Ex Minister Roja : ఎక్కడో మాట్లాడుతున్న రోజా.. ఇలా అయితే వైసిపికి కష్టమే

నేతల తీరుపైనే రాజకీయ పార్టీల మనుగడ ఆధారపడి ఉంటుంది. జగన్ దూకుడు వైసీపీకి అధికారాన్ని కట్టబెట్టింది. కానీ కొంతమంది నేతల దూకుడుతో ఈ ఎన్నికల్లో పరాజయం ఎదురైంది. దాని నుంచి గుణపాఠాలు నేర్చుకునే స్థితిలో వైసీపీ లేకపోవడం గమనార్హం.

Written By: Anabothula Bhaskar, Updated On : September 29, 2024 10:26 am

Ex Minister Roja

Follow us on

Ex Minister Roja : వైసీపీ నేతలు ఇంకా గుణపాఠాలు నేర్చుకోలేదు. ఎన్నికల్లో ఆ పార్టీకి దారుణ పరాజయం ఎదురయింది. 175 అసెంబ్లీ సీట్లకు గాను.. ఆ పార్టీ 11 స్థానాలకు మాత్రమే పరిమితమైంది. కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కలేదు. ఒక్క పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తప్పించి క్యాబినెట్ మంత్రులంతా ఓడిపోయారు. గత ఐదేళ్ల కాలంలో వైసిపి నేతల వ్యవహరించిన తీరుతో ప్రజలు తిరస్కరించారు. ముఖ్యంగా కొంతమంది నేతల వ్యవహార శైలి అతిగా ఉండేది. భిన్నంగా సాగేది. వారి తీరుతోనే పార్టీకి ఎక్కువగా నష్టం జరిగిందన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే ఇప్పుడు ఓటమి తర్వాత కూడా కొందరు నేతలు వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉంది. ప్రస్తుతం లడ్డూ వ్యవహారం నడుస్తోంది. దీంట్లో వైసిపి కార్నర్ అవుతోంది. హిందూ సమాజం ఆ పార్టీపై అనుమానంగా చూస్తోంది. ఈ నేపథ్యంలో దిద్దుబాటు చర్యలకు ఉపక్రమించారు జగన్. ఇదంతా చంద్రబాబు డైవర్షన్ పాలిటిక్స్ గా అభివర్ణించారు. ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేక ఇలా.. ప్రజల దృష్టి మళ్లిస్తున్నారని విమర్శలు చేశారు. తిరుమల వెళ్లేందుకు ప్రయత్నించారు. అనేక కారణాల రీత్యా వెనక్కి తగ్గారు. చంద్రబాబు పాప ప్రక్షాళన కోసం శనివారం రాష్ట్ర వ్యాప్తంగా పూజలు చేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా వైసీపీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించాయి.

* తమిళనాడులో ఉండి విమర్శలు
అయితే అందరిది ఒక దారి అయితే.. మాజీ మంత్రి రోజా ది మరోదారి అన్నట్టుంది పరిస్థితి. ఆమె ఏపీలో కాకుండా తమిళనాడులోని ఆలయాలను ఇటీవల ఎక్కువగా సందర్శిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం తమిళనాడులోని ఓ ఆలయంలో పూజలు నిర్వహించారు. తరువాత మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. సంచలన వ్యాఖ్యలు కూడా చేశారు. అయితే తమిళనాడులో పూజలు చేసి ఏపీ రాజకీయాలు మాట్లాడడం ఏమిటి అని అక్కడ జర్నలిస్టులు సైతం విస్మయం వ్యక్తం చేశారు. రోజా తీరును ఆక్షేపించారు. ఇటీవలే రోజా వైసిపి అధికార ప్రతినిధిగా నియమితులయ్యారు. దీంతో ఎక్కడి నుంచైనా మాట్లాడే హక్కు ఉందన్నట్టు ఆమె వ్యవహరిస్తున్నారు.

* వైసీపీకి భారీ డ్యామేజ్
ఇప్పటికే తిరుమలలో వివాదంలో వైసీపీకి భారీ డ్యామేజ్ జరిగింది. ఇటువంటి సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. గతంలో టీటీడీ దర్శన సిఫార్సు లేఖల విషయంలో రోజా అడ్డగోలుగా వ్యవహరించారన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రజల్లో కూడా ఒక రకమైన అభిప్రాయం ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత రోజా తిరుమలలో కనిపించడం మానేశారు. కానీ గత ఐదేళ్ల వైసిపి పాలనలో ప్రతి వారం తిరుమలలో మందీ మార్బలంతో కనిపించేవారు. ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న రోజా తరచూ లడ్డు వివాదం పై మాట్లాడుతుండడం వైసిపికి డ్యామేజ్ చేయడమేనని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. పైగా ఆమెపై ప్రజాభిప్రాయం వేరేగా ఉంది.

* ఇదో సున్నితమైన అంశం
రోజా దూకుడుగా ఉంటారు. ప్రత్యర్థులపై విరుచుకుపడతారు. అంతవరకు ఓకే కానీ.. వైసిపి పై ఇప్పుడు వచ్చిన ఆరోపణ చిన్నది కాదు. హిందూ సమాజంలో ఆ పార్టీని దోషిగా నిలబెట్టే ప్రయత్నం జరిగింది. దాని నుంచి బయటపడే మార్గం చూడాలి. అంతే తప్ప అడ్డగోలుగా మాట్లాడితే అది ఆ పార్టీకి మైనస్. ఇది గుర్తుతెరిగి వైసిపి నాయకత్వం మసులుకోవాలి. వీలైనంతవరకు రోజా లాంటి నేతలను కట్టడి చేయడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు. ఇప్పటికైనా వైసీపీ హై కమాండ్ దిద్దుబాటు చర్యలకు దిగుతుందో? లేదో? చూడాలి.