Film Celebrities to Andhra Pradesh: ఆంధ్ర ప్రదేశ్ లో( Andhra Pradesh) కూటమి అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయింది. ఎట్టకేలకు సినీ పరిశ్రమకు చెందిన ప్రముఖులు ఏపీ సీఎం చంద్రబాబును కలవనున్నారు. వాస్తవానికి అధికారం చేపట్టిన తొలినాళ్లలోనే ముఖ్యమంత్రిని సినీ ప్రముఖులు కలవడం ఆనవాయితీగా వస్తోంది. కానీ ఏపీలో మాత్రం ఆ పరిస్థితి కనిపించలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ ప్రముఖులు మర్యాదపూర్వకంగా కలిసిన సందర్భం లేదు. అయితే సినీ పరిశ్రమకు చెందిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కు మాత్రం సినీ పెద్దలు కలిశారు. శుభాకాంక్షలు తెలిపారు. పనిలో పనిగా తెలుగు చిత్ర పరిశ్రమ ఎదుర్కొంటున్న సమస్యలను వివరించే ప్రయత్నం చేశారు. అయితే సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి సమస్యలు పరిష్కరించుకుందామని సినీ పరిశ్రమ పెద్దలతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. త్వరలో మీరంతా సీఎం చంద్రబాబును కలవాలని సూచించారు. అయితే ఇటీవల హరిహర వీరమల్లు సినిమా విడుదల ప్రకటన వచ్చింది. అంతకంటే ముందే సినిమా ధియేటర్ల బంద్ ప్రతిపాదన వచ్చింది. దీంతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కార్యాలయం నుంచి ప్రత్యేక ప్రకటన వచ్చింది. చిత్ర పరిశ్రమ కోసం తాను కృషి చేస్తుంటే తనకి రిటర్న్ గిఫ్ట్ ఇస్తారా? అంటూ పవన్ కళ్యాణ్ తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. అటు తర్వాత జరిగిన పరిణామాలతో ఈ నెల 15న సినీ పరిశ్రమ పెద్దలు ఏపీ సీఎం చంద్రబాబును కలిసేందుకు అపాయింట్మెంట్ తీసుకున్నారు.
Also Read: Tollywood Film Industry: సినీ పరిశ్రమలో సమస్యలపై ప్రత్యేక కమిటీ
సినిమా మార్కెట్ కు ఏపీ పరిమితం
ప్రస్తుతం తెలుగు రాష్ట్రాల్లో చిత్ర పరిశ్రమ( cine industry ) విస్తరించే ప్రయత్నం జరగడం లేదు. కేవలం హైదరాబాద్ కు సినిమా షూటింగులు పరిమితం అయ్యాయి. ఆంధ్రప్రదేశ్ కేవలం సినిమా మార్కెట్ కు పరిమితం అయింది. విశాఖలో షూటింగులు జరుగుతున్నా హైదరాబాద్ స్థాయిలో మాత్రం సాగడం లేదు. అవుట్ డోర్ షూటింగ్ లలో భాగంగా గోదావరి జిల్లాల్లో సైతం మునుపటి మాదిరిగా జరగడం లేదు. విజయవాడ తో పాటు తిరుపతి పరిసర ప్రాంతాలు షూటింగులకు అనుకూలంగా ఉన్నా సినీ నిర్మాతలు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అటు విశాఖ మన్య ప్రాంతం సినిమా షూటింగులకు అనుకూలం. అయితే ఏపీలో సినీ పరిశ్రమ విస్తరణకు ఇదే సరైన సమయం. ఎందుకంటే ఏపీ ప్రభుత్వం పర్యాటక రంగ అభివృద్ధికి కూడా ఎంతో ప్రాధాన్యం ఇస్తోంది. అందుకే ఏపీ సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సినీ పరిశ్రమ విస్తరణకు.. ఆ రంగ ప్రముఖులకు కీలక సూచనలు ఇస్తే మంచిదన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది.
దోపిడీకి చెక్ చెప్పాల్సిందే..
సినిమా మాధ్యమం పై ఆధారపడి వేలాది మంది బతుకుతున్నారు. అలాగే ఇదో ఎంటర్టైన్మెంట్( entertainment) రంగంగా ఉంది. ప్రజలకు వినోదం పంచుతోంది. అయితే సినిమాల మాటున దోపిడీ జరుగుతోందన్న అభిప్రాయం ప్రజల్లో ఉంది. ప్రధానంగా సినిమా థియేటర్ల లో టికెట్ల ధరలు సామాన్యుడికి అందనంత దూరంలో ఉన్నాయి. అక్కడ లభించే కూల్ డ్రింక్స్, ఆహార పదార్థాలు కొనుగోలు చేయాలంటే సామాన్యుడికి వీలుపడదు. సెలవు రోజున సగటు చిన్న కుటుంబం సినిమాకు వెళ్తే.. జేబులో వెయ్యి రూపాయలు ఉండాల్సిందే. అంతలా బాదుడు ఉంటోంది. ఒక సినిమా పది రోజులు ప్రదర్శిస్తేనే హిట్ టాక్ వచ్చే రోజులు ఇవి. అందుకే ఆ కొద్ది రోజుల్లోనే ప్రేక్షకుడి నుంచి బాదుడు తప్పడం లేదు. అందుకే థియేటర్లకు రాయితీలు ఇవ్వాలి. ఆపై సినిమా షూటింగులకు తగ్గట్టు ఏపీని విస్తరించాలి. స్థానిక కళాకారులకు ప్రోత్సాహం ఇవ్వాలి. ఇవి చేస్తేనే ఏపీలో సినీ పరిశ్రమ విస్తరిస్తుంది. నలుగురికి ఉపాధి దొరుకుతుంది.
Also Read: Tollywood: ప్రత్యేక చిత్ర పరిశ్రమ డిమాండ్, టాలీవుడ్ ఆంధ్రాకు తరలివెళితే ఎవరికి నష్టం?
రాష్ట్ర విభజన జరిగి 11 ఏళ్లు అవుతున్నా..
రాష్ట్ర విభజన( state divide) జరిగి 11 సంవత్సరాలు అవుతోంది. కానీ ఇంతవరకు తెలుగు సినీ పరిశ్రమ విస్తరణ జరగలేదు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప కార్యరూపం దాల్చలేదు. సినీ పరిశ్రమ ద్వారా తెలంగాణకు ఆదాయం వస్తుంటే.. మార్కెట్ విస్తరణకు మాత్రం ఏపీ ఉపయోగపడుతోంది. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు ఎవరికీ వారే సినిమా టిక్కెట్ల ధర పెంపునకు ఏపీ ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నారు. కానీ ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరించాలన్న ప్రయత్నం జరగడం లేదు. ఏపీలో చిత్ర పరిశ్రమ విస్తరణకు అవసరమైన అనుకూల పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎక్కడో ప్రయత్న లోపం జరుగుతోంది. ఆపై సినీ పరిశ్రమ నుంచి కూడా మద్దతు కరువవుతోంది. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ సీఎం చంద్రబాబుకు సినీ పరిశ్రమ పెద్దలు కలవనుండడం ప్రాధాన్యత సంతరించుకుంది. అయితే ఈ కలయిక మర్యాదపూర్వకంగా కాకుండా.. ఏపీలో పరిశ్రమ విస్తరణ, సగటు ప్రేక్షకుడకు అదనపు బాదుడు లేకుండా వినోదం పంచడం వంటి చర్యలపై దృష్టి పెడితే ఎంతో మేలు. మరి ఏం జరుగుతుందో చూడాలి.