Mudragada Padmanabham Reddy: ముద్రగడ పేరు మార్చారా? ఆయన గెజిట్ పబ్లికేషన్ కు ప్రభుత్వం ఆమోద ముద్ర వేసిందా? ఆయన పేరు పద్మనాభ రెడ్డి గా మారిందా? సోషల్ మీడియాలో దీనిపైనే పెద్దఎత్తున చర్చ నడుస్తోంది. పిఠాపురంలో పవన్ గెలిస్తే తన పేరును ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మార్చుకుంటానని కాపు రిజర్వేషన్ ఉద్యమ నేత ప్రకటించారు. పిఠాపురంలో పవన్ గెలిచే ఛాన్స్ లేదని తేల్చి చెప్పారు. సినిమా వాళ్లకు పిఠాపురం ప్రజలు అవకాశం ఇవ్వరని కూడా చెప్పుకొచ్చారు. కానీ ముద్రగడ జోష్యాలు పనిచేయలేదు. పిఠాపురం నుంచి పవన్ అత్యధిక మెజారిటీతో గెలిచారు. మంత్రితో పాటు డిప్యూటీ సీఎం గా ప్రమాణ స్వీకారం చేశారు. బాధ్యతలు కూడా స్వీకరించారు. ఈ నేపథ్యంలో ముద్రగడ పద్మనాభం పేరు మార్పిడికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
జూన్ 4న ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అక్కడకు 24 గంటల వ్యవధిలోనే ముద్రగడ స్పందించారు. పేరు మార్చుకునేందుకు సిద్ధమయ్యారు. పద్మనాభ రెడ్డిగా వీరు మార్చేందుకు కోసం పేపర్లు సిద్ధం చేసుకున్నట్లు ప్రకటించారు. సవాల్ లో ఓడిపోయాను కాబట్టి నా పేరు మార్చుకోవడానికి సిద్ధంగా ఉన్నానని ముద్రగడ చెప్పుకొచ్చారు. నా రాజకీయ ప్రయాణం జగన్ తోనే కొనసాగుతుందని స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ప్రభుత్వం ఆయన విన్నపాన్ని మన్నించిందని.. ముద్రగడ పద్మనాభ రెడ్డి గా పేరును మార్చుతూ ఉత్తర్వులు ఇచ్చిందని ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే ముద్రగడ రాజకీయ జీవితంలో ఏదో మచ్చగా మారనుంది. కానీ అది ఉత్త ప్రచారంగానే తేలుతోంది. ప్రభుత్వం నుంచి ఎటువంటి ఉత్తర్వులు రాలేదని తెలుస్తోంది.
ముద్రగడ పద్మనాభం ది సుదీర్ఘ రాజకీయ నేపథ్యం. తెలుగుదేశం పార్టీలో ఆయన రాజకీయ ప్రస్థానం ప్రారంభమైంది. కాకినాడ ఎంపీగా తెలుగుదేశం పార్టీ తరఫున గెలిచారు ముద్రగడ. చంద్రబాబుతో విభేదాల వల్ల కాంగ్రెస్ గూటికి చేరారు. అక్కడ కూడా రాజకీయంగా కలిసి రాలేదు. దీంతో కాపు రిజర్వేషన్ ఉద్యమాన్ని ఎత్తుకున్నారు. రాజకీయ నాయకుడి కంటే కాపు రిజర్వేషన్ ఉద్యమ నాయకుడిగానే ముద్రగడకు మంచి పేరు ఉంది. 2014 ఎన్నికల్లో కాపులకు రిజర్వేషన్ కల్పిస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ హామీ అమలు కాకపోవడంతో ఉద్యమాన్ని పతాక స్థాయికి తీసుకెళ్లారు ముద్రగడ. ఉద్యమం హింసాత్మక ఘటనలకు దారితీయడంతో ముద్రగడపై కేసులు కూడా నమోదయ్యాయి. చంద్రబాబు సర్కార్ స్పందించి కాపులకు ఐదు శాతం ఈ బీసీ రిజర్వేషన్లు కల్పించింది. అయితే ముద్రగడ వైసీపీకి అనుకూలంగా పని చేశారన్న ప్రచారం ఉండేది. కాపులను వైసీపీ వైపు టర్న్ చేసేందుకే ఉద్యమాన్ని నడిపినట్లు అనుమానాలు కూడా ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే ఆయన వ్యవహార శైలి ఉంది. 2019లో వైసీపీ పవర్ లోకి వచ్చిన తర్వాత ఆ పార్టీలోకి ముద్రగడ వెళ్తారని ప్రచారం జరిగింది. కానీ సరిగ్గా 2024 ఎన్నికలకు ముందు ముద్రగడ వైసీపీలో చేరారు. కానీ ప్రత్యక్ష ఎన్నికల్లో పోటీ చేయలేదు.
వాస్తవానికి జనసేనలో చేరడానికి ముద్రగడ సిద్ధమయ్యారు. కానీ పవన్ నుంచి ఆహ్వానం లేకపోవడంతో మనస్థాపంతో రగిలిపోయారు. ఆ బాధతోనే వైసీపీలో చేరారు. కేవలం పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసుకున్నారు. పిఠాపురంలో ఆయన గెలవరని కూడా తేల్చి చెప్పారు. ఒకవేళ గెలిస్తే తాను పద్మనాభరెడ్డిగా పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు. ఇప్పుడు పవన్ గెలవడం, డిప్యూటీ సీఎం గా బాధ్యతలు స్వీకరించడంతో.. ముద్రగడ చుట్టూ ప్రచారం ప్రారంభమైంది. ఆయన పేరు ముద్రగడ పద్మనాభ రెడ్డి గా మారిందని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. జీవోతో సహా ట్రోల్ చేస్తున్నారు. అయితే సోషల్ మీడియాలో చూస్తున్న వారు ఆశ్చర్యపోతున్నారు. ముద్రగడకు మరీ ఇంత అవమానమా? ఆయన ఏరి కోరి ఈ పరిస్థితిని తెచ్చుకున్నారని ఎక్కువమంది అభిప్రాయపడుతున్నారు.