Homeఆంధ్రప్రదేశ్‌CM Chandrababu: కూటమిలో లుకలుకలు.. వైసిపి ఆశలు సజీవం.. చంద్రబాబు, పవన్ ఏం చేస్తారో?

CM Chandrababu: కూటమిలో లుకలుకలు.. వైసిపి ఆశలు సజీవం.. చంద్రబాబు, పవన్ ఏం చేస్తారో?

CM Chandrababu: కూటమిలో లుకలుకలు ప్రారంభమయ్యాయా? మూడు పార్టీల మధ్య సమన్వయం కొరవడుతోందా? విభేదాలకు దారితీస్తోందా? ఇదే పరిస్థితి కొనసాగితే పూర్తి ధర్మానికి విఘాతం కలగడం ఖాయమా? అంటే అవుననే సమాధానం వినిపిస్తోంది. జరుగుతున్న పరిణామాలు కూడా అలానే ఉన్నాయి. ఈ ఎన్నికల్లో కూటమి గెలిచింది. ఏకంగా మూడు పార్టీలు కలిసి 164 అసెంబ్లీ సీట్లు సాధించాయి. మూడు పార్టీలు కలిసి ఉమ్మడిగా ప్రభుత్వాన్ని నడుపుతున్నాయి. జనసేనకు మూడు మంత్రి పదవులు, బిజెపికి ఒక క్యాబినెట్ మినిస్టర్ పదవి దక్కింది. అయితే మరో దశాబ్ద కాలం పాటు పొత్తు ధర్మం కొనసాగాలని చంద్రబాబుతో పాటు పవన్ భావిస్తున్నారు. ఇదే విషయాన్ని ఆ పార్టీల ఎమ్మెల్యేలకు, శ్రేణులకు హితబోధ చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో మూడు పార్టీల శ్రేణుల మధ్య సమన్వయం లోపిస్తే.. అది అంతిమంగా వైసీపీకి ప్రయోజనం చేకూరుస్తుందని హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. అయితే జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. టిడిపి డీలా పడుతోంది. అక్కడ దశాబ్దాల కాలంగా జండా మోసిన టిడిపి శ్రేణులు ఉన్నాయి. వారిని జనసేన ఎమ్మెల్యేలు కలుపుకొని వెళ్లడం లేదన్నది ప్రధాన ఆరోపణ. ఈ తరుణంలో జనసేన ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్న చోట ఇబ్బందికర పరిస్థితులు ఉన్నాయి. ఎప్పటికప్పుడు విభేదాలు వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఈరోజు ప్రారంభమైన పల్లె పండుగలో రాష్ట్రవ్యాప్తంగా చాలా నియోజకవర్గాల్లో విభేదాల పర్వం బయటపడింది. ముఖ్యంగా కందుల దుర్గేష్ ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో అయితే టిడిపి శ్రేణులు నిలదీసినంత పని చేశారు. దీంతో ఒక్కసారిగా ఈ అంశం సంచలనంగా మారింది.

* చివరి నిమిషంలో నిడదవోలుకు
ఈ ఎన్నికల్లో చివరి నిమిషంలో నిడదవోలు నియోజకవర్గ టికెట్ దక్కించుకున్నారు కందుల దుర్గేష్. అటు టిడిపి శ్రేణులు సైతం ఆయన రాకను వ్యతిరేకించాయి. అయితే అధినేత చంద్రబాబు సర్ది చెప్పడంతో సమ్మతించాయి. అయితే అక్కడ టిడిపి శ్రేణులతో మంత్రికి గ్యాప్ ఉంది. ఈరోజు ప్రారంభమైన పల్లె పండుగ కార్యక్రమానికి టిడిపి శ్రేణులకు ఆహ్వానం లేదు. ఈ తరుణంలో నియోజకవర్గంలో పర్యటించిన మంత్రి కందుల దుర్గేష్ ను టిడిపి శ్రేణులు నిలదీసినంత పని చేశాయి. అయితే మరోసారి ఇలా జరగకుండా చూసుకుంటానని కందుల దుర్గేష్ వారికి సముదాయించడం విశేషం.

* అన్నిచోట్ల అదే పరిస్థితి
మొన్న ఆ మధ్యన ధర్మవరంలో మంత్రి సత్య కుమార్ యాదవ్ ను టిడిపి శ్రేణులు అలానే నిలదీసినంత పని చేశాయి. అయితే ఈ ఇద్దరే కాదు. రాష్ట్రవ్యాప్తంగాబిజెపి, జనసేన ప్రాతినిధ్యం వహిస్తున్న 29 అసెంబ్లీ స్థానాల్లో టిడిపి శ్రేణులు ఇదే దూకుడును కనబరుస్తున్నాయి. స్థానిక ఎమ్మెల్యేలతో విభేదిస్తున్నాయి. దీంతో ఒక రకమైన గందరగోళ వాతావరణం కొనసాగుతోంది. పరిస్థితి నివురుగప్పిన నిప్పులా మారుతోంది. రెండు దశాబ్దాల పాటు పొత్తు కొనసాగాలన్న అధినేతల ఆకాంక్షలకు తగ్గట్టు పరిస్థితి లేదు. ఇలానే కొనసాగితే ఇబ్బందికర పరిస్థితులు తప్పేలా లేవు. మరి పార్టీ అధినేతలు ఎలాంటి ఆదేశాలు ఇస్తారో చూడాలి.

Dharma Raj
Dharma Rajhttps://oktelugu.com/
Dharma Raj is a Senior Journalist who has good experience in reporting and had worked with top Media Organizations. He Contributes articles on AP Politics.
Exit mobile version