Sakshi Media Sajjala Bhargava Reddy: వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీలో అనతి కాలంలో ఎదిగారు సజ్జల రామకృష్ణారెడ్డి. ఎప్పుడో ఉదయం పత్రికలో పనిచేసిన ఆయన.. తరువాత క్రమంలో ఈనాడు సంస్థలో సేవలందించారు. అటు తరువాత వ్యాపారంలో అడుగుపెట్టారు. కానీ జగన్మోహన్ రెడ్డి సాక్షి మీడియా ఏర్పాటు చేసిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డికి పిలిచారు. సాక్షిలో కీలక బాధ్యతలు అప్పగించారు. అలా సాక్షి మీడియాలో ఉండగానే జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో చేరి.. వైసిపి అధికారంలోకి రావడంతో కీలకంగా మారారు. పార్టీతో పాటు ప్రభుత్వంలో తనదైన పాత్ర పోషించారు. సకల శాఖామంత్రిగా గుర్తింపు పొందారు. అయితే అనతి కాలంలో ఎదిగిన సజ్జల రామకృష్ణారెడ్డి తన కుమారుడు భార్గవరెడ్డిని సైతం వైసిపి తో పాటు ఆ పార్టీకి సేవలు అందించడంలో యాక్టివ్ అయ్యేలా చేశారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలో అతి ప్రతిష్టాత్మకంగా భావించే సోషల్ మీడియా ఇన్చార్జిగా బాధ్యతలు అప్పగించారు. విజయసాయిరెడ్డిని కాదని ఆ బాధ్యతల్లో తన కుమారుడిని కూర్చోబెట్టడంలో సజ్జల రామకృష్ణారెడ్డి సక్సెస్ అయ్యారు.
* టార్గెట్ చేసిన కూటమి ప్రభుత్వం..
అయితే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయిన తరువాత సజ్జల భార్గవరెడ్డి( sajjala Bhargava Reddy ) టార్గెట్ గా మారారు. దీంతో వ్యూహాత్మకంగా ఆయనను వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియా ఇన్ఛార్జ్ బాధ్యతల నుంచి తప్పించారు. ఒకానొక దశలో భార్గవరెడ్డి అరెస్ట్ అవుతారని ప్రచారం సాగింది. కానీ న్యాయస్థానాలకు వెళ్లి ఉపశమనం పొందారు. గత కొద్దిరోజులుగా భార్గవరెడ్డి ఆచూకీ లేదు. అయితే ఇప్పుడు అదే భార్గవ రెడ్డికి జగన్మోహన్ రెడ్డి కీలక బాధ్యతలు అప్పగించినట్లు తెలుస్తోంది. సాక్షి మీడియాకు సంబంధించి డిజిటల్ కంటెంట్ ఇన్చార్జిగా సజ్జల భార్గవరెడ్డికి బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం. ప్రస్తుతం సాక్షి మీడియా బాధ్యతలను వైయస్ భారతి రెడ్డి చూస్తున్నారు. ఆమెకు సహాయంగా ఉండేందుకు భార్గవ రెడ్డికి ఈ కీలక బాధ్యతలు అప్పగించినట్లు సమాచారం.
* అలా పార్టీలో ప్రవేశం..
ముందుగా సాక్షి మీడియాలో( Sakshi media) ప్రవేశించారు సజ్జల రామకృష్ణారెడ్డి. క్రమేపి జగన్మోహన్ రెడ్డికి దగ్గరయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సభ్యత్వం తీసుకున్నారు. పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్మోహన్ రెడ్డి నమ్మిన బంటుగా మారిపోయారు. ఎంతలా అంటే అప్పటివరకు పార్టీలో నెంబర్ 2 గా ఉన్న విజయసాయిరెడ్డిని అధిగమించి ఆ స్థానాన్ని దక్కించుకున్నారు సజ్జల రామకృష్ణారెడ్డి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యకలాపాలైన.. లేకుంటే ప్రభుత్వ కార్యక్రమాలైనా.. చివరకు ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించాలన్న.. ప్రభుత్వ నిర్ణయాలను ప్రకటించాలన్న.. ఇలాంటి ఏ విషయం అయినా సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు పరిస్థితి మారింది. అయితే 2024 ఎన్నికల్లో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ దారుణంగా ఓడిపోవడానికి సజ్జల రామకృష్ణారెడ్డి కారణమన్న ఫిర్యాదులు కూడా ఉన్నాయి.
* పెరిగిన ప్రాధాన్యం..
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీ ఓడిపోయిన తర్వాత సజ్జల రామకృష్ణారెడ్డి ప్రాధాన్యత తగ్గుతుందని ఆశించారు. ఒకరిద్దరూ రాష్ట్రస్థాయి నాయకులు సైతం ఆయనతోనే ఇబ్బంది వచ్చిందని జగన్మోహన్ రెడ్డికి ఫిర్యాదు చేశారు కూడా. దీంతో కొద్దిరోజుల పాటు సైలెంట్ అయ్యారు సజ్జల రామకృష్ణారెడ్డి. పార్టీలో ఉన్నామా లేదా అన్నట్టు ఆయన వ్యవహార శైలి సాగింది. కానీ జగన్మోహన్ రెడ్డి మాత్రం సజ్జల రామకృష్ణారెడ్డి పై నమ్మకం కోల్పోలేదు. ఏకంగా తన తరువాత పోస్టు అన్నట్టు వైసిపి రాష్ట్రస్థాయి సమన్వయకర్త పోస్టును ఆయనకు అప్పగించారు. ఇప్పుడు ఏకంగా సాక్షి మీడియాను ఆయన కుమారుడు భార్గవరెడ్డి చేతిలో పెట్టారు. అయితే సజ్జల కుటుంబం ప్రాధాన్యతపై వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో ఒక రకమైన ప్రచారం ఉంది. చూడాలి మరి ఏం జరుగుతుందో?