Chandrababu : చంద్రబాబుపై టిడిపి క్యాడర్ అసంతృప్తిగా ఉందా? అనుకున్న స్థాయిలో అధినేత పనిచేయలేకపోతున్నారా? శ్రేణుల అంచనాలు అందుకోలేకపోతున్నారా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. కానీ విజయం సాధించామన్న జోష్ టిడిపి శ్రేణుల్లో సన్నగిల్లుతోంది.వారు అనుకున్నట్టుగా ప్రభుత్వం వ్యవహరించకపోవడంతో ఓ రకమైన అసంతృప్తి కనిపిస్తోంది. పథకాల అమలుతో పాటు అరాచకాలకు పాల్పడిన వైసీపీ శ్రేణుల విషయంలో అధినేత చంద్రబాబు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారన్న కోపంతో కేడర్ ఉంది. గత ఐదేళ్లుగా వైసిపి పెట్టిన ఇబ్బందులు, కేసులను ఎదురొడ్డి టిడిపి శ్రేణులు నిలబడ్డాయి. పెద్ద యుద్ధమే చేశాయి. 2019 ఎన్నికల్లో వైసీపీ అధికారంలోకి వచ్చినప్పుడు.. తొలి రోజు నుంచే టిడిపి శ్రేణులపై ఎదురుదాడి ప్రారంభమైంది. ముప్పేట కేసులు, ప్రశ్నిస్తే దాడులు.. ఇలా ఒకటేమిటి చాలా విధాలుగా వేధింపులకు గురయ్యాయి టిడిపి శ్రేణులు. కానీ ఇప్పుడు టిడిపి కూటమి అధికారంలోకి వచ్చి 50 రోజులు దాటుతోంది. వైసిపి రేంజ్ లో రివేంజ్ రాజకీయాలు చేయలేకపోతున్నాం అన్న బాధ టిడిపి శ్రేణుల్లో వ్యక్తం అవుతోంది. సోషల్ మీడియా వేదికగా టిడిపి శ్రేణులు తమ బాధను వ్యక్తం చేస్తున్నాయి. అధినాయకత్వం తీరును తప్పుపడుతున్నాయి.ముఖ్యంగా వైసీపీకి కొమ్ము కాసిన అధికారులను చూసి చూడనట్లుగా వదిలేయడంతో పాటు వారిపై ఎటువంటి చర్యలు లేకపోతున్నాయి. గత ఐదేళ్లుగా అధికారులతో పాటు సిబ్బంది కనీసం తమను మనుషులుగా కూడా చూడలేదని టిడిపి శ్రేణులు చెబుతున్నాయి. కూటమి ప్రభుత్వం రావడంతో వారిపై బదిలీ వేటు తప్పదని భావించాయి. కానీ ఇప్పటివరకు తమకు నచ్చిన ఉద్యోగులను రప్పించుకోవడంతో పాటు నచ్చని వారిని బయటకు పంపేందుకు కూడా వీలు లేకుండా పోయిందని తెగ బాధపడుతున్నారు.
* వేలాది కేసులు
టిడిపి గ్రామస్థాయి నాయకుడు నుంచి అధినేత చంద్రబాబు వరకు వరుస కేసులతో వేధించింది వైసీపీ సర్కార్. గత ఐదేళ్లుగా వర్గ శత్రువులుగా చూశారు. సిఐడి విభాగాన్ని, ప్రత్యేకంగా కూలి రఘురామిరెడ్డి అనే ఐపీఎస్ అధికారికి ఫుల్ పవర్స్ ఇచ్చారు. చంద్రబాబు నుంచి కిందిస్థాయి సోషల్ మీడియా కార్యకర్త వరకు వెంటాడారు. వేటాడి అరెస్టులు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపుగా 3000 కేసులను నమోదు చేశారు. అందుకే టిడిపి క్యాడర్ చావో రేవో అన్నట్టు పోరాటం చేసింది. కసితో పనిచేసి అధికారంలోకి వచ్చేందుకు దోహద పడింది.
* పొడి పొడి చర్యలకే పరిమితం
టిడిపి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పొడిపొడి చర్యలకే పరిమితం అయ్యారు. పక్కదారి పట్టిన, వైసిపి పెద్దల అడుగులకు మడుగులొత్తిన అధికారులను పక్కన పెట్టారు. బదిలీ వేటు వేశారు. అంతకుమించి చర్యలు లేకపోవడంపై టిడిపి క్యాడర్లో మాత్రం అసంతృప్తి స్పష్టంగా కనిపిస్తోంది. ముఖ్యంగా టిడిపి తో పాటు నేతల కుటుంబాలపై అసభ్యకరమైన మాటలతో విరుచుకుపడిన వైసీపీ సోషల్ మీడియా కార్యకర్తలు గతం మాదిరిగా రెచ్చిపోతున్నారు. వారిలో కొంచెం కూడా భయం కనిపించడం లేదు. ఒక ఎమ్మెల్యే అభ్యర్థిపై హత్యాయత్నానికి పాల్పడిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డికి నోటీసులు ఇచ్చి విడిచి పెట్టేశారు. ఇటువంటి పరిణామాలు టిడిపి శ్రేణులకు నిరుత్సాహానికి గురిచేస్తున్నాయి.
* లోకేష్ ది అదే తీరు
చంద్రబాబు వదిలినా లోకేష్ విడిచిపెట్టరని టిడిపి శ్రేణులు ధైర్యంగా చెప్పుకునేవి. లోకేష్ సైతం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు రెడ్ బుక్ రాసుకున్నట్లు చెప్పుకొచ్చారు. తప్పు చేసిన వైసీపీ నేతలు, సహకరించిన అధికారుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకున్నట్లు అప్పట్లో ప్రకటించారు. ఇటీవల అధికారంలోకి వచ్చిన తర్వాత ఇంతవరకు రెడ్ బుక్ తెరవలేదని అదే లోకేష్ ప్రకటించారు. దీంతో ఆయనపై సైతం నమ్మకం లేకుండా పోతుంది. అయితే చంద్రబాబు ఇప్పటికే రంగంలోకి దిగారని.. కీలక నేతల చుట్టూ ఉచ్చు బిగించి.. తరువాత కిందిస్థాయి క్యాడర్ విషయానికి వస్తారని ప్రచారం జరుగుతోంది. జనవరి నాటికి వైసిపి కీలక నేతలపై ప్రతాపం చూపుతారని ఒక టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా టిడిపి క్యాడర్లో మాత్రం అసంతృప్తి నివురు గప్పిన నిప్పులా ఉంది.
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Read MoreWeb Title: Dissatisfaction against chandrababu in tdp
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com