాడు చంద్రబాబు స్వయంగా పార్టీ జెండాను కప్పిన విషయాన్ని గుర్తుచేశారు. బహుశా ఆ బంధంతోనే అవినాష్ ఇలా చేసి ఉంటారని ఎద్దేవా చేశారు. నెహ్రూ కుమారుడు దేవినేని అవినాష్ చర్యల్ని ఖండిస్తున్నట్లు టీడీపీ ఎమ్మెల్యే గద్దె తెలిపారు. యన్టీఆర్‌ స్థాపించిన పార్టీ కార్యాలయం పై దాడి చేయించారని, పార్టీ జెండాను కింద వేసి తొక్కారని విమర్శించారు. యూనివర్శిటీ కి యన్టీఆర్‌ పేరు తొలగిస్తే అవినాష్ ఎందుకు మాట్లాడలేదని ప్రశ్నించారు.

అయితే దీనిపై  అవినాష్ కూడా ఘాటు కౌంటర్ ఇచ్చారు. తామూ ఎన్టీఆర్ అభిమానులమే అన్నారు. ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే హక్కు తమకుందన్నారు. ఎన్టీఆర్ సర్కిల్ టీడీపీకి ఎవరూ రాసివ్వలేదని, అది వాళ్ల పార్టీ ఆఫీసా అని ప్రశ్నించారు.తాము బ్యానర్లు కట్టే వరకూ అక్కడ ఎన్టీఆర్ కు బ్యానర్లు కట్టే వారే లేరన్నారు. వారి ప్రవర్తన చాలా బాధగా అనిపించిందన్నారు. ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ కవ్వింపు చర్యలకు పాల్పడి తమపై నిందలు మోపుతున్నాడని ఆరోపించారు. కాగా నేతల పరస్పర ఆరోపణలతో విజయవాడలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. కొద్దిరోజులుగా ప్రశాంతత నెలకొందన్న తరుణంలో ఎన్టీఆర్ ఇష్యూ ఇప్పుడు రెయిజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది.