Liquor Scam: ఏపీలో మద్యం విక్రయాలపై ఎన్నెన్నో అనుమానాలు ఉన్నాయి. అప్పటివరకు ఉన్న మద్యం పాలసీని జగన్ సర్కార్ మార్చింది. ఏకంగా ప్రభుత్వమే మద్యం దుకాణాలను నడపాలని నిర్ణయించింది. మద్య నిషేధాన్ని పక్కన పెట్టి మరి.. మద్యం ద్వారా ఆదాయం సమకూర్చుకునే పనిలో ప్రభుత్వం పడింది. అయితే ఈ క్రమంలోమద్యం అమ్మకాల్లో భారీగా అవకతవకలు జరిగాయని అనుమానాలు ఉన్నాయి. నాసి రకం బ్రాండ్ల అమ్మకాలు, డిజిటల్ పేమెంట్లు లేకపోవడం తదితర కారణాలతో ఈ అవినీతి జరిగిందన్న అనుమానాలు బలంగా వినిపిస్తున్నాయి. సరిగ్గా ఇప్పుడు ఎన్నికల ముంగిట ఈడి దీని పైనే దృష్టి పెట్టినట్లు తెలుస్తోంది. అదే జరిగితే వైసిపి సర్కారు ఇబ్బందుల్లో పడినట్టే. పొరపాటున జగన్అధికారం కోల్పోతే.. కొత్త ప్రభుత్వం మద్యం దోపిడీపై పట్టు బిగించే అవకాశం ఉంది.
చిన్నపాటి దుకాణాల్లో సైతం డిజిటల్ పేమెంట్లు నిర్వహిస్తున్న రోజులు ఇవి. కానీ కోట్లాది రూపాయల క్రయవిక్రయాలు జరిగే మద్యం అమ్మకాల్లో మాత్రం డిజిటల్ లావాదేవీలు చేయడం లేదు. మొదట మూడు సంవత్సరాలు పేమెంట్స్ తీసుకోలేదు. మధ్యలో ఒక ఆరు నెలల పాటు డిజిటల్ లావాదేవీలు నిర్వహించారు. గత రెండు నెలల నుంచి రాష్ట్రవ్యాప్తంగా డిజిటల్ పేమెంట్ అనేది ఆగిపోయింది. నేరుగా నగదు లావాదేవీలు జరిపి భారీ స్థాయిలో వైసీపీ సర్కార్ అవినీతి చేసిందన్న ఆరోపణలు బలంగా ఉన్నాయి.
రాష్ట్రంలో 80 లక్షల మంది మద్యం సేవించేవారు ఉన్నారని.. ఒక్కొక్కరు రోజుకి 200 రూపాయలు ఖర్చు చేస్తే.. ప్రభుత్వానికి ఏడాదికి కనీసంగా 50 వేల కోట్ల రూపాయల ఆదాయం రావాల్సి ఉంది. కానీ వైసీపీ సర్కార్ మాత్రం అందులో సగం వస్తున్నట్లు గణాంకాలు చూపుతోంది. ఈ లెక్కన భారీ అవినీతి జరుగుతుందని తేలుతోంది. 2019 నాటికి టీడీపీ ప్రభుత్వానికి రోజుకు 50 కోట్లు మద్యం ద్వారా ఆదాయం వచ్చింది. ఇప్పుడు వైసీపీ సర్కార్కు 80 కోట్ల వరకు వస్తోంది. కనీసం మంచి బ్రాండ్ లేవు. దుకాణాల వద్ద 116 రకాల బ్రాండ్స్ పేర్లు కనిపిస్తాయి. కానీ షాపుల్లో ఉండేది కేవలం నాలుగైదు బ్రాండ్స్ మాత్రమే. డిజిటల్ పేమెంట్స్ లేనందున మద్యం షాపుల్లో కేవలం క్యాష్ తీసుకుని లెక్కలు చెప్పడంలో అక్రమాలు జరుగుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ప్రధానంగా జీఎస్టీ ఎగ్గోడుతున్నారన్న అనుమానాలు ఉన్నాయి. దీనిపై ఈడికి పెద్ద ఎత్తున ఫిర్యాదులు వెళ్లినట్లు సమాచారం. అందుకే ఈడి రహస్యంగా విచారణ చేపడుతోందన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ఎన్నికల ముందు వైసీపీ సర్కార్ చిక్కుల్లో పడినట్టే.