Jagan: ఒక ప్రభుత్వం మంచి పేరు తెచ్చుకోవాలంటే యంత్రాంగమే కాదు.. మంత్రులు కూడా కీలకమే. మంత్రులు తమకు అప్పగించిన శాఖలపనితీరును సక్రమంగా నిర్వర్తిస్తే మంచి ఫలితాలు వస్తాయి. కానీ దురదృష్టవశాత్తు గత ఐదేళ్లలో మంత్రులు డమ్మీలుగా మారారు అన్న విమర్శ ఉంది. ఉమ్మడి ఏపీతో పాటు నవ్యాంధ్రప్రదేశ్ లో డమ్మీ క్యాబినెట్ గా వైసీపీ మంత్రులకు ఆ పేరు ఉంది. గత ఐదేళ్ల కాలంలో తమ సొంత శాఖలపై సమీక్షించిన వారు అతి కొద్ది మంది మాత్రమే. బొత్స సత్యనారాయణ, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ధర్మాన ప్రసాదరావు లాంటి మంత్రులే తమ శాఖలపై సమీక్షలు నిర్వహించగలిగారు. కానీ మిగతా ఏ ఒక్కరు సమీక్షించిన దాఖలాలు లేవు. కనీసం ప్రెస్ మీట్ పెట్టేందుకు కూడా వారు సాహసించలేకపోయారు. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మంత్రులు ఎవరికి వారు సమీక్షలు నిర్వహిస్తున్నారు. ఆకస్మిక తనిఖీలు చేస్తున్నారు. కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. ఇది ప్రజల్లోకి బలంగా వెళ్తోంది.
2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి వచ్చారు. అంతులేని మెజారిటీతో విజయం సాధించారు. కాంగ్రెస్ నాయకత్వంతో విభేదించి తన సొంత ఇమేజ్ తో గెలుపొందారు జగన్. అయితే చంద్రబాబు పాలనా వైఫల్యమో.. లేకుంటే జగన్ వన్ చాన్స్ విన్నపమో తెలియదు కానీ.. రాష్ట్ర ప్రజలు ఆదరించారు. అంతులేని మెజారిటీతో గెలిపించారు. అయితే అది తన విజయమేనని జగన్ భావించారు. వీరెవరి ప్రమేయం లేదని తేల్చేశారు. అందుకే తన అడుగులకు మడుగులొత్తే క్యాబినెట్ ను రంగంలోకి దించారు. సీనియర్లకు మొండి చేయి చూపారు. జూనియర్లతో కథ నడిపించారు. మంత్రులకు సమీక్షలు చేసే అధికారం ఇవ్వలేదు. ప్రస్తుతం మాట్లాడే స్వేచ్ఛ కల్పించలేదు. ఒక్క మాటలో చెప్పాలంటే బొమ్మరిల్లు తండ్రి మాదిరిగా వ్యవహరించారు జగన్. తాను రివ్యూ నిర్వహించారు. మంత్రులనుపక్కన పెట్టుకున్నారు.వారితో మాట్లాడించే కంటే.. తానే మాట్లాడారు. బయట సకల శాఖామంత్రిగా సజ్జల రామకృష్ణారెడ్డికి బాధ్యతలు అప్పగించారు. అంతకుమించి ఒక్క పని చేయలేదు. దాని పర్యవసానమేప్రభుత్వ వైఫల్యంగా ప్రజలు భావించారు. ఈ ఎన్నికల్లో దారుణంగా దెబ్బ కొట్టారు.
ఇప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. చంద్రబాబు సీఎంగా బాధ్యత చేపట్టారు. పవన్ కళ్యాణ్ కు డిప్యూటీ సీఎం హోదా కల్పించారు. నాలుగు కీలక శాఖలను అప్పగించారు. మరో 24 మందిని తన క్యాబినెట్ లోకి తీసుకున్నారు. కానీ జగన్ లా వ్యవహరించలేదు చంద్రబాబు. మంత్రులకు స్వేచ్ఛ ఇచ్చారు. తమ శాఖలపై పట్టు పెంచుకోవాలని సూచించారు. దీనికి సమయం కూడా ఇచ్చారు. అవసరమైతే శిక్షణ కూడా ఇస్తామని స్పీకర్ అయ్యన్నపాత్రుడు చెప్పుకొచ్చారు. అయితే నాటి జగన్ క్యాబినెట్ ను చూస్తే.. నేటి చంద్రబాబు క్యాబినెట్ ను సరిపోల్చుకుంటే ఎన్నో రకాల మార్పులు తప్పకుండా కనిపిస్తాయి. కొత్త మంత్రుల వాయిస్ కూడా వినిపిస్తుంది. మంత్రులు అంటే రాజకీయ ప్రకటనలకు కాదు.. పాలనాపరమైన అంశాలకని చంద్రబాబు చాటి చెప్పారు.
జగన్ హయాంలో పౌరసరఫరాల శాఖ మంత్రిగా కొడాలి నాని బాధ్యతలు చేపట్టారు. ఆయన తన సొంత శాఖ కంటే రాజకీయ అంశాలకే ప్రాధాన్యం ఇచ్చేవారు. రాజకీయ విమర్శలకే పరిమితం అయ్యేవారు. వివాదాస్పదంగా మారారు. సొంత శాఖ ప్రగతి పై ఎన్నడూ సమీక్షించిన దాఖలాలు లేవు. నాటి సీఎం నిర్వహించే సమావేశంలో అగ్ర తాంబూలం అందుకునే వారు. వైసీపీ విధానపరమైన నిర్ణయాలను ప్రకటించడమే కాదు, ప్రత్యర్థులపై విరుచుకుపడే బాధ్యతలను తీసుకునేవారు. అంతకుమించి ఇతర అంశాలను పట్టించుకునే వారు కాదు. చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్, జనసేన అధినేత పవన్.. వీరిని టార్గెట్ చేయడమే తన పనిగా భావించేవారు. జగన్ ప్రాపకం కోసం ఎంత మాటైనా అనేందుకు వెనుకడుగు వేసే వారు కాదు.
అయితే ఇప్పుడు సీన్ మారింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మూడు పార్టీల ఉమ్మడి ప్రభుత్వం బాధ్యతలు స్వీకరించింది. మూడు పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలు మంత్రులుగా బాధ్యతలు స్వీకరించారు. కొడాలి నాని శాఖను తీసుకుంటే.. ఇప్పుడు అదే శాఖను నాదెండ్ల మనోహర్ చూస్తున్నారు. స్వేచ్ఛగా రివ్యూలు జరుపుతున్నారు. ఆకస్మిక సందర్శనలు చేస్తున్నారు. గోదాములను పరిశీలిస్తున్నారు. పౌరసరఫరాలను ప్రత్యేకంగా పర్యవేక్షిస్తున్నారు. గతంలో కొడాలి నాని ఇదే శాఖను నిర్వర్తించారు. ఎప్పుడైనా ఇలా చేశారా? సమావేశాలు జరిపారా? ఆకస్మిక సందర్శనలు జరిపారా? అంటే మాత్రం వైసిపి శ్రేణుల నుంచి సమాధానం కరువవుతోంది. క్యాబినెట్లో మంత్రుల తీరుపై స్పష్టత వస్తోంది. నాడు మంత్రులు డమ్మీ కాగా.. నేడు మాత్రం బాధ్యత కనిపిస్తోంది. ఇదే ప్రస్తుతం వైరల్ అంశం గా మారింది. ఇది కదా కావాల్సింది అని నెటిజెన్లు కామెంట్లు పెడుతున్నారు.