Pawan Kalyan : దేశంలో ఇప్పుడు సెలబ్రిటీ నియోజకవర్గాల్లో పిఠాపురం ఒకటి. దేశవ్యాప్తంగా సార్వత్రిక ఎన్నికలతో పాటు ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కూడా జరుగుతున్నాయి. దేశవ్యాప్తంగా హేమాహేమీలు పోటీ చేస్తున్నారు. అందులో పవన్ కళ్యాణ్ ఒకరు. పొత్తులో భాగంగా ఆయన పిఠాపురం అసెంబ్లీ స్థానం నుంచి కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. గత ఎన్నికల్లో రెండు చోట్ల పవన్ ఓడిపోయారు. ఈసారి కూడా పవన్ ను ఓడించేందుకు వైసిపి గట్టి ప్రయత్నాలు చేస్తోంది.ఎట్టి పరిస్థితుల్లో పవన్ అసెంబ్లీలో అడుగుపెట్టకూడదన్న కృత నిశ్చయంతో ఉంది. అదే సమయంలో రాష్ట్రంలోనే అత్యధిక మెజారిటీతో పవన్ గెలుపొందాలన్న లక్ష్యంతో జన సైనికులు పనిచేస్తున్నారు. దీంతో పిఠాపురం రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
జనసేన ప్రచారంలో దూసుకుపోతోంది. సినీ సెలబ్రిటీలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా జన సైనికులు పిఠాపురం వచ్చి పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు. అయితే ఇదే సమయంలో జనసేన నేతలు కొత్త వాదనను తెరపైకి తెచ్చారు. పవన్ కళ్యాణ్ ను ఓడించేందుకు వైసిపి భారీ ప్లాన్ చేసిందన్నది ఈ ఆరోపణ. నియోజకవర్గంలోని ఇంటింటికి పదివేల రూపాయల చొప్పున పంచుతున్నట్లు జనసేన నేతలు అనుమానిస్తున్నారు. జనసేన అభిమానుల ఇళ్లను మినహాయించి.. మిగతా ఇళ్లలో పదివేలు చొప్పున పంచే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపడుతున్నట్లు జనసైనికులు ఆరోపిస్తున్నారు. అయితే ఈ వాదనలో వ్యూహం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఇప్పటికే సోషల్ మీడియాతో పాటు డిజిటల్ మీడియా యాక్టివ్ గా ఉంది. ఎక్కడైనా డబ్బులు పంచి పెడితే ఈపాటికే తెలిసి ఉండేది అన్న వాదన వినిపిస్తోంది. అయితే ఇదంతా పవన్ పై సానుభూతి పెంచేందుకు వ్యూహం అని వైసీపీ శ్రేణులు కొట్టి పారేస్తున్నాయి.
గత ఎన్నికల్లో జనసేన ను వైసిపి వ్యూహాత్మకంగా దెబ్బతీసింది. సైలెంట్ గా ఉంటూ రెండు చోట్ల ఓడించింది. అందుకే ఇప్పుడు ఏ చిన్న అవకాశాన్ని అధికార పార్టీకి విడిచి పెట్టేందుకు జనసేన సాహసించడం లేదు. పదివేలు చొప్పున పంచుతున్నారన్న మాటతో పవన్ కు పాజిటివ్ ఓటింగ్ పెంచేందుకు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇది ఎంతవరకు వర్క్ అవుతుందో చూడాలి. ఇప్పటికే కాపు ఉద్యమ నేతల ద్వారా దెబ్బతీయాలని చూశారు. ముద్రగడ పద్మనాభం ను రంగంలోకి దించారు. అయితే ఆయన వ్యాఖ్యలకు కౌంటర్ ఇస్తూ ఆయన కుమార్తె.. పవన్ కళ్యాణ్ కు అనూహ్యంగా మద్దతు ప్రకటించారు. అయితే ఇప్పటికే పిఠాపురంలో వార్ వన్ సైడేనన్న టాక్ ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో జనసేన వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే వైసిపి భారీ తాయిలాలు ఇస్తోందని ప్రచారం చేస్తున్నట్లు సమాచారం. మొత్తానికి అయితే జనసేన ఒక వ్యూహం ప్రకారం వైసీపీ ని అష్టదిగ్బంధం చేస్తున్నట్టు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.