Duvvada Vani: దువ్వాడ వాణి( duvvada Vani ) యాక్టివ్ అవుతున్నారా? శ్రీకాకుళం జిల్లా రాజకీయాల్లో ప్రభావం చూపాలని భావిస్తున్నారా? జగన్ సైతం ఆమెను ప్రోత్సహిస్తున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేసింది. దివ్వెల మాధురి అనే మహిళతో దువ్వాడ శ్రీనివాస్ సన్నిహితంగా ఉంటున్నారు. దీంతో భార్య, పిల్లలతో విభేదాలు తెచ్చుకున్నారు. ఈ క్రమంలో ఆ కుటుంబ వివాదం రచ్చగా మారింది. అయితే దువ్వాడ వ్యక్తిగత వైఖరితో పార్టీకి నష్టం జరుగుతోందని జిల్లా నేతలు కొంతమంది ఫిర్యాదు చేయడంతో పార్టీ ఆయన పై వేటు వేసింది. అయితే ఇది జరిగిన తర్వాత దువ్వాడ శ్రీనివాస్ భార్య వాణి పార్టీలో యాక్టివ్ అయ్యారు. తాజాగా ఆమె కూటమి ప్రభుత్వంపై సంచలన ప్రకటన చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ సర్పంచులు, స్థానిక సంస్థల ప్రతినిధుల పై వివక్ష కొనసాగుతోందని.. ఇలానే కొనసాగితే ఆమరణ నిరాహార దీక్ష కొనసాగిస్తానని హెచ్చరించారు.
* ఎన్నికలకు ముందు నుంచి రచ్చ..
అయితే దువ్వాడ శ్రీనివాస్ ( duvvada Srinivas )కుటుంబంలో రచ్చ ఈనాటిది కాదు. గత ఎన్నికలకు ముందు నుంచే ఆ వివాదం బయటపడింది. అప్పుడే దువ్వాడ వాణి డిమాండ్ మేరకు టెక్కలి నియోజకవర్గ ఇన్చార్జిగా ప్రకటించారు జగన్మోహన్ రెడ్డి. 2024 ఎన్నికల్లో పోటీ చేయబోయేది వాణి అంటూ ప్రకటించారు. తీరా ఎన్నికల సమయంలో దువ్వాడ శ్రీనివాస్ అభ్యర్థిత్వాన్ని ప్రకటించారు. దువ్వాడ వాణిని హైకమాండ్ పెద్దలు సముదాయించారు. పార్టీ అధికారంలోకి వస్తే దువ్వాడ శ్రీనివాస్ వద్ద ఉన్న ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆఫర్ ఇచ్చారు. దీంతో ఆమె సైలెంట్ అయ్యారు. అయితే ఎన్నికల్లో దువ్వాడకు వ్యతిరేకంగా వాణి కుటుంబం పనిచేసింది అన్నది శ్రీనివాస్ అనుచరుల వాదన. అయితే ఎన్నికల ఫలితాల అనంతరం కూడా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో యాక్టివ్ గా ఉండేవారు దువ్వాడ శ్రీనివాస్. కానీ వ్యక్తిగత రచ్చను పరిగణలోకి తీసుకుని దువ్వాడ శ్రీనివాస్ పై వేటు వేయించారు వైసీపీ జిల్లా నేతలు. అయితే తనను పార్టీ నుంచి దూరం చేసిన ధర్మాన సోదరులతో పాటు అప్పలరాజును విడిచి పెట్టనని.. వారు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరికలు జారీ చేశారు.
* ఇప్పుడిప్పుడే యాక్టివ్..
అయితే ఇప్పుడు దువ్వాడ వాణి తెరపైకి వచ్చారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో( YSR Congress party) యాక్టివ్ గా మారారు. ఆమెకు రాజకీయ అనుభవం ఉంది. రెండు దశాబ్దాల కాలం కిందట ఆమె ఎంపీపీగా పని చేశారు. ప్రస్తుతం జడ్పిటిసి గా కూడా ఉన్నారు. భర్త దువ్వాడ శ్రీనివాస్ తో కలిపి వాణి రాజకీయాలు చేశారు. 2004 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా కూడా పోటీ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జిగా కూడా ఉన్నారు. అయితే ఎప్పుడైతే దువ్వాడ శ్రీనివాస్ పై వేటుపడిందో అప్పటినుంచి శ్రీకాకుళం జిల్లా వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాల్లో వాణి పాల్గొంటున్నారు. అయితే తమపై రివెంజ్ తీర్చుకుంటానన్న దువ్వాడ శ్రీనివాస్ హెచ్చరికను జిల్లా పార్టీ నేతలు సీరియస్ గా తీసుకున్నట్లు సమాచారం. అందుకే ఇప్పుడు వారు దువ్వాడ వాణిని ప్రోత్సహిస్తున్నారు. మున్ముందు ఈ మహిళా నేత మరింతగా దూసుకుపోయే అవకాశం ఉంది.