YCP: ఏపీలో అసలు సిసలు సంగ్రామానికి తెరలేచింది. అన్ని పార్టీలు అభ్యర్థులను దాదాపు ఖరారు చేసే పనిలో పడ్డాయి. వీలైనంత త్వరగా ఆ ప్రక్రియ చేపట్టి ప్రచార పర్వంలోకి అడుగు పెట్టాలని భావిస్తున్నాయి. మధ్యాహ్నం మూడు గంటలకు దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. షెడ్యూల్ ప్రకటించనుంది. సరిగ్గా ఇటువంటి తరుణంలోనే ఏపీ సీఎం జగన్ వైసీపీ అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఇప్పటివరకు 13 జాబితాలను ప్రకటించి చాలామంది సిట్టింగ్లను మార్చారు. చాలామందికి స్థానచలనం కల్పించారు. ఈ తరుణంలో పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన గందరగోళం కనిపిస్తోంది. అందుకే ఒకేసారి 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ స్థానాలకు సంబంధించి అభ్యర్థులను ఈరోజు ప్రకటించనున్నారు. ఇడుపులపాయలోని వైయస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద అభ్యర్థుల జాబితాను ఉంచి.. అనంతరం వెల్లడించనున్నారు.
గత ఎన్నికలకు ముందు కూడా తండ్రి సమాధి వద్ద అభ్యర్థుల జాబితాను ప్రకటించారు.ఆ ఎన్నికల్లో వైసిపి ఏకపక్ష విజయం సాధించింది. 175 అసెంబ్లీ స్థానాలకు గాను 151 చోట్ల ఆ పార్టీ గెలుపొందింది. 25 పార్లమెంట్ స్థానాలకు గాను 22 చోట్ల విజయం సాధించింది. ఇప్పుడు కూడా 175 అన్న నినాదంతో ఆ పార్టీ ముందుకెళ్తోంది. అయితే ప్రభుత్వం పై వ్యతిరేకత దృష్ట్యా జగన్ పెద్ద ఎత్తున అభ్యర్థులను మార్చినట్లు తెలుస్తోంది. సంక్షేమ పథకాలతో పాటు అభ్యర్థుల మార్పుతో మరోసారి విజయం సాధించవచ్చు అన్న ఆలోచనతో జగన్ ఉన్నారు. ఇప్పటివరకు 13 జాబితాలను ప్రకటించి 80 మంది వరకు సిట్టింగ్లను మార్చారు. ఎమ్మెల్యేలను ఎంపీ అభ్యర్థులుగా, ఎంపీలను ఎమ్మెల్యే అభ్యర్థులుగా మార్చిన సందర్భాలు ఉన్నాయి. అయితే ఇప్పటివరకు ప్రకటించిన జాబితాలో ఉన్న పేర్లు వరకే మార్చారని.. మిగతా చోట్ల సిట్టింగ్లే పోటీ చేస్తారని అంతా భావించారు. కానీ ఇప్పుడు తుది జాబితా ప్రకటనకు సిద్ధపడుతుండడంతో సిట్టింగ్లలో ఒకరకమైన ఆందోళన కనిపిస్తోంది.
అయితే కడప జిల్లాలో ఎటువంటి మార్పులు ఉండడం లేదని తెలుస్తోంది. కడప ఎంపీగా మరోసారి అవినాష్ రెడ్డి బరిలో దిగే ఛాన్స్ ఉంది. అసెంబ్లీ స్థానాల విషయంలో సిట్టింగ్లనే కొనసాగిస్తారని తెలుస్తోంది. అటు ఎంపీ అభ్యర్థుల ప్రకటన సైతం ఉంటుందని తెలుస్తోంది. ఎంపీ నందిగాం సురేష్ ఎంపీ అభ్యర్థులను ప్రకటిస్తారని సమాచారం. అయితే కొన్ని అసెంబ్లీ స్థానాల విషయంలో సైతం మార్పులు ఉంటాయని ప్రచారం జరుగుతుంది. తాడేపల్లిగూడెంలో మంత్రి కొట్టు సత్యనారాయణను తప్పించి ఈలి నానికి అభ్యర్థిగా ప్రకటిస్తారని సమాచారం. అటు స్పీకర్ తమ్మినేని సీతారాం స్థానంలో ఆయన కుమారుడు చిరంజీవి నాగ్ పేరు ప్రకటిస్తారని తెలుస్తోంది. నెల్లూరుజిల్లాలో కూడా కీలక మార్పులు ఉంటాయని సమాచారం.
అభ్యర్థుల ప్రకటన తర్వాత జగన్ దూకుడు పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఈనెల 18న జగన్ మేనిఫెస్టో ప్రకటిస్తారని సమాచారం. 19 నుంచి వరుసగా ఎన్నికల ప్రచార సభల్లో జగన్ పాల్గొనున్నారు. రోజుకు మూడు సభల్లో పాల్గొనేలా ప్లాన్ చేసుకున్నారు. ఇక కూటమికి సంబంధించి రేపు చిలకలూరిపేటలో భారీ బహిరంగ సభ జరగనుంది. ప్రధాని మోదీతో పాటు చంద్రబాబు, పవన్ లు ఒకే వేదికపై కనిపించనున్నారు. ఒకవైపు విపక్షాలు దూకుడు పెంచడం, ఎన్నికల షెడ్యూల్ ప్రకటన రానుండడంతో జగన్ రూటు మార్చనున్నారు. మరింత దూకుడుగా అడుగులు వేయనున్నారు.