Mahanadu: తెలుగుదేశం పార్టీ( Telugu Desam) పండుగకు సిద్ధపడుతోంది. అదే మహానాడు పండుగ. అయితే ఈసారి రాయలసీమలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు. పార్టీ పొలిట్ బ్యూరో సమావేశంలో నిర్ణయించారు. కడప జిల్లాలో నిర్వహించేందుకు డిసైడ్ అయ్యారు. మహానాడు కార్యక్రమం అనంతరం కేంద్ర, రాష్ట్రస్థాయి కమిటీలను ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఈ ఏడాది మహానాడు మే 27, 28, 29 తేదీల్లో నిర్వహించాలని నిర్ణయించారు. రాష్ట్ర విభజన తర్వాత రాయలసీమలో ఇంతవరకు మహానాడు జరగలేదు. అందుకే కడపలో నిర్వహించాలని నిర్ణయించారు. మూడు రోజులపాటు అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని భావిస్తున్నారు. కడప జిల్లా అంటే వైయస్సార్.. వైయస్సార్ అంటే కడప జిల్లా అన్నట్టు పరిస్థితి ఉండేది. దశాబ్దాలుగా ఆ కుటుంబం కడప జిల్లాలో ఆధిపత్యం కనబరిచేది. కానీ ఈసారి సీన్ మారింది. కడప జిల్లాలో టిడిపి కూటమి పట్టు బిగించింది. పది అసెంబ్లీ సీట్లకు గాను ఏడింట విజయం సాధించింది. అందుకే ఇదే పట్టు కొనసాగించాలంటే పార్టీ కార్యక్రమాలు పెరగాలని చంద్రబాబు భావిస్తున్నారు. అందులో భాగంగానే కడపలో మహానాడు నిర్వహించాలని నిర్ణయించారు.
* కీలక నిర్ణయాలు దిశగా మహానాడు( mahanadu) వేదికగా కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. ప్రతి 60 కుటుంబాలకు టిడిపి తరఫున ఒక సాధికార సారధిని నియమించాలని ఎప్పటినుంచో అనుకున్న సంగతి తెలిసిందే. ఫిబ్రవరి 6న కుటుంబ సాధికార సారథులు, యూత్, క్లస్టర్, యూనిట్ ఇన్చార్జిల నియామక ప్రక్రియ ప్రారంభించాలని నిర్ణయం తీసుకున్నారు. కడపలో నిర్వహించబోయే మహానాడు నాటికి బూత్, క్లస్టర్, యూనిట్, గ్రామ, మండల కమిటీలు, మున్సిపాలిటీలో వార్డు కమిటీలు, శాసనసభ, లోక్ సభ నియోజకవర్గ కమిటీలు, అధ్యక్షుల నియామకం పూర్తి చేయాలని నిర్ణయించారు.
* అందరూ సభ్యులుగా ఉండాల్సిందే
కిందిస్థాయి కార్యకర్త నుంచి జాతీయ అధ్యక్షుడు వరకు ఈ కమిటీల్లో సభ్యులుగా ఉండాల్సిందే. వీటిలో ఉన్న వారికి మాత్రమే నామినేటెడ్ పదవులు ఇవ్వనున్నారు. పొలిట్ బ్యూరో, రాష్ట్ర కమిటీ, ఎమ్మెల్యేలతో తరచూ సమావేశం కావాలని కూడా నిర్ణయించారు. ప్రతి శనివారం నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల ఆధ్వర్యంలో వినతుల స్వీకరణ సైతం జరగాలని పార్టీ హై కమాండ్ గట్టిగానే నిర్ణయం తీసుకుంది.
* కోటికి దాటిన సభ్యత్వ నమోదు
ఇప్పటికే టిడిపి( TDP ) సభ్యత్వ నమోదు కోటికి దాటింది. పార్టీ చరిత్రలోనే ఈ సభ్యత్వ నమోదు ఈ స్థాయిలో జరగడం విశేషం. అందుకే పార్టీ పరంగా కీలక నిర్ణయాలు దిశగా నాయకత్వం అడుగులు వేస్తోంది. మరోవైపు పార్టీలో అత్యున్నత విభాగంగా ఉన్న పొలిట్ బ్యూరోలో సైతం చేర్పులు మార్పులు చేయాలని కూడా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకునేందుకు లోకేష్ సిద్ధపడ్డారు. వరుసగా మూడుసార్లు పార్టీ పదవులు తీసుకున్నవారు.. ఈసారి తప్పుకోవాలని నిర్ణయించుకున్న సంగతి తెలిసిందే. అయితే జాతీయ ప్రధాన కార్యదర్శి పదవి వదులుకోనున్న లోకేష్ త్వరలో పార్టీ వర్కింగ్ కమిటీ ప్రెసిడెంట్ గా ఎన్నుకోబడతారని తెలుస్తోంది.