Deputy CM Pawan Kalyan (1)
Deputy CM Pawan Kalyan : దేశానికి గ్రామాలే పట్టుకొమ్మలు. స్థానిక సంస్థలు బలంగా ఉంటేనే.. దేశం అభివృద్ధి చెందుతుంది. స్థానిక సంస్థలకు స్వయంపాలన వచ్చిన నాడే అభివృద్ధి ఫలాలు దక్కే అవకాశం ఉంది. కానీ దురదృష్టవశాత్తు గత ఐదేళ్లలో స్థానిక సంస్థలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. వాటికి సరైన నిధులు లేక సమస్యలు యధాతధంగా ఉండిపోయాయి. అభివృద్ధి జాడ లేకుండా పోయింది. రాజ్యాంగబద్ధ నిధులు సైతం నిలిచిపోయాయి. స్వాతంత్ర్య అనంతరం పంచాయితీలకు ఆర్థిక సంఘం నిధులను కేటాయిస్తూ వచ్చారు. గ్రామంలో జనాభాను అనుసరించి.. ప్రతి సంవత్సరం కేంద్ర ప్రభుత్వం మౌలిక వసతుల కల్పనకు ఆర్థిక సంఘం నిధులు కేటాయించేది. కానీ గత ఐదు సంవత్సరాలుగా వైసిపి ప్రభుత్వం సంక్షేమ పథకాలను భారీగా అమలు చేసింది. దీంతో ఆర్థిక సంఘం నిధులను సైతం పక్కదారి పట్టించింది. సంక్షేమ పథకాలకు దారి మళ్లించింది. మరోవైపు సర్పంచుల హక్కులను, విధులను కాలరాసింది. సచివాలయ వ్యవస్థను తెచ్చి పంచాయతీలను ఉత్సవ విగ్రహంగా మార్చింది. సర్పంచులు చిన్నపాటి పనులు కూడా చేయలేని స్థితికి చేరుకున్నారు. ఈ పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. కీలకమైన పల్లె పాలనకు సంబంధించి శాఖలను పవన్ కళ్యాణ్ దక్కించుకున్నారు. పల్లెల అభివృద్ధికి నడుము కట్టారు. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నేరుగా ఈరోజు గ్రామసభలను రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించేందుకు నిర్ణయించారు. సీఎం చంద్రబాబుతో పాటు డిప్యూటీ సీఎం పవన్ తో పాటు మంత్రులు ఈ గ్రామ సభల్లో పాల్గొనున్నారు.
* పల్లె శాఖలన్నీ పవన్ వద్ద
పవన్ కళ్యాణ్ పట్టుపట్టి గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖలను దక్కించుకున్నారు. గ్రామ సీమలను సిరుల సీమలుగా మార్చేందుకు పవన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గతంలో స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పంచాయితీలకు 100 నుంచి 200 రూపాయలు మాత్రమే ఇచ్చేవారు.కానీ దానిని 100శాతానికి పెంచుతూ.. సాధారణ పంచాయతీకి పదివేల రూపాయలు, మేజర్ పంచాయతీకి పాతికవేల రూపాయలు ప్రకటించారు. పల్లెలపై తనకున్న మక్కువను చాటుకున్నారు. ఇప్పుడు అదే స్ఫూర్తితో రాష్ట్రవ్యాప్తంగా అన్ని పంచాయితీలు ఈరోజు గ్రామసభలను నిర్వహిస్తున్నారు. గ్రామాల్లో సమస్యల పరిష్కార లక్ష్యంగా ఈ సభలు జరగనున్నాయి.
* వైసీపీ హయాంలో నిర్వీర్యం
జగన్ తన ఐదేళ్ల కాలంలో పంచాయితీలను పూర్తిగా నిర్వీర్యం చేశారన్న విమర్శలు ఉన్నాయి. ప్రజలకు అవసరమైన కనీస స్థాయిలో మౌలిక వసతులు కల్పించలేదన్న అపవాదు ఉంది. ప్రజలు ఎంతో ఆశతో గెలిపిస్తే.. వారికి ఏం చేయలేకపోయాం అన్న బాధ వైసిపి సానుభూతిపరులైన సర్పంచుల్లో కూడా ఉంది. సచివాలయ వ్యవస్థతో పాటు వాలంటీర్ వ్యవస్థతో తమను నీరుగార్చారన్న బాధ వారిలో కనిపిస్తోంది. చివరికి ఉపాధి హామీ పథకం నిధులను సైతం పక్కదారి పట్టించడంతో ప్రజలకు కనీస వసతులు కల్పించలేకపోయారు. మొన్నటి ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి ఇదే ప్రధాన కారణం కూడా. దానిని సరి చేసే పనిలో పడ్డారు పవన్. గ్రామసభలు ఏర్పాటు చేసి ప్రజా ఉపయోగ పనులను గుర్తించనున్నారు.
* ఆ నాలుగు అంశాలపైనే చర్చ
గ్రామ సభల్లో ప్రధానంగా నాలుగు అంశాలను చర్చించనున్నారు. వాటికే అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నారు. మరుగుదొడ్లు, విద్యుత్, కుళాయి, వంటగ్యాస్ కనెక్షన్లు మొదటి ప్రాధాన్యత ఇస్తారని తెలుస్తోంది. రెండో ప్రాధాన్యత అంశంగా మురుగునీరు- ఘన వ్యర్ధాల నిర్వహణ, వీధి దీపాలు, సిమెంట్ రహదారులు.. మూడో ప్రాధాన్యతాంశంగా రోడ్ల నిర్మాణం, మండల కేంద్రాలకు లింక్ రోడ్ల అంశం.. నాలుగో ప్రాధాన్యతాంశంగా ఇంకుడు గుంతలు, పంట కుంటల నిర్మాణం, ఉద్యానవన, పట్టు పరిశ్రమ అభివృద్ధికి సదుపాయాలు, పశువుల పెంపకం, చెడ్ల నిర్మాణానికి చర్యలు వంటి వాటికీ అత్యంత ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. గ్రామ సభలో వాటి తీర్మానాలను రూపొందించి ఆమోదించనున్నారు. మొత్తానికైతే పవన్ పెద్ద యాగమే చేస్తున్నారు. రాష్ట్రంలో గ్రామీణ అభివృద్ధికి పెద్ద పీట వేస్తున్నారు.