CM Ramesh: రాజ్య సభలో లాస్ట్‌ ‘తెలుగు’ వికెట్‌.. నిలబడతాడా.. తప్పుకుంటాడా!

టీడీపీ నుంచి రాజ్యసభకు రెండుసార్లు నామినేట్‌ అయిన సీఎం రమేశ్‌కు ఈసారి బీజేపీ అవకాశం ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అవకాశం ఇస్తే.. ఆయనకు ఏపీ నుంచి ఛాన్స్‌ లేదు.

Written By: Raj Shekar, Updated On : December 28, 2023 12:10 pm

CM Ramesh

Follow us on

CM Ramesh: వచ్చే ఏడాది ఏప్రిల్‌లో రాజ్యసభలో 55 స్థానాలు ఖాళీ కాబోతున్నాయి. ఇందులో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ.నడ్డాతోపాటు పలువురు కేంద్ర మంత్రులు, ప్రాంతీయ పార్టీల నుంచి ఎన్నికైన ఎంపీలు ఉన్నారు. ఈ జాబితాలో టీడీపీ నుంచి రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌ ఒకరు. రెండు సార్లు టీడీపీ తరఫున రాజ్యసభకు ఎన్నికైన సీఎం రమేశ్‌.. 2019లో టీడీపీ ఓటమి తర్వాత బీజేపీ గూటికి చేరారు. ఆయనతోపాటు టీజీ వెంకటేశ్‌ గరికపాటి, నామానాగేశ్వర్‌రావు కూడా బీజేపీలో చేరారు. బీజేపీలో చేరిన ఈ నలుగురు ఎంపీలు ఎన్నడూ బీజేపీ తరఫున పనిచేసిన దాఖలాలు లేవు. బీజేపీలో ఉంటూ.. టీడీపీ కోసమే పనిచేస్తున్నారు. ఇప్పటికే నామా నాగేశ్వర్‌రావు, టీజీ వెంకటేశ్‌ పదవీ కాలం ముగిసింది. తెలంగాణకు చెందిన గరికపాటి, ఏపీకి చెందిన సీఎం రమేశ్‌ ప్రసుత్తం సభ్యులుగా ఉన్నారు. సీఎం రమేశ్‌ పదవి ఏప్రిల్‌లో ముగియనుంది.

మళ్లీ ఛాన్స్‌ వస్తుందా..
టీడీపీ నుంచి రాజ్యసభకు రెండుసార్లు నామినేట్‌ అయిన సీఎం రమేశ్‌కు ఈసారి బీజేపీ అవకాశం ఇస్తుందా అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. బీజేపీ అవకాశం ఇస్తే.. ఆయనకు ఏపీ నుంచి ఛాన్స్‌ లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఇవ్వాలి. కానీ, ఎన్నడూ బీజేపీ కోసం పనిచేయని ఆయనకు బీజేపీ సహకరించే అవకాశం లేదు. ఇక ఆయన మళ్లీ రాజ్యసభకు వెళ్లాలనుకుంటే తిరిగి సొంత పార్టీ టీడీపీలో చేరాల్సి ఉంటుంది. అలా చేరినా ఆయనకు సరిపడా ఎమ్మెల్యేలు టీడీపీకి లేరు. ఈ క్రమంలో వైసీపీలోని మరో 60 మంది ఎమ్మెల్యేలకు డబ్బులు ఎరవేసి వారి సహకారం పొందాల్సి ఉంటుంది. దీనికి కూడా బీజేపీ మద్దతు తప్పనిసరి. ఎందుకంటే వైసీపీ మొదటి నుంచి బీజేపీకి మద్దతుగా ఉంటుంది. ఇలాంటి సమయంలో బీజేపీని కాదని వైసీపీ ఎమ్మెల్యేలు సీఎం రమేశ్‌కు మద్దతు ఇచ్చే అవకాశమే ఉండదు.

డబ్బులు ఉన్నా.. పదవి కష్టమే..
రాజ్యసభకు మరోసారి ఎన్నికయ్యేందుకు ఎంత డబ్బు అయినా పెట్టే స్థోమత సీఎం రమేశ్‌కు ఉంది. కానీ, పదవి మాత్రం దక్కే అవకాశాలు ఏరకంగానూ కనిపించడం లేదు. ఇలాంటి పరిస్థితిలో సీఎం రమేశ్‌ ఏం చేస్తారు.. ఎటువైపు మొగ్గుచూపుతారు అన్న సందేహాలు వ్యక్తమవుతున్నాయి. మళ్లీ అవకాశం రాకుంటే మాత్రం టీడీపీ చివరి రాజ్యసభ ఎంపీ పదవీ కాలం పూర్తయినట్లే.