Lulu Gruop : ఏపీకి గుడ్ న్యూస్. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన లులు గ్రూప్ ఏపీలో తిరిగి ఎంటర్ కానుంది. ఈ మేరకు తమ సమ్మతిని తెలిపింది. లులు గ్రూపు సంస్థ చైర్మన్ యాసఫ్ అలీ సీఎం చంద్రబాబుతో చర్చలు జరిపారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చారు. 2014లో అధికారంలోకి వచ్చిన తెలుగుదేశం పార్టీ విజయవాడ, గుంటూరు, తిరుపతి, విశాఖపట్నంలో పారిశ్రామిక అభివృద్ధి పై దృష్టి పెట్టింది. అందులో భాగంగా విశాఖ బీచ్ రోడ్ లో 2200 కోట్ల రూపాయలతో ఒక కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి లులు గ్రూప్ ముందుకొచ్చింది. నాకు టిడిపి ప్రభుత్వం బీచ్ రోడ్డులో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి భూమిని కూడా కేటాయించింది. అక్కడ నిర్మాణ పనులు ప్రారంభించేందుకు లులు సంస్థ సిద్ధపడుతుండగా.. ఏపీలో అధికార మార్పిడి జరిగింది. దీంతో ఆ భూమి కేటాయింపును నిలిపివేస్తూ జగన్ సర్కార్ నిర్ణయం తీసుకుంది. వెంటనే లులు సంస్థ కూడా స్పందించింది. ఏపీలో తాము పెట్టుబడులు ఉపసంహరించుకుంటున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రావడంతో మరోసారి లులు సంస్థ ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావడం విశేషం.
* ప్రపంచవ్యాప్తంగా బ్రాండ్ ఇమేజ్
గల్ఫ్ దేశాలకు చెందిన లులు సంస్థకు ప్రపంచవ్యాప్తంగా మంచి పేరు ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఆ సంస్థకు అనేక బ్రాంచ్ లు ఉన్నాయి. కన్వెన్షన్ సెంటర్లు వ్యాపార లావాదేవీలను విస్తరిస్తున్నాయి. అందులో భాగంగా విశాఖలో భారీ కన్వెన్షన్ సెంటర్ నిర్మించాలని భావించింది ఆ సంస్థ. దీంతో నాటి చంద్రబాబు సర్కార్ విశాఖపట్నం బీచ్ రోడ్ లో ప్రత్యేకంగా భూమిని కేటాయించింది. అయితే 2019 మేలో అధికారంలోకి వచ్చింది వైసీపీ సర్కార్. అదే ఏడాది నవంబర్లో రివర్స్ టెండరింగ్ విధానంలో ఆ భూముల కేటాయింపును రద్దు చేసింది. దీంతో లులు సంస్థ ఏపీలో పెట్టుబడుల నిర్ణయాన్ని ఉపసంహరించుకుంది.
* సీఎంను కలిసిన యాసఫ్ అలీ
అయితే తాజాగా చంద్రబాబును కలిశారు లు సంస్థ అధినేత యాసఫ్ అలీ. విశాఖలో కన్వెన్షన్ సెంటర్ నిర్మాణానికి సిద్ధంగా ఉన్నట్లు చెప్పుకొచ్చారు. తమ సంసిద్ధతను ప్రకటించారు. దీనిపై చంద్రబాబు సానుకూలంగా స్పందించారు. మంత్రివర్గంలో నిర్ణయం తీసుకొని మార్గం సుగమం చేస్తామని హామీ ఇచ్చారు. మొత్తానికైతే విశాఖలో లులు కంపెనీ భారీ కన్వెన్షన్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు అయింది.