Jagan: జగన్ కి మున్ముందు కష్టాలే

జగన్ అక్రమాస్తుల కేసులు తెరపైకి రానున్నాయి. ఇన్ని రోజులు హాజరు నుంచి మినహాయింపు వచ్చింది. ఇకనుంచి పరిస్థితి అలా ఉండదు. ఇప్పటికే హాజరు మినహాయింపు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది.

Written By: Dharma, Updated On : June 20, 2024 12:03 pm

Jagan

Follow us on

Jagan: ఈ ఎన్నికల్లో జగన్ అభిమన్యుడిలా ఒంటరి పోరాటం చేశారు. అందరూ కలిసికట్టుగా కొట్టిన దెబ్బకు దారుణ పరాజయం పాలయ్యారు.టిడిపి కూటమి వ్యూహం పనిచేయడంతో జగన్ విలవిలలాడక తప్పలేదు. ఇప్పుడు అదే కూటమిని కొనసాగించాలని చంద్రబాబు భావిస్తున్నారు. మరోసారి జగన్ దెబ్బ కొడితే వైసీపీ అన్నదే ఈ రాష్ట్రంలో ఉండదని చంద్రబాబుతో పాటు పవన్ సైతం ఒక అంచనాకు వచ్చారు. అందుకే జాగ్రత్తగా అడుగులు వేస్తున్నారు.ఉమ్మడి కార్యాచరణతో ముందుకు సాగుతున్నారు. 2029 ఎన్నికల వరకు ఎటువంటి అరమరికలు లేకుండా ముందుకు సాగాలని భావిస్తున్నారు. అయితే ఐదేళ్ల కాలం.. కళ్ళు మూసుకుంటే ఇట్టే కరిగిపోతుంది అని జగన్ చెబుతున్నారు. కానీ అంత ఈజీ కాదు. ప్రతి వైపు నుంచి జగన్ ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది.

జగన్ అక్రమాస్తుల కేసులు తెరపైకి రానున్నాయి. ఇన్ని రోజులు హాజరు నుంచి మినహాయింపు వచ్చింది. ఇకనుంచి పరిస్థితి అలా ఉండదు. ఇప్పటికే హాజరు మినహాయింపు పిటిషన్ ను కోర్టు కొట్టి వేసింది. దీంతో ప్రతి శుక్రవారం కేసుల విచారణకు హాజరు కావాల్సి ఉంటుంది. మరోవైపు వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా తెరపైకి రానుంది. ఇప్పటికే ఈ కేసులో నిందితుడిగా కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఉన్నారు. ఆయన తండ్రి భాస్కర్ రెడ్డి జైలుకు వెళ్లి వచ్చారు. వివేక హత్య కేసులో కుట్ర కోణం ఉందని.. కొందరి పెద్దల ప్రాద్బలంతోనే చంపారని వివేక కుమార్తె సునీత ఆరోపించారు. సిబిఐ సైతం ఇందులో రాజకీయ కుట్ర కోణం ఉందని స్పష్టం చేసింది. మరోవైపు కోడి కత్తి కేసు విచారణ కూడా ప్రారంభం కానుంది. గత ఎన్నికలకు ముందు విశాఖ ఎయిర్పోర్టులో విపక్ష నేతగా ఉన్న జగన్ పై కోడి కత్తి దాడి జరిగింది. కానీ కేసు విచారణకు ఏ మాత్రం జగన్ సహకరించలేదు. దాదాపు ఐదేళ్లపాటు నిందితుడు శీను రిమాండ్ ఖైదీగా ఉండిపోయారు. దేశ చరిత్రలోనే ఒక కేసు విచారణలో రిమాండ్ ఐదేళ్ల పాటు కొనసాగడం గమనార్హం. లోతైన దర్యాప్తు పేరిట కాలయాపన చేసిన జగన్ విచారణకు హాజరు కాలేదు. ఇప్పుడు మాత్రం తప్పకుండా విచారణకు హాజరు కావాల్సిందే.

గత ఐదు సంవత్సరాలుగా జగన్ సర్కార్ అనేక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యంగా మద్యం పాలసీని ప్రవేశపెట్టింది. ప్రభుత్వమే నేరుగా మద్యం దుకాణాలను నడిపింది. మద్యం తయారీ, సరఫరా, అమ్మకాలు.. ఇలా అన్ని ప్రభుత్వమే చేపట్టింది. అయితే ప్రభుత్వ పెద్దలతో పాటు వైసిపి కీలక నేతలకు మద్యం విధానంలో భారీగా ప్రయోజనం చేకూరినట్లు ఆరోపణలు ఉన్నాయి. టిడిపి కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన మరుక్షణం ఏపీ బేవరేజెస్ చైర్మన్ వాసుదేవ రెడ్డి ఇంట్లో తనిఖీలు ప్రారంభం కావడం కూడాఆందోళన కలిగిస్తోంది.ఆయన అప్రూవర్ గా మారారని.. అప్పటి సీఎం జగన్ తో పాటు ప్రభుత్వ పెద్దల ఆదేశాల మేరకు మద్యం పాలసీని అనుకూలంగా తయారు చేసినట్లు.. ఆయన ఒప్పుకున్నట్లు కూడా ప్రచారం జరుగుతోంది. మద్యం కుంభకోణం తప్పకుండా జగన్ మెడకు చుట్టుకోవడం ఖాయమని టాక్ నడుస్తోంది.

మరోవైపు పార్టీ పునర్నిర్మాణం జగన్ ముందు ఉన్న లక్ష్యం. 2029 నాటికి నియోజకవర్గాల పునర్విభజన ఖాయం. 175 నియోజకవర్గాలు.. 250 వరకు పెరగనున్నాయి. అంటే మరో 75 నియోజకవర్గాలు అన్నమాట. అదే జరిగితే వైసీపీకి బలం ఉన్న నియోజకవర్గాలు ముక్కలు కావడం ఖాయం. ఎందుకంటే చంద్రబాబు కేంద్ర ప్రభుత్వంలో కీలకంగా ఉన్నారు. ఎన్డీఏ ప్రభుత్వ సుస్థిరతకు టిడిపి మద్దతు అవసరం. అందుకే నియోజకవర్గాల పునర్విభజనను తనకు అనుకూలంగా మలుచుకుంటారు చంద్రబాబు. 2009లో నియోజకవర్గాల పునర్విభజన జరిగినప్పుడు ఎక్కువగా నష్టపోయింది తెలుగుదేశం పార్టీ. టిడిపి బలంగా ఉన్న నియోజకవర్గాలను విభజించి పునర్విభజన చేశారు. దీంతో ఆ ఎన్నికల్లో టిడిపికి ఘోర పరాజయం తప్పలేదు. ఇప్పుడు కూడా చంద్రబాబు అదే పని చేస్తారు. రాయలసీమలో వైసీపీకి బలమైన నియోజకవర్గాలను రిజర్వ్డ్ గా మార్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఇలా ఎలా చూసినా జగన్కు మున్ముందు కష్టాలు తప్పేలా లేవు.