Homeఆంధ్రప్రదేశ్‌Different Marriage In Nuvvalarevu: రెండేళ్లకోసారి పెళ్లి.. వరుడి మెడలో తాళి.. వింతైన...

Different Marriage In Nuvvalarevu: రెండేళ్లకోసారి పెళ్లి.. వరుడి మెడలో తాళి.. వింతైన పెళ్లి మనదగ్గరే

Different Marriage In Nuvvalarevu: సాధారణంగా ఏడాది పొడవునా ఉండే మంచి ముహూర్తాలు చూసుకొని వివాహాలు చేస్తుంటారు. కానీ ఆ గ్రామంలో మాత్రం ప్రతీ రెండేళ్లకు ఒకసారి.. ఒకే ముహూర్తంలో వందలాది పెళ్లిళ్లు చేస్తారు. ఒకేసారి మాంగళ్యధారణ చేయిస్తారు. ముందుగా వధువు మెడలో వరుడు తాళి కడతాడు. తరువాత వరుడి మెడలో తాళి రూపంలో ఉండే బంగారాన్ని వధువు కడితే వివాహ తంతు పూర్తయినట్టే. వింతగా ఉంది కదూ ఈ ఆచారం. శ్రీకాకుళం జిల్లా వజ్రపుకొత్తూరు మండలం నువ్వలరేవు గ్రామంలో గత 300 సంవత్సరాలుగా కొనసాగుతుంది సంప్రదాయం. సముద్ర తీర గ్రామమైన నువ్వలరేవు జనాభా 12 వేల మంది. 95 శాతం కేవిటి (మత్స్యకారుల్లో ఒక తెగ) సామాజిక వర్గీయులే. చేపల వేట, క్రయ విక్రయాలే ప్రధాన జీవనాధారం. వివాహం, విందు భారం కావడంతో పూర్వీకులే ‘సామూహిక వివాహాలు’కు శ్రీకారం చుట్టినట్టు గ్రామపెద్దలు చెబుతున్నారు. గ్రామంలో వివాహ వేడుకలకు దాదాపు 300 సంవత్సరాల చరిత్ర ఉందంటున్నారు.

Different Marriage In Nuvvalarevu
Different Marriage In Nuvvalarevu

ఇక్కడ కులం కట్టబాట్లు ఎక్కువ. కులపెద్దలు ‘బెహరా’లదే కీలక పాత్ర. ప్రతీ రెండేళ్లకోసారి బెహరాల నేతృత్వంలో గ్రామస్థులు సమావేశం నిర్వహిస్తారు. ఆ రోజు సామూహిక వివాహాలకు ముహూర్తాన్ని నిర్ణయిస్తారు. గ్రామంలో చాటింపు వేయించి వివాహాలకు సిద్ధంగా ఉన్నవారి పేర్లు నమోదు చేయిస్తారు. సామూహిక విందుకు వధూవరుల కుటుంబసభ్యులు కొంత మొత్తాన్ని బెహరాలకు చెల్లిస్తారు. ఇంటివద్ద పెళ్లి ఖర్చులు మాత్రం ఇరు కుటుంబాలే పెట్టుకోవాల్సి ఉంటుంది. మూడు రోజుల పాటు గ్రామంలో సందడి వాతావరణం కనిపిస్తుంది. వేదమంత్రాలు, సన్నాయిమేళాల వాయిద్యాలే వినిపిస్తాయి. విద్యుద్దీప కాంతులతో వీధులు కళకళాడుతుంటాయి. మూడు రోజుల వేడుకల్లో భాగంగా తొలిరోజు పందిరి రాట వేస్తారు. ఒకరిపై ఒకరు రంగులు చల్లుకుంటూ దాండియా తరహాలో ఆడలాడతారు. రెండో రోజు కీలక ఘట్టం మాంగళ్యధారణ కార్యక్రమం నిర్వహిస్తారు. మూడో రోజు విందు కార్యక్రమాలుంటాయి.

