Nara lokesh red book : ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెడ్ బుక్ పేరు ప్రముఖంగా వినిపించింది. వైసీపీ ప్రభుత్వంలో అడ్డగోలుగా వ్యవహరించిన ఎమ్మెల్యేలు,మంత్రులతో పాటు వత్తాసు పలికిన అధికారులపై కఠిన చర్యలు తీసుకుంటామని మంత్రి లోకేష్ చెప్పుకొచ్చారు. రెడ్ బుక్ లో అందరి పేర్లు రాసుకుంటున్నానని.. అధికారంలోకి వచ్చిన తర్వాత వారందరిపై చర్యలు ఖాయమని ఎన్నికలకు ముందే ప్రకటించారు లోకేష్. అప్పట్లో అధికారపక్షంగా ఉన్న వైసిపి దీనిని తేలిగ్గా తీసుకుంది. అసలు అధికారంలోకి రాకముందే ఈ రెడ్ బుక్ రాతలు ఏమిటని ప్రశ్నించింది.లోకేష్ కు అంత సీన్ లేదని ఎగతాళి చేసింది.కానీ ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చింది. నారా లోకేష్ మంత్రి అయ్యారు. అప్పట్లో అతిగా వ్యవహరించిన వైసీపీ ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారుల చుట్టూ ఉచ్చు బిగిస్తోంది. భారీగా కేసులు నమోదవుతున్నాయి. ఉన్నతాధికారులపై సస్పెన్షన్ల వేటు కొనసాగుతోంది. దీంతో లోకేష్ రెడ్ బుక్ అమలు చేస్తున్నారా అన్న అనుమానాలు ప్రారంభమయ్యాయి. ఎక్కడికక్కడే శాఖా పరంగా దర్యాప్తులు, చర్యలు కొనసాగుతున్నాయి. అయితే దీనితో రెడ్ బుక్ కు ఎటువంటి ప్రమేయం లేదని అంతా భావించారు. అయితే అవన్నీ రెడ్ బుక్ పరిణామాలే అని తాజాగా లోకేష్ ప్రకటించడం విశేషం.
* పాదయాత్ర సమయంలో
ఎన్నికలకు ముందు నారా లోకేష్ సుదీర్ఘ పాదయాత్ర చేశారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం వరకు.. యువగళం పేరిట పాదయాత్రకు దిగారు. సరిగ్గా కోనసీమ జిల్లాలో ఉండగా చంద్రబాబు అరెస్టు జరిగింది. దీంతో పాదయాత్రను నిలిపివేశారు లోకేష్. దాదాపు రెండు నెలల తరువాత తిరిగి పాదయాత్రను ప్రారంభించారు. ఎన్నికలు సమీపిస్తుండడంతో విశాఖ జిల్లాలో ముగించారు. పాదయాత్ర విజయోత్సవ సభను విజయనగరం జిల్లా భోగాపురం లో ఏర్పాటు చేశారు. ఆ సమయంలో రెడ్ బుక్ ను చూపిస్తూ తీవ్ర స్థాయిలో హెచ్చరించారు.
* నాడే హెచ్చరిక
గత ఐదేళ్ల వైసిపి పాలనలో చాలామంది నేతలు దూకుడుగా వ్యవహరించారు. ప్రత్యర్థులపై అనుచితంగా ప్రవర్తించేవారు. వ్యక్తిగత కామెంట్లకు సైతం దిగేవారు. అదే సమయంలో పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు సైతం వారికి సహకరించేవారు. ప్రభుత్వ పెద్దల ఆదేశాలను పాటించేవారు. ఈ నేపథ్యంలోనే నారా లోకేష్ నాడు స్పందించారు. అధికార వైసిపి నేతల అడుగులకు మడుగులు ఒత్తుతూ.. రాజకీయ ప్రత్యర్థులను వేధించే అధికారులు మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.చాలామంది వైసిపి నేతలతో పాటు అధికారుల పేర్లు రాసుకుంటున్నట్లు చెప్పుకొచ్చారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన మరుక్షణం వారిపై చర్యలకు ఉపక్రమిస్తామని ప్రకటించారు.
* అందులో భాగమేనని ప్రకటన
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు దాటుతోంది. లోకేష్ రెడ్ బుక్ ప్రస్తావన తేవడం లేదు. కానీ వైసీపీ నేతలతో పాటు నాటి అధికారులు కేసులతో సతమతమవుతున్నారు. అయితే అవి సాధారణ కేసులుగా అంతా భావించారు. కానీ అవి రెడ్ బుక్ ఓపెన్ చేసినవేనని.. మంత్రి లోకేష్ స్పందించారు. అందులో భాగంగానే ఐపీఎస్ లు సస్పెండ్ అయ్యారని పేర్కొన్నారు. శ్రీకాకుళం లోని ఓ పాఠశాలలో అకాస్మిక తనిఖీలు చేసిన తర్వాత లోకేష్ మీడియాతో మాట్లాడారు. ఎవరైతే చట్టాన్ని ఉల్లంఘించారో వారికి శిక్ష తప్పదని గతంలో తాను చెప్పిన మాటలకు కట్టుబడి ఉన్నట్లు చెప్పారు. మొత్తానికైతే లోకేష్ రెడ్ బుక్ ప్రకటన ప్రకంపనలు రేపుతోంది. మున్ముందు నేతలు, నాటి ఉన్నతాధికారుల అరెస్టు జరిగే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read More