Kota Vinutha sensational video: శ్రీకాళహస్తి నియోజకవర్గం లో కొద్ది నెలల క్రితం జనసేన ఇన్చార్జి కోటా వినూత డ్రైవర్ శ్రీనివాసరావు అలియాస్ రాయుడు హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ ఘటనలో కోటా వినూత, ఆమె భర్త చంద్రబాబు, ఇంకా కొంతమంది వ్యక్తులను తమిళనాడు పోలీసులు అరెస్ట్ చేశారు. ఇందులో వినూత బెయిల్ మీద బయటకు వచ్చారు. మిగతావారు మాత్రం జైల్లో ఉన్నారు.
ఈ కేసుకు సంబంధించి అప్పట్లో అనేక వ్యవహారాలు వెలుగులోకి వచ్చాయి. ఇప్పుడు ఈ కేసులో శ్రీనివాసరావు మాట్లాడిన మాటలకు సంబంధించిన ఒక వీడియో వెలుగులోకి వచ్చింది. ఆ వీడియోలో రాయుడు అనేక విషయాలను వెల్లడించాడు. వాటిని వైసిపి నేతలు విపరీతంగా ప్రచారం చేస్తున్నారు. శ్రీకాళహస్తి టిడిపి ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఈ వ్యవహారం నడిపించారని.. వినూత రాజకీయ జీవితాన్ని నాశనం చేయడానికి ఆయన సంకల్పించారని.. చివరికి ఆమె వ్యక్తిగత వీడియోలను కూడా రాయుడు ద్వారా తెప్పించుకున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ.. కొన్ని మీడియా సంస్థలు సుధీర్ రెడ్డికి వ్యతిరేకంగా కథనాలను ప్రసారం చేస్తున్నాయి. రాయుడు చనిపోయినప్పుడు వెలుగులోకి రాని సెల్ఫీ వీడియో.. ఇప్పుడు బయటికి రావడం పట్ల అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
రాయుడు సెల్ఫీ వీడియో బయటికి వచ్చిన తర్వాత ఒక్కరోజు గ్యాప్ తో వినూత వెలుగులోకి వచ్చారు. డ్రైవర్ రాయుడు హత్య కేసులో తమకు సంబంధం లేదని ఆమె స్పష్టం చేశారు. తనపై తప్పుడు ప్రచారం జరుగుతోందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. తమకు లక్షలలో వేతనాలు వస్తాయని.. అవి వదులుకొని ప్రజాసేవ చేయడానికి రాజకీయాల్లోకి వచ్చామని వినూత పేర్కొన్నారు. జరిగిన విషయంపై క్లారిటీ ఇవ్వడానికి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను కలుస్తామని వినుత వెల్లడించారు. తనపై జరిగిన కుట్రలు మొత్తం త్వరలోనే వెలుగులోకి వస్తాయని ఆమె పేర్కొన్నారు. పూర్తి ఆధారాలతో మీడియా ముందుకు వస్తామని వినూత పేర్కొన్నారు.
https://x.com/VinuthaKotaa/status/1977644245621027310?t=nbvC8bT93XinIlxm0Ih2NA&s=19
వినుత వద్ద రాయుడు చాలా రోజులుగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అయితే అతనికి డబ్బు ఆశ చూపించి సుధీర్ రెడ్డి మనుషులు బెదిరించారని వైసిపి ఆరోపిస్తోంది. ఒక మహిళ రాజకీయ జీవితాన్ని ఇబ్బంది పెట్టడానికి టిడిపి ఎమ్మెల్యే ఇంతటి దారుణానికి పాల్పడ్డాడని విమర్శిస్తోంది. మహిళల భద్రత గురించి గొప్పగా మాట్లాడే చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్ ఈ విషయంపై స్పష్టత ఇవ్వాలని.. వినూత వ్యవహారంలో దారుణంగా వ్యవహరించిన సుధీర్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. ఇంత జరుగుతున్నప్పటికీ సుధీర్ రెడ్డి నోరు విప్పలేదు.