CM Chandrababu
CM Chandrababu: ఏపీలో( Andhra Pradesh) రాజకీయాలు వేడెక్కుతున్నాయి. రాజకీయ పార్టీల మధ్య విపరీతమైన పోటీ నెలకొంది. ఒకరిపై ఒకరు దుష్ప్రచారం కూడా చేసుకుంటున్నారు. ఈ క్రమంలో వైయస్సార్ కాంగ్రెస్ వర్సెస్ తెలుగుదేశం కూటమి అన్నట్టు ఉంది పరిస్థితి. ప్రభుత్వ వైఫల్యాలపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుండగా.. వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు తెలియజేస్తోంది కూటమి సోషల్ మీడియా. ఈ క్రమంలో ఫేక్ ప్రచారాలు సైతం తెరపైకి వస్తున్నాయి. తాజాగా ప్రజా సమస్యల పరిష్కారం కోసం సీఎం చంద్రబాబు టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చారని.. ఇందుకుగాను 73062 99999 నంబరుకు సంప్రదించాలని టిడిపి ప్రత్యేక ప్రకటన ఇచ్చినట్లు ఓ కథనం వచ్చింది. ఓ డిజిటల్ మీడియాలో ఈ కథనం వచ్చినట్లు సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది. దీంతో తెలుగుదేశం పార్టీ నాయకత్వం ప్రత్యేక ప్రకటన ఇవ్వాల్సి వచ్చింది.
* ప్రజల్లో అసంతృప్తి పెంచేందుకు
ఏపీలో కూటమి అధికారంలోకి( Alliance government ) వచ్చి 9 నెలలు అవుతోంది. ఎన్నికల్లో గెలిచేందుకు టిడిపి కూటమి భారీగా హామీలు ఇచ్చింది. ముఖ్యంగా చంద్రబాబు సూపర్ సిక్స్ పథకాలను అమలు చేస్తామని చెప్పుకొచ్చారు. కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేయలేకపోయారు. అదిగో ఇదిగో అంటూ కాలయాపన తప్ప ప్రధాన పథకాలు ఏవి ప్రారంభం కాలేదు. దీంతో ప్రజల్లో ఒక రకమైన అభిప్రాయం కూటమి ప్రభుత్వం పట్ల ఏర్పడుతోంది. మరోవైపు అభివృద్ధి సైతం పెద్దగా కనిపించడం లేదు. ఇటువంటి తరుణంలో కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఆగ్రహం కలిగేలా చేయాలన్నది వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్లాన్ గా తెలుస్తోంది.
* వినతుల విభాగానికి ప్రాధాన్యం
చంద్రబాబు సర్కార్( Chandrababu government) గ్రీవెన్స్ సెల్ విభాగానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది. ప్రజల నుంచి వచ్చిన వినతులకు తక్షణ పరిష్కార మార్గం చూపాలని భావిస్తోంది. ఇప్పటికే టిడిపి కేంద్ర కార్యాలయంలో ప్రతినెల గ్రీవెన్స్ విభాగాన్ని నిర్వహిస్తూ వచ్చింది. పార్టీ శ్రేణులతో పాటు ప్రజల నుంచి వచ్చిన వినతులకు అక్కడికక్కడే పరిష్కార మార్గం చూపించేందుకు ప్రయత్నిస్తోంది. గ్రీవెన్స్ సెల్ విభాగానికి సంబంధించి మంత్రులతో పాటు ఎమ్మెల్యేలకు బాధ్యతలు అప్పగిస్తుంది. ఇంకోవైపు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో పాటు మంత్రి నారా లోకేష్ సైతం తమ సొంత కార్యాలయాల్లో వినతులు స్వీకరిస్తున్నారు.
* గతంలో ఆ ఆలోచన చేసిన
మరోవైపు రాష్ట్రస్థాయిలో సీఎం చంద్రబాబుకు( CM Chandrababu) తమ సమస్యలను విన్నవించేందుకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ అందుబాటులోకి తెచ్చినట్లు పెద్ద ఎత్తున ప్రచారం నడిచింది. అయితే ఎప్పటినుంచో ఈ ఆలోచన చేస్తూ వస్తోంది తెలుగుదేశం పార్టీ. కానీ రకరకాల సాంకేతిక సమస్యలు వస్తాయని భావించి వెనక్కి తగ్గింది. అయితే సడన్గా సోషల్ మీడియాలో ఒక కథనం వచ్చింది. డిజిటల్ మీడియా ప్లాట్ ఫామ్ గా నడుస్తున్న ఓ పత్రికలో దీనికి సంబంధించి ప్రత్యేక కథనం వచ్చింది. అయితే అది ఫేక్ అంటూ తెలుగుదేశం పార్టీ ప్రత్యేక ప్రకటన జారీ చేయాల్సి వచ్చింది.