Earthquake In Visakhapatnam: ఏపీలో పలు ప్రాంతాల్లో ఈరోజు ఉదయం భూమి కంపించింది. ప్రధానంగా విశాఖ వాసులను వణికించింది. తెల్లవారుజామున విశాఖలోని చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రధానంగా బీచ్ రోడ్ లోని భూప్రకంపనలకు సంబంధించి వీడియో ఒకటి సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతుంది. అయితే నగరంలో చాలా ప్రాంతాల్లో భూమి కంపించింది. ప్రజలు భయంతో పరుగులు తీశారు. ప్రజలు నిద్రలో ఉండగా వేకువ జామున 4.16 గంటల సమయంలో భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. భూకంపం తీవ్రత రిక్టార్ స్కేల్ పై 3.7 గా నమోదయినట్లు జాతీయ భూకంప పరిశోధనా కేంద్రం వెల్లడించింది. భూమి లోపల పది భూమి లోపల పది కిలోమీటర్ల లోతులో కేంద్ర బిందువు నమోదయినట్లు తేలింది. అల్లూరి సీతారామరాజు జిల్లా జిమాడుగుల ప్రాంతంలో ఉన్నట్లు అధికారులు గుర్తించారు. అయితే ఎటువంటి ప్రాణ ఆస్తి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు.
* ఈ ప్రాంతాల్లో అధికం..
ప్రధానంగా విశాఖ నగరంలోని గాజువాక, మధురవాడ,రిషికొండ, భీమిలి, మహారాణిపేట, కైలాసపురం, విశాలాక్షి నగర్, రాంనగర్, మురళి నగర్, అక్కయ్యపాలెం తదితర ప్రాంతాల్లో ఎక్కువగా వచ్చాయి. ప్రజలు తీవ్ర ఆందోళనతో ఇళ్ళ నుంచి బయటకు వెళ్లిపోయారు. ఎటువంటి నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు భీమిలి తీర ప్రాంతంలో సైతం భూ ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.