Andhra Pradesh PRC : ఈ ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress ) ఓడిపోవడానికి ప్రధాన కారణం ఉద్యోగులు, ఉపాధ్యాయులు. ఆ రెండు వర్గాలను సంతృప్తి పరచడంలో జగన్ పూర్తిగా విఫలమయ్యారు. వారితో శత్రుత్వం పెంచుకున్నారు. అందుకు మూల్యం చెల్లించుకున్నారు. ఎప్పుడైతే వైసీపీ సర్కార్ను ఉద్యోగ, ఉపాధ్యాయులు వ్యతిరేకించారో.. అప్పుడే చంద్రబాబు ఆ రెండు వర్గాలకు వరాలు ప్రకటించారు. తాము అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఉద్యోగులకు సంబంధించిన ప్రతి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు. అప్పటికే జగన్మోహన్ రెడ్డి సర్కార్ పై కోపంగా ఉన్న ఆ రెండు వర్గాలు కూటమికి ఏకపక్షంగా మద్దతు తెలిపాయి. సగటు ఉద్యోగి మరోసారి జగన్ అధికారంలోకి రాకూడదని కోరుకున్నారు. అది టిడిపి కూటమికి వరంగా మారింది. అయితే ఏడు నెలలు పాలన పూర్తయిన ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకోలేదు చంద్రబాబు సర్కార్. అందుకే ఇప్పుడు ఉద్యోగ సంఘాల నేతలు తెరపైకి వచ్చి సరికొత్త డిమాండ్లు పెడుతుండడంతో కూటమిలో ఆందోళన ప్రారంభమైంది.
* రూ. 25 వేల కోట్ల బకాయిలు
రాష్ట్రవ్యాప్తంగా( State wise) ఉద్యోగులకు 25 వేల కోట్ల రూపాయల బకాయిలు ఉన్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా డీఏ ప్రకటనలో జాప్యం జరగడాన్ని తప్పుపడుతున్నారు. మరోవైపు ఉద్యోగుల జీతాలు కూడా ఆలస్యం అవుతున్నాయి. ప్రభుత్వం వచ్చిన తొలి నెలల్లో ఒకటో తేదీన జీతాలు అందిస్తూ వచ్చారు. అయితే గత రెండు నెలలుగా వివిధ కారణాలు చెబుతూ.. ఉద్యోగుల జీతాలు ఆలస్యం చేస్తున్నారు. వైసిపి సర్కార్తో ఇబ్బందులు పడడం వల్లే కూటమిని బలపరిస్తే.. ఇప్పుడు కూడా అదే పరిస్థితి ఉందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ తీరును తప్పుపడుతున్నారు.
* ఎన్నికల్లో చాలా హామీలు
వాస్తవానికి ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం( Alliance government ) ఉద్యోగులకు చాలా రకాల హామీలు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన మరుక్షణం ఐఆర్ ప్రకటిస్తామని చెప్పింది. మెరుగైన పిఆర్సీని సైతం అమలు చేస్తామని చెప్పింది. పెండింగ్ బకాయిలు చెల్లిస్తామని కూడా హామీ ఇచ్చింది. ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తామని కూడా చెప్పుకొచ్చింది. సిపిఎస్, జిపిఎస్ విధానాన్ని పున సమీక్షించి అందరికీ ఆమోదయోగ్యమైన విధానాన్ని తీసుకొస్తామని కూడా ప్రకటించింది. గ్రామ సచివాలయాల వ్యవస్థను నీరుగార్చే ప్రయత్నం చేస్తుందన్న ఆందోళన సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తం అవుతోంది. అయితే అన్ని ఉద్యోగ సంఘాల నేతలు ఇప్పుడిప్పుడే మాట్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వ తీరును ప్రశ్నిస్తున్నారు. దీంతో వైయస్సార్ కాంగ్రెస్ మాదిరిగా.. కూటమిసైతం ఉద్యోగులకు వ్యతిరేకంగా మారుతుందా అన్న ఆందోళన వ్యక్తం అవుతోంది.
* పిఆర్సి అమలుకు డిమాండ్
కూటమి( Alliance ) అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అవుతుంది. ఇంతవరకు ఉద్యోగులకు సంబంధించి ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ప్రధానంగా పిఆర్సి అమలు చేయాలని డిమాండ్ వినిపిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులు ముక్తకంఠంతో దీనినే కోరుకుంటున్నారు. మూడు డీఏ ల బకాయిలు నిలిచిపోయాయని.. కనీసం ఒక్క డీఏ అయినా ఇవ్వాలని కోరుతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఉద్యోగులకు నెలసరి వేతనాలు 6000 కోట్ల రూపాయలకు పైగా దాటుతోంది. రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న దృష్ట్యా పెండింగ్ బకాయిలు ఇవ్వలేమని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు సిపిఎస్ విధానాన్ని రద్దు చేస్తామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఆ హామీ కూడా అమలుకు నోచుకోవడం లేదు. దీంతో ఉద్యోగుల్లో ఒక రకమైన అసంతృప్తి ప్రారంభమైంది. అది ఎంతవరకు దారితీస్తుందో నన్న ఆందోళన కూటమి నేతల్లో ఉంది.