AP Drone City: అమరావతిని( Amaravathi ) డ్రోన్ హబ్ గా మార్చాలని సీఎం చంద్రబాబు భావిస్తున్నారు. గతంలో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీకి అత్యంత ప్రాధాన్యం ఇచ్చేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పై ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. అందులో భాగంగానే డ్రోన్ రంగాన్ని మరింత అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. తద్వారా దేశంలో ఏపీ డ్రోన్ హబ్ గా నిలపాలని చూస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఆంధ్రప్రదేశ్ కు ఒక కీలక ప్రాజెక్టు రావడం విశేషం. ఏపీలో డ్రోన్ సిటీ ఏర్పాటు చేయనున్నట్లు గరుడ ఏరోస్పేస్ ప్రకటించింది. రూ. 100 కోట్లతో దేశంలోనే తొలి సిటీని ఏపీలో ఏర్పాటు చేయనున్నట్లు వెల్లడించింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు లో ఈ డ్రోన్ సిటీ ఏర్పాటుకు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం. కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడుతో గరుడ ఏరో స్పేస్ సీఈవో ఇటీవల భేటీ అయ్యారు. అప్పుడే ఈ విషయం బయటపడింది. ఇప్పటికే ఓర్వకల్లులో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకొస్తున్నాయి. ఇప్పుడు డ్రోన్ సిటీ ఏర్పాటుకు ముందుకు అడుగులు పడుతుండడం ప్రాధాన్యత సంతరించుకుంది.
* పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి
మరోవైపు డ్రోన్ సిటీని ఏర్పాటు చేయాలనుకుంటున్న ఏరో స్పేస్( Aero space) సంస్థ ఒక ప్రకటన చేసింది. డ్రోన్ ఆవిష్కరణలకు, పరిశోధనలను ప్రోత్సహించడానికి, పెట్టుబడుల ఆకర్షణకు, డ్రోన్ టెక్నాలజీలో భారతదేశాన్ని ముందు వరుసలో ఉంచడానికి ఈ డ్రోన్ సిటీ ఉపయోగపడుతుందని చెప్పుకొచ్చింది. ఇటీవల పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు సదరు సంస్థ ప్రతినిధులతో సమావేశం అయ్యారు. గరుడ ఏరో స్పేస్ ఫౌండర్, సీఈవో అగ్నిశ్వర్ జయప్రకాష్ వికసిత్ భారత సంకల్ప యాత్రలో భాగంగా తమ భాగస్వామ్యం గురించి వివరించారు. తమ సంస్థ విస్తరణకు ప్రయత్నాలు చేస్తున్నట్లు వెల్లడించారు. తద్వారా ఓర్వకల్లులో డ్రోన్ సిటీ ఏర్పాటుకు సంసిద్ధత వ్యక్తం చేశారు.
* అన్ని రకాల అనుమతులతో
డ్రోన్ల రంగంపై( drones sector ) అడుగుపెట్టిన ఏరో స్పేస్ సంస్థ ఇప్పటికే టైప్ సర్టిఫికేషన్, రిమోట్ పైలెట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అనుమతులతో సహా.. డిజిసిఏ నుంచి ఆరు రకాల అనుమతులు కూడా పొందింది. అదే విషయాన్ని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడుకు సైతం సదరు ప్రతినిధులు వివరించారు.
* ఆసక్తి చూపిస్తున్న సంస్థలు
కర్నూలు జిల్లా ఓర్వకల్లు( varvakallu ) ఇండస్ట్రియల్ పార్కులో పెట్టుబడులు పెట్టేందుకు పలు సంస్థలు ముందుకు వస్తున్నాయి. 12 ఎకరాల విస్తీర్ణంలో ఎలక్ట్రిక్ వాహనాల వరకు ఏర్పాటు కోసం పీపుల్ టెక్ సంస్థ ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే ఒప్పందం కుదుర్చుకుంది. రూ.1800 కోట్ల పెట్టుబడితో దీనిని అభివృద్ధి చేయనున్నారు. అలాగే 14 వేల కోట్లతో దేశంలోనే తొలి ప్రైవేట్ సెమీ కండక్టర్ తయారీ ప్లాంట్ ఏర్పాటు చేసేందుకు సైతం ఇప్పటికే ఒప్పందం జరిగిపోయింది. ఇప్పుడు డ్రోన్ సిటీ వస్తే మాత్రం సరికొత్త రికార్డే.