Chintamaneni Prabhakar: తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్లలో చింతమనేని ప్రభాకర్ ఒకరు. 2014 నుంచి 2019 వరకు ఆయన అనేక అంశాల్లో వివాదాస్పదంగా మారారు. ముఖ్యంగా ఓ మహిళా అధికారిపై అనుచితంగా ప్రవర్తించారని ఆరోపణలు రావడంతో రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారారు. వైసీపీకి టార్గెట్ అయ్యారు.అయితే ఇప్పుడున్న కొడాలి నాని, వల్లభనేని వంశీ మాదిరిగా ఎవరి వ్యక్తిగత అంశాల జోలికి వెళ్లలేదు. కేవలం పార్టీలపరంగా విమర్శలకే పరిమితమయ్యేవారు. అయితే ఈసారి ఆయనకు టికెట్ లేదని ప్రత్యర్థులు ప్రచారం చేశారు. కానీ చంద్రబాబు మాత్రం ఎంతో కాన్ఫిడెన్స్ తో చింతమనేని ప్రభాకర్ కు టికెట్ ఇచ్చారు. అన్ని సర్వేల్లో చింతమనేని గెలుస్తారని తేలడంతోనే చంద్రబాబు టికెట్ కట్ట పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది.
2009, 2014 ఎన్నికల్లో దెందులూరు నుంచి చింతమనేని ప్రభాకర్ గెలుపొందారు. 2019లో మాత్రం వైసీపీ అభ్యర్థి కొఠారు అబ్బయ్య చౌదరి చేతిలో ఓడిపోయారు. కచ్చితంగా గెలుస్తానని భావించిన చింతమనేనికి ఓటమి ఎదురు కావడంతో మైండ్ బ్లాక్ అయింది. ఇక చింతమనేని పని అయిపోయిందన్న ప్రచారం జరిగింది. అయితే వాటన్నింటికీ చెక్ చెబుతూ ప్రభాకర్ యాక్టివ్ అయ్యారు. టిడిపి క్యాడర్ను కాపాడుకున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ ప్రజల మనిషిగా ముద్రపడ్డారు. ఈ ఎన్నికల్లో ఎలాగైనా విజయం సాధించాలని ప్రయత్నిస్తున్నారు.
చింతమనేని ప్రభాకర్ మాస్ లీడర్ గా ఎదిగారు. కొన్ని వివాదాస్పద అంశాల జోలికి వెళ్లడంతో రాష్ట్ర నేతగా మారిపోయారు. వాస్తవానికి ఆయన గ్రౌండ్ లెవెల్ లో ప్రజలతో మంచి సంబంధాలే నెరుపుకుంటూ వస్తున్నారు. ఓడిపోయినా నిత్యం ప్రజల్లోనే తిరుగుతూ వస్తున్నారు. గ్రౌండ్ లెవెల్ లో పరిస్థితి చూస్తే చింతమనేని పై సానుభూతి వ్యక్తం అవుతుంది. చంద్రబాబు చేసిన సర్వేల్లో కూడా ఇదే తేలడంతో ఆయనకు టికెట్ కట్టబెట్టారు. టిడిపి ప్రభుత్వ హయాంలో చింతమనేని విప్ గా పనిచేశారు. ఈ ఎన్నికల్లో గెలిస్తే మాత్రం చంద్రబాబు గిఫ్ట్ ఇస్తారని.. కీలక పోర్ట్ఫోలియో కేటాయిస్తారని కృష్ణాజిల్లాలో ప్రచారం జరుగుతోంది. అందుకే చింతమనేని ప్రభాకర్ సైతం రెట్టింపు ఉత్సాహంతో పని చేస్తున్నారు. సంక్షేమ పథకాలతో గెలుపొందాలని అబ్బయ్య చౌదరి భావిస్తున్నారు. దీంతో దెందులూరులో హోరాహోరి ఫైట్ నడుస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా అందరి దృష్టిని ఆకర్షిస్తోంది.