Different Marriage In Nuvvalarevu
Different Marriage In Nuvvalarevu

Also Read: AP Debt Burden: ఏపీ ప్రభుత్వ అప్పులపై క్లారిటీ.. కేంద్రం కన్నెర్ర

అంతా బెహరాల పర్యవేక్షణలో..
సామూహిక వివాహాలు ఒక పద్ధతి ప్రకారం నిర్వహిస్తారు. గ్రామపెద్దల బెహరాల పర్యవేక్షణలో పవిత్రంగా భావించి వివాహాలు చేస్తారు. వధూవరులకు వదిన వరుసయ్యేవారు ‘పేరంటాలు’గా ఉండి పెళ్లి జరిపిస్తారు. ఆర్థికంగా ఉన్నవారైనా నిర్ణయించిన ముహూర్తానికే మాంగళ్యధారణ చేయాల్సి ఉంటుంది. గ్రామదేవత బృందావతి అమ్మవారికి తొలిపూజ చేసి వివాహ కార్యక్రమాలకు శ్రీకారం చుడతారు. ఆలయం వద్ద కుమ్మర్లు తెచ్చిన మట్టి కుండలకు ప్రత్యేక పూజలు చేస్తారు. ఆ కుండలతోనే సమీప చెరువులో నీటిని తెచ్చి అమ్మవారికి అభిషేకం చేస్తారు. అక్కడి నుంచి తెచ్చిన మిగతా నీటితో వధూవరులకు మంగళస్నానాలు చేయిస్తారు. వరుడి ఇంటి నుంచి తెచ్చిన సామగ్రితోనే వధువును అలంకరిస్తారు. వధువుకు మేనమామలు సారె పెడతారు. సాయంత్రం వరుడుని ముస్తాబు చేసిన అనంతరం పందిరి కింద పురోహితుడు దీవిస్తాడు. అనంతరం బంధువులు, స్నేహితులతో ఊరేగింపుగా అమ్మవారి ఆలయానికి చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజల అనంతరం గ్రామపెద్దలు, స్నేహితులు, బంధువులకు పెళ్లికి ఆహ్వానిస్తారు. వధువు కుటుంబసభ్యులకు సైతం సాదరంగా ఆహ్వానం పలుకుతారు.సరిగ్గా ముహూర్తానికి గంట ముందు వధూవరులను పందిరి కిందకు చేర్చుతారు. ముందుగా వరుడు వధువు మెడలో తాళి కడతాడు. అనంతరం వధువు వరుడి మెడలో ‘దురుషం’ అనే చిన్న బంగారు ఆభరణం కట్టడం ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది.

Different Marriage In Nuvvalarevu
Different Marriage In Nuvvalarevu

ప్రత్యేకతలివీ..
నువ్వలరేవులో 300 ఏళ్లుగా సంప్రదాయం ప్రకారం కొనసాగుతున్న సామూహిక వివాహాలకు ఎంతో ప్రత్యేకత ఉంది. వధూవరులిద్దరూ ఈ గ్రామస్తులే కావడం గమనార్హం. పది పదిహేను కుటుంబాలు మినహా అందరిదీ ఒకే కులం. అంతా బంధువులే. దీనితో ఏ ఇంట్లో పెళ్లి జరిగినా అందరినీ పిలవాలి. ఊరంతటినీ పిలిచి భోజనం పెట్టాలంటే.. ఇక పెళ్లి చేసినట్టే. అందుకే గ్రామస్థులంతా కలిసి రెండేళ్లకోసారి వివాహాల పద్ధతికి శ్రీకారం చుట్టారు. ఎవరి పెళ్లి వారింటి వద్దే జరుగుతుంది. అయితే బంధువులందరినీ భోజనాలకు పిలవరు. ఒక్కో పెళ్లికి ఇరవై, ముప్పై కుటుంబాలవారు భోజనాలకు వెళతారు. ఎవరు ఏ ఇంటికి వెళ్లాలనే విషయాన్ని గ్రామ పెద్దలు నిర్ణయిస్తారు. రెండేళ్లకోసారి పెద్ద సంఖ్యలో జరిగే పెళ్లిళ్లను చూసేందుకు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు వస్తుంటారు. ఈ నెల 11 నుంచి 13 వరకూ వివాహాలు చేయడానికి పెద్దలు ముహూర్తం నిర్ణయించారు. ఈ ఏడాది సుమారు 100 జంటలు ఒకటి కానున్నాయి. రెండేళ్లకు ఒకసారి సామూహిక వివాహాలు జరిపించడం ఆనవాయితీగా వస్తోంది. 2019లో సామూహిక వివాహాలు జరిగాయి. కొవిడ్‌ వ్యాప్తి నేపథ్యంలో గత ఏడాది వివాహాలు నిశ్చయించలేదు. దీంతో ఈ సారి మూడేళ్ల తరువాత సామూహిక వివాహాలు జరగనున్నాయి.

Also Read:Alliance Politics In AP: ఏపీలో పొత్తు రాజకీయం.. బీజేపీ లెక్కేమిటి?

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version