Tirupati: ఏపీలో భూకంపం సంభవించింది. భూమి స్వల్పంగా కంపించింది. తిరుపతి, నెల్లూరు జిల్లాల్లో పలు ప్రాంతాల్లో గురువారం రాత్రి భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. నెల్లూరు జిల్లాలోని నాయుడుపేట, ఓజిలి, దొరవారి సత్రం, ఎల్లకూరు మండలాల్లో భూమి కంపించినట్లు తెలుస్తోంది. మరోవైపు తిరుపతి జిల్లాలోని దొరవారి సత్రం లోనూ ప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రెండు మూడు సెకండ్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.
ఒక్కసారిగా భూమి కంపించడంతో ఇళ్లల్లో ఉన్నవారు బయటకు వచ్చేశారు. సమాచారం అందుకున్న అధికారులు భూ ప్రకంపనలపై ఆరా తీశారు. స్వల్ప ప్రకంపనలే కావడంతో ఎలాంటి ఆస్తి,ప్రాణ నష్టం సంభవించలేదు. దీంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.అయితే ప్రజలు ఇళ్లల్లోకి వెళ్లేందుకు మాత్రం భయపడ్డారు. అయితే ఏపీకి సంబంధించి ఆ రెండు జిల్లాల్లో మాత్రమే భూప్రకంపనలు బయటపడ్డాయి.
మరోవైపు జపాన్ లో భారీ భూప్రకంపనలు సంభవించాయి. రిక్టర్ స్కేల్ పై ఆరు తీవ్రతతో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ ప్రకటించింది. జపాన్ వాతావరణ సంస్థ నివేదిక ప్రకారం ఫూకూషిమ ఫ్రీ పిక్చర్ తీరంలో గుర్తించారు. దీంతో బలమైన ప్రకంపనలు చోటు చేసుకున్నట్లు అధికారులు గుర్తించారు. ఆ ప్రాంతంలో హై అలెర్ట్ ప్రకటించారు. ఎలాంటి సునామీ హెచ్చరికలు జారీ చేయలేదని అధికారులు తెలిపారు. ప్రస్తుతానికి ఎలాంటి ప్రాణ, ఆస్తి నష్టం లేదు. కానీ భయంతో జనాలు ఇళ్ల నుంచి పరుగులు తీయడం కనిపించింది.