Fengal Cyclone: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను తీరాన్ని దాటింది. నిన్న రాత్రి 10:30 నుంచి 11:30 గంటల మధ్య పుదుచ్చేరి సమీపంలో తీరం దాటినట్లు వాతావరణ శాఖ స్పష్టం చేసింది. ప్రస్తుతం ఇది ఉధృతంగా కొనసాగుతోంది. పశ్చిమ నైరుతి దిశగా కదులుతూ క్రమంగా బలహీన పడనుంది. దీని ప్రభావంతో ఏపీలో అక్కడక్కడ భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. తుఫాను తీరం దాటిన క్రమంలో గంటకు 90 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. పూర్తిగా తీరం పైకి వచ్చాక మళ్లీ తీవ్రవాయుగుండం గా ఇది బలహీన పడనుంది. తుఫాను ప్రభావంతో తమిళనాడుతో పాటు ఏపీలో అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ముఖ్యంగా రాయలసీమ, కోస్తాంధ్ర, యానంలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. తెలంగాణలో సైతం తుఫాను ప్రభావం కనిపిస్తోంది.
* రెండు రోజుల పాటు వాన
రాష్ట్రంలో రెండు రోజుల పాటు వర్షాలు కురవనున్నాయని విశాఖలోని తుఫాను హెచ్చరికల కేంద్రం స్పష్టం చేసింది. ఈ రెండు రోజుల పాటు తిరుపతి, పొట్టి శ్రీరాములు నెల్లూరు, చిత్తూరు, అన్నమయ్య, వైయస్సార్, శ్రీ సత్య సాయి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది.
* ఆకస్మిక వరదలు
మరోవైపు ఆకస్మిక వరదలు వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా ప్రకాశం, నెల్లూరు, వైయస్సార్, చిత్తూరు జిల్లాల్లో వరదలు వచ్చే ప్రమాదం ఉందని హెచ్చరికలు వస్తున్నాయి. మరోవైపు మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళకూడదని ప్రభుత్వం హెచ్చరించింది. కృష్ణపట్నం పోర్టుకు ఆరో నెంబరు, విశాఖ, గంగవరం, కాకినాడ, మచిలీపట్నం, వాడరేవు పోర్టులకు మూడో నెంబర్ హెచ్చరికలు జారీ చేశారు. ఇంకోవైపు తుఫాను ప్రభావంతో తిరుపతిలో నిరంతరాయంగా వర్షం కురుస్తూనే ఉంది. భక్తులు అసౌకర్యానికి గురవుతున్నారు. ఇంకోవైపు ఈ వర్షాలతో రైతులు ఆందోళన చెందుతున్నారు. వరి కోతలు జరుగుతుండడంతో తల్లడిల్లుతున్నారు.