British Railway Route: భారత దేశానికి 200 ఏళ్ల బ్రిటిష్ పాలన నుంచి విముక్తి లభించి 77 ఏళ్లు పూర్తయింది. స్వాతంత్య్రం తర్వాత దేశం అన్నిరంగాల్లో అభివృద్ధి చెందుతోంది. సొంతంగా అనేక విభాగాలను ఏర్పాటు చేసుకున్నాం. శాస్త్ర సాంకేతికరంగాల్లో దూసుకుపోతున్నాం. ఆర్థికంగా మనను పాలించిన బ్రిటిష్ దేశాన్ని కూడా అధిగమించి 5వ ఆర్థిక శక్తిగా ఎదిగాం. ఇక భారతీయులు లేకుండా.. ప్రపంచంలో చాలా దేశాలు అభివృద్ధి చెందడం లేదు. మన సాంకేతిక నిపుణులపైనే ఆధారపడుతున్నాయి. అగ్రరాజ్యం అమెరికా అభివృద్ధిలో భారతీయులే కీలకపాత్ర పోషిస్తున్నారు. ప్రపంచంలో పలు దేశాలకు భారతీయ మూలాలున్న నేతలు ప్రధానులు అధ్యక్షులు అయ్యారు. రాజకీయాలను శాసించే స్థాయికి ఎదిగారు. ఇదంతా స్వాతంత్య్రంలోనే సాధ్యమైంది. అయితే 77 ఏళ్ల స్వాతంత్య్రంలో మనం అనేక ఫలాలు అనుభవిస్తున్నాం. కానీ, ఇప్పటికీ ఓ రైల్వే మార్గం మాత్రం బ్రిటిష్ కంపెనీ నియంత్రణలోనే ఉంది. భారతీయ రైల్వే ఈ మార్గాన్ని కొనుగోలు చేయడానికి చాలా ప్రయత్నాలు చేసినా సఫలం కాలేదు.
మహారాష్ట్రలోని రైల్వే మార్గం..
భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 77 సంవత్సరాలు పూర్తయ్యాయి. అయినప్పటికీ, మహారాష్ట్రలోని ఒక రైల్వే మార్గాన్ని ఇప్పటికీ ఒక బ్రిటిష్ కంపెనీ నిర్వహిస్తోంది. ఈ రైల్వే మార్గాన్ని కొనుగోలు చేయడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసినా అవి విజయవంతం కాలేదు. సెంట్రల్ ప్రావిన్స్ రైల్వే కంపెనీ బ్రిటిష్ కంపెనీ అయిన ‘కిల్లిక్ నిక్సన్ – కో’ కంపెనీయే ఇంకా నిర్వహిస్తోంది. ఈ కంపెనీ మహారాష్ట్రలోని అమరావతి నుంచి ముర్తాజాపూర్ వరకు ఉన్న 190 కిలోమీటర్ల రైలు మార్గంలో శకుంతల ఎక్స్‌ప్రెస్‌ను నడిచేది. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత బ్రిటిష్ వారు భారతదేశం నుంచి వెళ్లిపోయారు. అయినా, ఈ మార్గంపై బ్రిటిష్ ప్రైవేట్ కంపెనీ అధికారం కొనసాగుతోంది.
రాయల్టీ చెల్లిస్తున్న భారతీయ రైల్వే..
ఇదిలా ఉంటే.. 190 కిలోమీటర్ల అమరావతి – ముర్తాజాపూర్ రైల్వే మార్గం మనకు రాకపోవడంతో దానిని నిర్వహిస్తున్న బ్రిటిష్ కంపెనీకి భారతీయ రైల్వే రూ.1.20 కోట్ల రాయల్టీ చెల్లించేదట. అయితే, ప్రస్తుతం ఆ పరిస్థితి మారిందని పలు నివేదికలు చెబుతున్నాయి. ఇప్పుడు రాయల్టీ చెల్లించాల్సిన అవసరం లేదని చెబుతున్నారు. 190 కిలోమీటర్ల మేర ఉన్న ఈ రైల్వే మార్గాన్ని స్వాధీనం చేసుకోవడానికి భారతీయ రైల్వే అనేక ప్రయత్నాలు చేసింది. అయితే, అవి విజయవంతం కాలేదు. ఈ రైలు మార్గంలో శకుంతల ప్యాసింజర్ అనే ఒకే ఒక ప్రయాణికుల రైలు నడిచేది. దీంతో ఈ మార్గాన్ని శకుంతల రైలు మార్గం అని పిలుస్తారు. శకుంతల ఎక్స్‌ప్రెస్ అచల్‌పూర్, యావత్మల్ మధ్య 17 స్టేషన్లలో ఆగేది. దాదాపు 70 సంవత్సరాలు ఈ రైలు ఆవిరి ఇంజిన్‌తో నడిచింది.
1994లో డీజిల్ ఇంజిన్‌తో..
శకుంతల ప్యాసింజర్ రైలుకి 1994లో డీజిల్ ఇంజిన్‌ను అమర్చారు. ఆ తర్వాత అనుకోని కారణాలతో రైలును నిలిపివేశారు. దీనిని తిరిగి ప్రారంభించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. 5 బోగీలున్న ఈ రైలు ప్రతిరోజూ 800 నుంచి 1,000 మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేర్చేది. భారతీయ రైల్వే 1951లో జాతీయం అయింది. ఈ రైలు మార్గం మాత్రం భారత ప్రభుత్వ అధికార పరిధిలోకి రాలేదు.