SC Corporation Funds: కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసిన వైసీపీ ప్రభుత్వం అట్టహాసంగా చైర్మన్లను ప్రకటించింది. వాటికి నిధులు కేటాయింపులు చేస్తున్నట్లు లెక్కల్లో చూపి, చేతికి మాత్రం ఇవ్వడం లేదు. దాంతో ఆయా కార్పొరేషన్ల చైర్మన్లు, డైరెక్టర్లు ఏ పని చేయలేని పరిస్థితి. కేవలం ఉత్సవ విగ్రహాల్లా మారిపోయారు. ఆయా వర్గాల్లోని పార్టీ విధేయులకు పునరావసం కల్పించేందుకు, అన్ని కులాలను ఉద్ధరిస్తున్నట్లు చేసిన ప్రకటనల్నీ రాజకీయ లబ్ధి కోసమేనని తేలిపోయింది. వివిధ కార్పొరేషన్లకు కేటాయించినట్లు చెబుతున్న నిధులన్నీ ఏమవుతున్నాయన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
గత టీడీపీ ప్రభుత్వంలో బీసీ, ఎస్సీ, ఎస్టీ కార్పొరేషన్ల ద్వారా లబ్ధిదారులకు అందజేస్తున్న లబ్ధిని ప్రభుత్వ అధికార వెబ్ సైట్లలో కూడా దర్శనమిచ్చేది. అంతకంటే మెండుగా కులాలను అభ్యున్నతిలోకి తీసుకువస్తామని చెప్పిన జగన్ 56 కార్పొరేషన్లను ప్రకటించింది. ఇందులోనే కాపు కార్పొరేషన్ ను చేర్చింది. ఎస్సీలను మాల, మాదిగ అంటూ విడదీసి కార్పొరేషన్ ఏర్పాటు చేసింది. వీటన్నింటికి చైర్మన్లు, డైరెక్టర్లను ఎంపిక చేసి ప్రకటించింది. ఈ కార్పొరేషన్లన్నీ ఆయా కులాల సామాజిక, ఆర్థిక పరిపుష్టి కోసం స్వయం ఉపాధి కల్పన, నైపుణ్యాన్ని పెంచడానికి శిక్షణా కార్యక్రమాలు, ఆర్థిక అవసరాలకు సంబంధించిన ఇతర కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. అయితే, ఇవన్నీ చేయాలంటే ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయిలో ఆర్థిక సహకారం అవసరం. ఒక్క పైసా ఆయా కార్పొరేషన్లకు కేటాయించిన దాఖలాలు కానరావడం లేదు.

నవరత్నాలపైనే దృష్టి పెట్టిన వైసీపీ ప్రభుత్వం నిధుల కోసం ఆది నుంచి అష్టకష్టాలు పడుతుంది. సంక్షేమ పథకాలకు నిధుల కోసం అనుకూలమైన అన్ని మార్గాల నుంచి అప్పులను తీసుకువస్తుంది. ఇవి చాలవనన్నట్లు ఉద్యోగుల భవిష్య నిధి నిధులను, వివిధ కార్పొరేషన్లకు కేటాయించాల్సిన అన్ని రకాల నిధులను దారిమళ్లించేసింది. దీనిపై ఆయా వర్గాలు ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టీ పట్టనట్లు ఉంటుంది. ఈ నిధుల మళ్లింపు వ్యవహారం కోర్టు వరకు వెళ్లింది. ప్రభుత్వానికి చివాట్లు పెట్టినా తన పని మాత్రం మానడం లేదు.
కాగా, ఎస్సీ కార్పొరేషన్ నిధులు మళ్లింపుపై హైకోర్టు ఘాటుగా స్పందించింది. ఆ నిధులను నవరత్నాలకు ఎలా మళ్లిస్తారని ప్రశ్నించింది. ఎస్పీ కార్పొరేషన్ నిధుల మళ్లింపుపై పిటీషన్ విచారణ సందర్భంగా హై కోర్టు ఈ కీలక వ్యాఖ్యలు చేసింది. స్వయం ఉపాధి కోసం కేటాయించిన రూ.7వేల కోట్లలో ఏమీ ఖర్చు చేయకపోవడంపై ఆశ్చర్యం వ్యక్తం చేసింది. కార్పొరేషన్ ఉద్దేశ్యం నెరవేరనప్పుడు మూసివేయడం మేలు కదా అని వ్యాఖ్యానించింది. బిల్లుల చెల్లింపు వివరాలతో అఫిడవిట్ దాఖలు చేయాలని ఎస్పీ కార్పొరేషన్ ఎండీని సూచించింది.