https://oktelugu.com/

YCP MLAs: విదేశాలకు వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలు.. అసలు కారణం ఇదే

మరోవైపు ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ఎదుర్కోవడానికి వైసిపి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ వై వి సుబ్బారెడ్డి, మేడా మల్లికార్జున్ రెడ్డి, గొల్ల బాబురావు లను అభ్యర్థులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

Written By:
  • Dharma
  • , Updated On : February 11, 2024 10:41 am
    YCP MLAs

    YCP MLAs

    Follow us on

    YCP MLAs: రాజ్యసభ ఎన్నికల్లో టిడిపి పోటీ చేస్తుందా? లేదా? పోటీ చేస్తే పోలింగ్ అనివార్యంగా మారుతుంది. అయితే సార్వత్రిక ఎన్నికల హడావిడిలో ఉన్న టిడిపి రాజ్యసభ ఎన్నికల్లో పోటీపై పునరాలోచనలో పడింది. బిజెపితో పొత్తు, జనసేనతో సీట్ల సర్దుబాటు, మరోవైపు ఎన్నికల ప్రచార సభల్లో బిజీగా ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో రాజ్యసభ ఎన్నికలు రావడంతో ఆలోచనలో పడింది. బలం లేకుండా బరిలో దిగితే ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు వెళతాయని చంద్రబాబు భయపడుతున్నారు. మరోవైపు బిజెపితో పొత్తుల ప్రతిపాదన ఒక కొలిక్కి రాలేదు. టిడిపి, జనసేన, బిజెపి ఉమ్మడి అభ్యర్థి అయితే బాగుంటుందని చంద్రబాబు ఒక ఆలోచనకు వచ్చారు. కానీ పొత్తు ప్రక్రియ పూర్తిస్థాయిలో కుదరడానికి కొద్ది సమయం పట్టనుండడంతో చంద్రబాబు వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది.

    మరోవైపు ఎటువంటి సంక్లిష్ట పరిస్థితులు ఎదురైనా.. ఎదుర్కోవడానికి వైసిపి అన్ని రకాల ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే ఆ పార్టీ వై వి సుబ్బారెడ్డి, మేడా మల్లికార్జున్ రెడ్డి, గొల్ల బాబురావు లను అభ్యర్థులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. శాసనసభ సమావేశాల్లో ఆ ముగ్గురిని ఎమ్మెల్యేలకు వైసిపి నాయకులు పరిచయం చేశారు. అయితే గత అనుభవాల దృష్ట్యా వైసిపి కొన్ని విధాలుగా భయపడుతోంది. తెలుగుదేశం పార్టీ పోటీ చేస్తే.. క్రాస్ ఓటింగ్ తప్పదని ఆందోళన చెందుతోంది. అందుకే ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటుంది. టిడిపిలోకి ఫిరాయించిన నలుగురు వైసీపీ ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయించేందుకు కసరత్తు చేస్తోంది. ఇప్పటికే టిడిపి ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు రాజీనామాను స్పీకర్ తమ్మినేని ఆమోదించారు. మరోవైపు అసంతృప్త ఎమ్మెల్యేలను సీఎం జగన్ సముదాయించినట్లు వార్తలు వచ్చాయి. మంత్రి గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి లాంటి ఎమ్మెల్యేలను జగన్ ఒప్పించే ప్రయత్నాలు చేసినా వారు వినలేదని తెలుస్తోంది. దీంతో వైవి సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి సోదరుడు, ఎమ్మెల్యే మేడా మల్లికార్జున రెడ్డి రంగంలోకి దిగినట్లు తెలుస్తోంది. అసంతృప్త ఎమ్మెల్యేలతో చర్చలు జరుపుతున్నట్లు సమాచారం.

    తెలుగుదేశం పార్టీ అభ్యర్థిని ప్రకటించిన మరుక్షణం ఎమ్మెల్యేలను సంతృప్త పరిచేందుకు వైసీపీ రాజ్యసభ అభ్యర్థులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. అవసరమైతే విదేశీ పర్యటనకు తీసుకెళ్లి.. పోలింగ్ సమయానికి వెనక్కి తీసుకొచ్చేలా ఏర్పాట్లు చేస్తున్నారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. సింగపూర్, థాయిలాండ్ వంటి దేశాలకు అసంతృప్త ఎమ్మెల్యేలను తరలించడానికి లో లోపల ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. అయితే తెలుగుదేశం పార్టీ కానీ అభ్యర్థిని ప్రకటిస్తేనే అసంతృప్త ఎమ్మెల్యేలతో బేరసారాలకు దిగాలని చూస్తున్నట్లు తెలుస్తోంది. ఒకవేళ టిడిపి అభ్యర్థిని ప్రకటించకపోతే అసంతృప్త ఎమ్మెల్యేలను పక్కన పెట్టినట్టే. మొత్తానికైతే రాజ్యసభ ఎన్నికల పుణ్యమా అని.. అసంతృప్త ఎమ్మెల్యేలకు ఒకరోజు రానే వచ్చింది. వారి ప్రాధాన్యతను తెలియజెప్పింది.