Earthquakes : ఏపీలో భూప్రకంపనలు వచ్చాయి. రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో భూమి స్వల్పంగా కంపించింది. దీంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఇళ్ల నుంచి భయంతో బయటకు పరుగులు తీశారు. గత కొద్దిరోజులుగా ఏపీలో భూ ప్రకంపనలు సర్వసాధారణంగా మారాయి. రాష్ట్రంలో చాలా ప్రాంతాల్లో తరచూ ప్రకంపనలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ప్రకాశం జిల్లాలో భూ ప్రకంపనలు సంభవించాయి. మండ్లమూరుతో పాటుగా తుళ్లూరు మండలంలో స్వల్పంగా భూప్రకంపనలు వచ్చాయి.ముండ్లమూరు, పోలవరం పసుపుగల్లు, శంకరాపురం, మారెళ్ళ, తూర్పు కంభంపాడు, వేంపాడులో భూమి కంపించిందని స్థానికులు చెబుతున్నారు. తాళ్లూరు మండలం లోని గంగవరం, రామభద్రపురం, తాళ్లూరు తో పాటుగా ఇతర గ్రామాల్లో రెండు సెకండ్ల పాటు స్వల్ప భూప్రకంపనలు సంభవించాయి. ముండ్లమూరులో ప్రభుత్వ పాఠశాల నుంచి విద్యార్థులు భయంతో బయటకు పరుగులు తీశారు. ప్రభుత్వ కార్యాలయాలనుంచి ఉద్యోగులు బయటకు వచ్చేశారు.
* ప్రకాశం జిల్లాలో తరచూ
ప్రకాశం జిల్లాలో ఇటీవల తరచూ భూప్రకంపనలు సంభవిస్తున్నాయి. గతంలో కూడా ముండ్లమూరు, తాళ్లూరు మండలంలోని అనేక గ్రామాల్లో భూమి కంపించింది. డిసెంబరు నాలుగున తెలుగు రాష్ట్రాల్లో భూమి కంపించిన విషయం తెలిసిందే. అటు తెలంగాణలో సైతం ప్రకంపనలు వెలుగులోకి వచ్చాయి. ఏపీకి సంబంధించి ఉమ్మడి కృష్ణా,పశ్చిమగోదావరి, తూర్పుగోదావరి, విశాఖ తో సహా చాలా జిల్లాల్లో భూమి కంపించింది. అప్పుడు సైతం జనాలు ఇంటి నుంచి బయటకు పరుగులు పెట్టారు.
* తీవ్రత తెలియాల్సి ఉంది
అయితే తాజాగా ప్రకాశం జిల్లాలోభూ ప్రకంపనలకు సంబంధించి తీవ్రత తెలియాల్సి ఉంది. ఈనెల 4న సంభవించిన భూప్రకంపనలకు తెలంగాణలోని ములుగు జిల్లా కేంద్రమని గుర్తించారు. ఈ మేరకు భూకంప కేంద్రంలో.. భూమి అడుగు భాగం నుంచి 200 నుంచి 300 కిలోమీటర్ల దూరంలో ఈ ప్రకంపనలను గుర్తించారు. అప్పట్లో రెక్టర్ స్కేల్ పై 5.3గా నమోదయింది. మరి ఇప్పుడు ఎంత తీవ్రత నమోదయ్యిందో తెలియాల్సి ఉంది.