Achyutapuram Fire Accident : ఊహకు అందని నష్టం..చుట్టూ మృతదేహాలు.. పైన శకలాలు.. పేలుడు దాటికి చెట్టుకు అంటుకున్న మృతదేహాలు.. ఇలా ఒకటేమిటి అక్కడ ప్రతి దృశ్యం హృదయ విదారకం. అచ్యుతాపురం సెజ్ ఫార్మా కంపెనీలో రియాక్టర్ పేలి 18 మంది మృత్యువాత పడిన సంగతి తెలిసిందే. మరో 60 మందికి తీవ్ర గాయాలయ్యాయి. మంటల్లో కాలిపోయి కొందరు, పై కప్పు కూలి శిధిలాల కింద చిక్కుకొని మరికొందరు చనిపోయారు. ప్రాణభయంతో పై అంతస్తు నుంచి కిందకు దూకి ఒక ఏడుగురు మృత్యువాత పడ్డారు. ఎటు చూసినా మృతదేహాలే.. ఎటువైపు చూసినా భయానక దృశ్యాలే. పరిశ్రమ గేటు బయట వందలాదిమంది బంధువులు తమ వారి కోసం ఆశగా ఆరా తీయడం కనిపించింది. తమ వారు ఎక్కడున్నారు? బతికే ఉన్నారా? గాయాలతో బయటపడ్డారా? అన్న ఆత్రంతో ఎక్కువ మంది కనిపించారు. లోపలికి ఎవరికీ అనుమతి లేకపోవడంతోకుటుంబ సభ్యులు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించడం అక్కడ కనిపించింది. ఎవరిని పలకరించినా.. ఉబికి వస్తున్న కన్నీరును ఆపడం ఎవరికీ సాధ్యం కావడం లేదు.
* ఆమె బాధ వర్ణనాతీతం
ఓ యువతి ఒక వ్యక్తి ఫోటో పెట్టుకుని ఆరా తీయడం అందరినీ కంటతడి పెట్టించింది. సార్ సార్ మీకు దండం పెడతాను. మా అన్నయ్య ను వెతికి పెట్టండి సార్.. మొన్ననే రాఖీ కట్టించుకున్నాడు. ఇంతలోనే కనిపించడం లేదంటూ సహాయ బృందాలను సదరు యువతి వేడుకోవడం అక్కడున్న వారి కళ్ళల్లో నీరు తెప్పించింది. ఆ యువతి బతిమాలిన వైనం స్థానికుల హృదయాలను బరువెక్కించింది.గాజువాకకు చెందిన వెంకట సాయి అనే వ్యక్తి అక్కడే పని చేస్తున్నాడు. కానీ ఆయన ఆచూకీ లేకపోవడంతో సోదరి పడిన బాధ వర్ణనాతీతం.
* ఇటీవలే రాఖీ కట్టాను
ఇటీవలే వెంకట సాయి తన చెల్లెలు కిరణ్మయితో రాఖీ కట్టించుకున్నాడు. రోజు మాదిరిగానే నిన్న పరిశ్రమలో విధులకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో కిరణ్మయి సోదరుడికి ఫోన్ చేసింది. ఫోన్ రింగ్ అవుతోంది కానీ.. లిఫ్ట్ చేయడం లేదు. దీంతో హుటా హుటిన పరిశ్రమ వద్దకు చేరుకుంది. అక్కడున్న భద్రత సిబ్బంది కాళ్లా వేళ్లా పడింది. మా అన్నయ్యని వెతికి పెట్టండి సార్.. అంటూ రోదించడం అక్కడున్న వారిని కలిసివేసింది.
* ఫోన్ లిఫ్ట్ చేయలేదు
వెంకట సాయి ఫార్మా కంపెనీలో రోజువారి గానే బుధవారం విధులకు హాజరయ్యాడు. సాయంత్రానికి అనుకోని ప్రమాదం జరగడంతో ఆయన ఆచూకీ లభ్యం కావడం లేదు. అక్కడ రియాక్టర్ తేలడంతో కార్మికులు 30 నుంచి 50 మీటర్లు ఎగిరిపడ్డారు. శిధిలాల కింద మరికొంతమంది చిక్కుకొని ఉన్నారు. అందుకే వెంకట సాయి ప్రాణాలతో ఉన్నాడేమో వెతికి పెట్టండి సార్ అంటూ కిరణ్మయి అక్కడున్న భద్రతా సిబ్బందిని వేడుకోవడం కంటతడి పెట్టించింది. ఆమెను సముదాయించడం కూడా ఎవరి తరం కాలేదు.