Kapu Community : ఏపీ ఎన్నికల్లో సామాజిక వర్గాల ప్రభావం అధికంగా ఉంటుంది. ఎన్నికలు వచ్చిన ప్రతిసారి సామాజిక అంశమే హైలెట్ అవుతోంది.మెజారిటీ సామాజిక వర్గంగా ఉన్న కాపు ఓటు బ్యాంక్ ఎటువైపు మొగ్గుచూపితే.. ఆ పార్టీయే అధికారంలోకి వస్తోంది. 2014 ఎన్నికల్లో టిడిపి వైపు కాపులు మొగ్గు చూపారు. 2019 ఎన్నికలకు వచ్చేసరికి సీన్ మారింది. జనసేన ఉన్నా.. ప్రత్యేక పరిస్థితుల్లో వైసీపీకి మద్దతు తెలిపారు. ఈ ఎన్నికల్లో మాత్రం క్రియాశీలక పాత్ర పోషించేందుకు సిద్ధమయ్యారు.
2014 ఎన్నికల్లో టిడిపి,బిజెపి కలిసి పోటీ చేశాయి.జనసేన బయట నుంచి మద్దతు ప్రకటించింది. పవన్ ఇచ్చిన పిలుపునకు కాపులు స్పందించారు. తెలుగుదేశం పార్టీకి ఏకపక్షంగా మద్దతు తెలిపారు. రాయలసీమలో టిడిపి వెనుకబడినా.. మిగతా ప్రాంతాల్లో గెలుపునకు మాత్రం కాపు ఓటు బ్యాంకు కారణమన్న విశ్లేషణలు ఉన్నాయి. అయితే టిడిపి అధికారంలోకి వచ్చిన తరువాత కాపులను పట్టించుకోలేదు. కాపులకు ఇస్తామన్న రిజర్వేషన్ల విషయంలో సైతం జాప్యం జరిగింది. దీంతో కాపు ఉద్యమం పతాక స్థాయికి చేరింది. కాపుల్లో ఒకరకమైన ఆగ్రహానికి కారణం అయ్యింది. 2014 ఎన్నికల్లో పవన్ సూచన మేరకు మద్దతు తెలిపిన కాపులు.. 2019 ఎన్నికలకు వచ్చేసరికి మనసు మార్చుకున్నారు. వైసీపీ వైపు టర్న్ అయ్యారు.
అయితే గత ఐదు సంవత్సరాలుగా కాపుల విషయంలో జరిగిన పరిణామాలతో వారు కలత చెందారు. అందుకే ఈ ఎన్నికల్లో కాపులు ఎటువైపు వెళ్తారు అన్నది చర్చగా మారింది. అయితే కొద్దిరోజుల కిందట వరకు తటస్థంగా ఉన్న కాపులు.. ఇటీవల కాలంలో జనసేన వైపు మొగ్గు చూపుతున్నారు. కూటమికి సైతం మద్దతు ఇస్తున్నట్లు తెలుస్తోంది. పవన్ బలంగా నిలబడడం, వైసిపి పై పోరాటం చేస్తుండడంతో స్ట్రాంగ్ నిర్ణయానికి వచ్చారు. అటు చిరంజీవి కుటుంబం అంతా ప్రచారంలోకి వస్తుండడంకు జనసేనతో పాటు కూటమి వైపు వెళ్తున్నారు. కూటమి ఏర్పాటులో పవన్ యాక్టివ్ రోల్ పోషించడం.. సీట్లు తక్కువ తీసుకున్నందుకు గల కారణాలను చెప్పడం, కూటమి ఎందుకు అధికారంలోకి రావాలో వివరించడం వంటివి కలిసి వస్తున్నాయి. కూటమిలోనే కాకుండా టిడిపిలో కూడా పవన్ కు అత్యంత ప్రాధాన్యత దక్కుతోంది. నిన్న మొన్నటి వరకు చంద్రబాబు తర్వాత లోకేష్ అన్నట్టు వ్యవహారం నడిచేది. కానీ ఒక పద్ధతి ప్రకారం లోకేష్ ను పక్కకు తప్పించారు. పవన్ కు ప్రాధాన్యత పెంచారు. దీనిపై కాపులు సంతృప్తితో ఉన్నారు. అందుకే కూటమి వైపు టర్న్ అయినట్లు తెలుస్తోంది.