YCP: 2024.. ఈ ఏడాది వైసీపీ అధినేత జగన్ కు గుర్తుండిపోతుంది. వైసీపీకి డిజాస్టర్ ఫలితాలు ఇచ్చిన ఏడాది ఇది. 2009లో కడప ఎంపీగా రాజకీయ అరంగేట్రం చేశారు జగన్. కడప ఎంపీగా పోటీ చేసి గెలిచారు. ఆ ఏడాది తండ్రి అకాల మరణం చెందడంతో సీఎం పదవి ఆశించారు.కాంగ్రెస్ హై కమాండ్ ఇవ్వకపోవడంతో పార్టీ నుంచి బయటకు వచ్చారు. వైసీపీని ఏర్పాటు చేశారు. 2012 ఉప ఎన్నికల్లో పార్టీని గెలిపించుకున్నారు. 2014 ఎన్నికల్లో 67 స్థానాలు, 2019లో 151 స్థానాలు గెలుపొందారు. 2024 ఎన్నికల్లో మాత్రం 11 స్థానాలకు పరిమితం అయ్యారు. అంటే 2009 నుంచి 2023 వరకు జగన్ జగన్ జైత్రయాత్రను కొనసాగించారు. 2024 లో మాత్రం దీనికి పడింది. అందుకే 2025 నుంచి గేమ్ చేంజర్ కావాలని భావిస్తున్నారు. అందుకే సంక్రాంతి తర్వాత ప్రజల్లోకి వెళ్లాలని స్ట్రాంగ్ గా డిసైడ్ అయ్యారు.
* పార్టీ ఆవిర్భావమే సంచలనం
వైసిపి ఆవిర్భావమే ఒక సంచలనం. ఎన్నో సవాళ్లను ఎదుర్కొని పార్టీని నడుపుతూ వచ్చారు జగన్. 2014లో దాదాపు అధికారం ఖాయం అనుకుంటున్న తరుణంలో ప్రతిపక్షానికి పరిమితం అయ్యారు. అయినా సరే 67 సీట్లతో గౌరవప్రదమైన స్థానాలను సాధించారు. కానీ 2014 నుంచి 2019 మధ్య జగన్ పోరాటం వర్ణించలేనిది. ప్రజల మధ్యకు వెళ్లి ప్రజా సమస్యలు గుర్తించి గట్టిగానే తన వాయిస్ వినిపించారు. పార్టీ శ్రేణుల్లో ఒక రకమైన నినాదం తెచ్చారు. అటు ప్రజలు, ఇటు పార్టీ శ్రేణుల మనసును గెలుచుకోవడంతో.. 175 సీట్లకు 151 సీట్లతో అద్భుత విజయాన్ని సొంతం చేసుకున్నారు. 50 శాతం పైగా ఓట్లు సాధించి అధికారంలోకి వచ్చారు. క్యాడర్ కూడా అలుపెరగకుండా కృషి చేయడంతో అధికారంలోకి రాగలిగారు. ఊహించని విజయాన్ని దక్కించుకున్నారు.
* ప్రమాదంలో వైసిపి
ఇప్పుడు సీన్ కట్ చేస్తే 2024 ఎన్నికల్లో అదే స్థాయిలో ఓటమి కూడా ఎదురయ్యింది. కేవలం 11 స్థానాలకు పరిమితం అయింది. వైసిపి అత్యంత ప్రమాదంలో పడింది. జగన్ ఐదేళ్ల పాలనలో తీసుకువచ్చిన వాలంటరీ సిస్టంతో క్యాడర్ కు, నేతలకు పెద్దగా పని లేకుండా పోయింది. ఈ ఓటమి జగన్కు ఎన్నో గుణపాఠాలు నేర్పింది. ముఖ్యంగా పార్టీ శ్రేణులు తనకు దూరమయ్యారన్న నిజాన్ని తెలుసుకున్నారు జగన్. అందుకే వారిని మళ్లీ దగ్గర చేర్చుకునేందుకు ప్రజాక్షేత్రంలో అడుగు పెట్టాలని డిసైడ్ అయ్యారు. అయితే వైసీపీని నేతలు వీడడం కొత్త కాదు. 2014లో అధికారంలోకి వచ్చిన టిడిపి ఏకంగా 23 మంది వైసీపీ ఎమ్మెల్యేలను ఆకర్షించింది. కానీ వైసీపీ బలం చెక్కుచెదరలేదు. ఇప్పుడు కూడా పార్టీని విడిచి చాలామంది నేతలు బయటకు వెళ్తున్నారు. కానీ పార్టీ శ్రేణులు మాత్రం స్తబ్దుగా ఉన్నాయి. వారిలో ఆత్మస్థైర్యాన్ని నింపేందుకు జగన్ ప్రయత్నాలు మొదలుపెట్టారు. గ్రౌండ్ లెవెల్ లో పార్టీని మరింత బలోపేతం చేయడం పై ఫోకస్ పెట్టారు. వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన వరుసగా సమీక్షలు నిర్వహిస్తున్నారు. పనిలో పనిగా ఓటమితో తీవ్ర నైరాస్యంలో ఉన్న పార్టీ శ్రేణులకు ధైర్యం నూర్ పోసే ప్రయత్నం చేస్తున్నారు.
* జిల్లాల పర్యటన
సంక్రాంతి తర్వాత జిల్లాల పర్యటన మొదలుపెట్టనున్నారు జగన్. ప్రతి జిల్లాలో రెండు రోజులపాటు ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రతి కార్యకర్తలతో మాట్లాడతానని.. ఈసారి క్యాడర్ తో గ్యాప్ లేకుండా చూసేందుకు ప్రయత్నిస్తానని జగన్ చెబుతున్నట్లు తెలుస్తోంది. గతంలో పాదయాత్ర శిబిరాల్లో కూడా ముఖ్య నేతలకు మాత్రమే జగన్ కలిసేవారు. ఈసారి అటువంటి పరిస్థితి ఉండదని.. కార్యకర్తలందరికీ టాప్ ప్రయారిటీ ఇచ్చేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నట్టు తెలుస్తోంది. జగన్ తిరిగి జనంలోకి వస్తే క్యాడర్లో కూడా ఒక ఊపు వస్తుందని పార్టీ నేతలు భావిస్తున్నారు. పనిలో పనిగా ఎక్కడైతే వైసీపీని వీడి పార్టీ నేతలు వెళ్తున్నారు అటువంటి చోట్ల ప్రత్యామ్నాయతలను సైతం ఎంపిక చేయనున్నారు. పార్టీలో ఉన్న వారితో రాజకీయం చేసి.. వచ్చే ఎన్నికల్లో కూటమికి గట్టి దెబ్బ కొట్టాలని జగన్ ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఎన్నికలు జరిగి ఏడు నెలలు దాటిన క్రమంలో ఫుల్ క్లారిటీ వచ్చింది. దానికి తగ్గట్టు కూటమి సర్కార్ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లి క్యాష్ చేసుకోవాలని భావిస్తున్నారు. జగన్ జనంలోకి వెళ్తే వైసీపీకి ప్లస్ పాయింట్ అవుతుందని విశ్లేషకులు సైతం అభిప్రాయపడుతున్నారు. అయితే జగన్ ప్రయత్నాలు ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.