AP Liquor Policy 2024: ఏపీలో మద్యం షాపుల కేటాయింపు ప్రక్రియ ముగిసింది. రాష్ట్రవ్యాప్తంగా 3395 మద్యం దుకాణాలను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం నోటిఫై చేసింది. ఈ మేరకు దరఖాస్తులను ఆహ్వానించింది.ఈ మేరకు ఈనెల 11 వరకు దరఖాస్తుల ప్రక్రియ కొనసాగింది. రాష్ట్ర వ్యాప్తంగా 89, 882 దరఖాస్తులు అందాయి. నాన్ రిఫండబుల్ రుసుము రూపంలో 1797 కోట్ల రూపాయల ఆదాయం సమకూరింది. సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా లాటరీ ప్రక్రియ కొనసాగింది. లాటరీలో చాలామంది షాపులు దక్కించుకున్నారు. అందులో మహిళలు ఉండడం విశేషం.మొత్తం 3396 మద్యం షాపులకు గాను..10 శాతం షాపులను మహిళలకు కేటాయించారు. రాష్ట్రవ్యాప్తంగా 345 షాపులు మహిళల పేరిట వచ్చాయి. మహిళలకు దక్కిన షాపులను జిల్లాల వారీగా చూస్తే.. అత్యధికంగా విశాఖలో 31 మద్యం షాపులను మహిళలు దక్కించుకున్నారు. అత్యల్పంగా బాపట్ల జిల్లాలో ఒక మహిళకు వైన్ షాప్ లైసెన్స్ దక్కింది. అనకాపల్లిలో 25 షాపులు,శ్రీకాకుళం,విజయనగరం, నెల్లూరు జిల్లాలో 24 చొప్పున షాపులు మహిళలకు దక్కాయి.
* మహిళల పేరిట బంధువులు
మహిళల తరఫున బంధువులు దరఖాస్తులు చేసుకున్నారు. శ్రీకాకుళంలో ఓ వైద్యుని భార్య పేరిట భారీగా షాపులు వచ్చినట్లు తెలుస్తోంది.మహిళలకు పది శాతం షాపులు కేటాయించడంతో.. కొందరు వ్యాపారులు తమ సమీప బంధువులు, కుటుంబ సభ్యులతో దరఖాస్తు చేయించారు.లాటరీ తీసే హాల్ వద్ద మహిళల సందడి కనిపించింది. విశాఖలో అయితే ఏకంగా 31 మంది మహిళలకు షాపులు దక్కడం విశేషం. కొందరైతే తమ బంధువులకు ఆ షాపుల నిర్వహణ బాధ్యత అప్పజెబుదామని చెబుతున్నారు. కాగా లైసెన్స్ దక్కించుకున్న వారు 24 గంటల్లోగా ప్రభుత్వానికి నగదు చెల్లించాల్సి ఉంటుంది.
* రేపు దుకాణాలు ప్రారంభం
రేపు రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేటు మద్యం దుకాణాలు తెరవనున్నారు. లైసెన్సులు దక్కించుకున్న వారు ఇప్పటికే షాపుల ఏర్పాటుకు అన్ని రకాల ప్రయత్నాలు మొదలుపెట్టారు. కొందరు ముందుగానే షాపులను మాట్లాడుతున్నారు. జన రద్దీ అధికంగా ఉండే ప్రాంతాల్లో షాపులు పెట్టేందుకు నిర్ణయం తీసుకున్నారు. మరోవైపు అన్ని రకాల ప్రీమియం బ్రాండ్లు అందుబాటులోకి రానుండడంతో మందుబాబులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.